డెంటల్ కౌన్సెలింగ్
నాకు ఆర్నెల్ల క్రితం పంటి నొప్పి వచ్చింది. దాంతో డెంటిస్ట్ పై వరసలో పళ్లలో, కింది వరస పళ్లలో రెండు కొత్త క్యాప్స్ పెట్టారు. మళ్లీ రెండు నెలలకు నొప్పి, చిగురువాపు వచ్చాయి. అప్పుడు డెంటిస్ట్ క్యాప్స్ తొలగించి క్లీన్ చేసి మళ్లీ వాటిని తిరిగి అమర్చారు. కొంతకాలంలోనే ఇలా రెండుమూడుసార్లు చేయాల్సి వచ్చింది. నొప్పి నివారణ మందులు వాడుతున్నప్పుడు బాగానే ఉన్నా మళ్లీ మళ్లీ నొప్పి వస్తోంది. నా సమస్యకు సరైన పరిష్కారం చెప్పండి.
- బాలయ్య, విశాఖపట్నం
ఇన్నిసార్లు చికిత్స జరిగాక కూడా మీరు చెప్పిన విధంగా మాటిమాటికీ పంటి నొప్పి, చిగురు వాపు రావడం పంటి ఆరోగ్యానికి సరైన సూచన కాదు. మాటిమాటికీ క్యాప్‌ను తీసి మళ్లీ అమర్చడం వల్ల మీకు ఉన్న సమస్య తీరదు. నొప్పి నివారణ మందుల్ని మాటిమాటికీ వాడటంతో డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చి మళ్లీ అదో సమస్య కావచ్చు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వ్యాధినిర్ధారణలోగాని, చికిత్సలో ఏదో లోపం ఉన్నట్లుగా అనిపిస్తోంది.
మీకు నొప్పి వచ్చినప్పుడు మందులు వాడుతూ ఉండటం కంటే... సమస్య పూర్తిగా పరిష్కారమయ్యేలా అవసరాన్ని బట్టి సరైన చికిత్స చేయించాల్సి ఉంటుంది. మీరు మరో డెంటిస్ట్‌ను కలిసి వారి అభిప్రాయం తీసుకోండి.
- డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి
ఆర్థోడాంటిస్ట్ స్మైల్ మేకర్స్ డెంటల్ హాస్పిటల్స్, మూసారంబాగ్, హైదరాబాద్