doctors neglegency
-
జగిత్యాల పెద్దాసుపత్రి వైద్యుల నిర్లక్ష్య వైఖరి
-
దారుణం: విద్యుత్ నిలిచిపోవడంతో నలుగురు నవజాత శిశువులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదంచోటుచేసుకుంది. సర్గుజా జిల్లాలోని అంబికాపూర్‌లోని ప్రభుత్వ మెడికల్ కళాశాల అసుపత్రిలో నలుగురు నవజాత శిశువులు మృత్యువాత పడ్డారు. ఆస్పత్రిలో నాలుగు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల వెంటిలేటర్ పనిచేయకపోవడంతో ఆక్సిజన్ అందక నలుగురు పసికందులు మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో అర్థరాత్రి మూడు గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే శిశువుల మృతికి కారణమని మండిపడ్డారు. అయితే విద్యుత్ అంతరాయం కారణంగా పిల్లలు చనిపోయారనే విషయాన్ని ఆస్పత్రి సిబ్బంది బయటపెట్టలేదు. ఆసుపత్రిలో శిశువులు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి టీఎస్ సింగ్ స్పందించారు. దీనిపై ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, సమగ్ర దర్యాప్తు జరపాలని ఆరోగ్య కార్యదర్శిని ఆదేశించారు. త్వరితగతిన విచారణ జరిపి దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఛత్తీస్‌గఢ్ గవర్నర్ అనుసూయ యుకే శిశువుల మరణాలపై దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చనిపోయిన శిశువు ఒకరోజు నుంచి నలుగురు రోజుల వయసున్న వారని కలెక్టర్ కుందన్ కుమార్ పేర్కొన్నారు. ఆ నలుగురు శిశువుల ఆరోగ్య పరిస్థితి విషయమంగా ఉండడంతో స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్లో ఉంచారని, వారిలో ఇద్దరినీ వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. ఉదయం 5:30 నుంచి 8:30 గంటల మధ్య నలుగురు చిన్నారులు చనిపోయారని ఆయన వెల్లండిచారు. అయితే కరెంట్ లోపంతోనే ఈ ఘటన జరిగిందని చెప్పలేమని అన్నారు. వెంటిలేటర్లు కూడా ఆగిపోలేదని, పూర్తి వివరాలపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. వెంటిలేటర్ ఆగిపోయిందా లేదా అనే విషయం విచారణలో తెలుస్తుందని పేర్కొన్నారు. చదవండి: బెంగళూరులో దారుణం...ఇటుక రాయితో తల పగలగొట్టి చంపేశారు -
వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలి.. సంతోషం ఆవిరి!
మాలూరు: ఎన్నో ఆశలతో ఆస్పత్రికి వెళ్లినవారికి విషాదమే మిగిలింది. ప్రసూతి కోసం వచ్చిన మహిళకు సాధారణ ప్రసవం చేస్తామని చెప్పి, చివరకు మా చేత కాదని జిల్లాస్పత్రికి పంపించగా అక్కడ తల్లీ శిశువు కన్నుమూశారు. ఈ విషాద సంఘటన కర్నాటకలోని కోలారు జిల్లా మాలూరు తాలూకాలోని దొడ్డశివార గ్రామంలో జరగ్గా ఆలస్యంగా వెలుగుచూసింది. సహజ ప్రసవం చేస్తామని జాప్యం వివరాలు... దొడ్డశివార ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రసవం కోసం గర్భిణి సుధ (34) శుక్రవారం చేరింది. నొప్పులు ప్రారంభం కాగా వైద్యులు సాధారణ ప్రసవం చేయిస్తామని చెప్పి వేచి చూశారు. సాయంత్రం చివరికి ఫిట్స్ వచ్చాయని చెప్పారు. కాన్పు చేయకపోగా పరిస్థితి బాగాలేదని జిల్లాస్పత్రికి వెళ్లాలని సూచించారు. అక్కడకు వెళ్లగా ఆడశిశువుకు జన్మనిచ్చి సుధ ప్రాణాలు వదిలింది. కొంతసేపటికి బిడ్డ కూడా చనిపోయింది. సుధకు భర్త రవి, ఆరేళ్ల పాప ఉన్నారు. సోమవారం కుటుంబీలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు ఆందోళన చేయడంతో విషయం వెలుగుచూసింది. సరైన వైద్యం చేయని వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తాలూకా వైద్యాధికారి డాక్టర్ ప్రసన్న, ఎస్ఐ అనిల్‌కుమార్‌లు చేరుకుని విచారణ చేశారు. తప్పు చేశారని తేలితే చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పారు. -
Hyderabad: వైద్యుల నిర్లక్ష్యం.. నిండు గర్భిణి మృతి
సాక్షి, హైదరాబాద్: వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే గర్భిణి మృతి చెందిందని బాధితులు ఆస్పత్రి యాజమాన్యంపై పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలం పెద్దచెప్యాల గ్రామానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి, మౌనిక (31) భార్యాభర్తలు. కాగా శ్రీకాంత్‌రెడ్డి సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ ఆల్వాల్‌లోని సాయిబాబానగర్‌లో నివాసముంటున్నాడు. మౌనిక గర్భవతి కావడంతో ప్రసవం కోసం ఈ నెల 15వ తేదీ ఉదయం 8 గంటలకు ఎన్‌సీఏల్ నార్త్‌లో ఉన్న అంకుర ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఉదయం నుంచి మౌనిక ఆరోగ్యంగానే ఉందని చెప్పిన వైద్యులు సాయంత్రం ఆపరేషన్ థియేటర్లో ఫిట్స్ రావడంతో గుండెపోటుతో మృతి చెందిందని తెలిపారు. దీంతో ఆందోళన చెందిన మౌనిక కుటుంబ సభ్యులు ఆస్పత్రి యాజమాన్యంపై పేట్‌బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Hyderabad: జాగ్రత్త సుమా!.. అధికారులకు కేటీఆర్ హెచ్చరిక.. -
పురిటి నొప్పులతో ఆసుపత్రికి.. అమ్మతనం ఆస్వాదించకుండానే..
