పోలీసు అధికారికి 15 ఏళ్ల జైలు
న్యూఢిల్లీ: అత్యాచారం, మోసం కేసులో ఢిల్లీ పోలీసు అధికారి ఒకరికి అడిషనల్ సెషన్స్ కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధించింది. మొదటి పెళ్లిని దాచిపెట్టి రెండో పెళ్లి చేసుకున్న నేరానికి అతడికీ శిక్ష పడింది.
నిందితుడు రవి రాథీతో బాధితురాలికి పోలీసు ట్రైనింగ్ కాలేజీలో 2009లో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ 2013, అక్టోబర్ లో రహస్యంగా పెళ్లిచేసుకున్నారు. అయితే అప్పటికే అతడికి పెళ్లైన విషయం తర్వాత బయటపడింది. అదే ఏడాది మే నెలలో మరో మహిళను అతడు పెళ్లాడినట్టు తెలియడంతో బాధితురాలు కోర్టును ఆశ్రయించింది.
మరొకరు ఇటువంటి నేరాలకు పాల్పడకుండా ఉండేందుకు ఈ శిక్ష విధించినట్టు న్యాయమూర్తి వీరంద్ర భట్ పేర్కొన్నారు. ఇద్దరు మహిళల జీవితాలను నాశనం చేయడమే కాకుండా వారిని మోసం చేశాడని అన్నారు. ఇద్దరు మహిళల ఎమోషన్స్, సెంటిమెంట్స్ తో ఆడుకున్నాడని తెలిపారు. పవిత్రమైన వివాహ బంధాన్ని అపహాస్యం చేశాడని, అతడిని గుణపాఠం నేర్పే శిక్ష విధించడం కరెక్టేనని అభిప్రాయపడ్డారు.