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: తొలి కాన్పుతో అమ్మతనం ఆస్వాదించాలని ఆమె ఎన్నో కలలు కన్నది. గర్భందాల్చిన నాటి నుంచే పుట్టబోయే బిడ్డను ఊహించుకుంటూ మురిసిపోయింది. నెలనెలా పెరుగుతుంటే తన్మయం పొందింది. నెలలు నిండి పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ వైద్యుల నిర్లక్ష్యంతో కాన్పు కాకుండానే కన్నుమూసింది. ఈ విషాద సంఘటన ఆదిలాబాద్ రిమ్స్‌లో శుక్రవారం జరిగింది. అసలేం జరిగింది.. ఆదిలాబాద్ పట్టణం పుత్లీబౌళి సమీపంలోని కేవీ.నగర్‌కు చెందిన కొర్రి రాజుకు గతేడాది జూలై 1న ఇచ్చోడ మండలం బోరిగామకు చెందిన అక్షిత(22)తో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. గురువారం పురుటినొప్పులు రావడంతో సాయంత్రం 4 గంటలకు కుటుంబ సభ్యులు రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ప్రసవానికి సమయం ఉందని చెప్పడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో మళ్లీ నొప్పులు రావడంతో ఈ విషయాన్ని సమీపంలోని ఆశ కార్యకర్తకు తెలియజేశారు. దీంతో ఆమె అంబులెన్స్‌లో రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆమెకు ఫిట్స్ వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రిమ్స్‌కు 4 గంట లకు చేరుకున్నారు. ఆ తర్వాత మెటర్నిటీ వార్డుకు తీసుకెళ్లగా వైద్యులు అందుబాటులో లేరు. స్టాఫ్ నర్సులు మాత్రమే ఉన్నారు. వారు అక్షితకు ఇంజెక్షన్ ఇచ్చా రు. ఎలాంటి చికిత్స చేయకపోవడంతో ఉదయం 6 గంటలకు గర్భిణిమృతి చెందింది. మృతదేహంతో ఆందోళన.. వైద్యుల నిర్లక్ష్యంతోనే గర్భిణి మృతిచెందిందని అక్షిత కుటుంబ సభ్యులు, బంధువులు రిమ్స్ ఎదుట ఆందోళనకు దిగారు. ఒకరోజు ముందుగా ఆస్పత్రికి వచ్చినా చికిత్స చేయకుండా తిరిగి ఇంటికి పంపించారని తెలిపారు. మళ్లీ పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకొస్తే వైద్యులు అందుబాటులో లేక చికిత్స చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు అందుబాటులో ఉండి చికిత్స చేస్తే అక్షిత బతికేదని పేర్కొన్నారు. గర్భిణి మరణ వార్త తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, రాష్ట్ర నాయకురాలు సుహాసినిరెడ్డి రిమ్స్‌కు చేరుకున్నారు. బాధితులతో మాట్లాడారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ విచారణ కమిటీ ఏర్పాటు చే స్తామని తెలిపారు. ముగ్గురు సీనియర్ వైద్యులతో వి చారణ జరిపించి వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే శా ఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తల్లడిల్లుతున్న తల్లులు.. గర్భిణులతోపాటు గర్భంలోనే శిశువులు మృత్యువాత పడుతున్న ఘటనలు జిల్లాలో పెరిగిపోతున్నాయి. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఈ సంఘటనలు జరుగుతున్నాయని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఇటీవల జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బాలింతతోపాటు శిశువు మృతిచెందగా, అదే ఆస్పత్రిలో చికిత్స పొందిన ఓ గర్భిణి కడుపులోనే బిడ్డ మృతిచెందింది. రిమ్స్ ఆస్పత్రిలో కూడా ఓ గర్భిణి కడుపులోనే శిశువు మృతిచెందగా కనీసం వైద్యులు బయటకు తీయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రిమ్స్‌లో వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతోనే ఇలాంటివి పునరావృతం అవుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే వైద్యులు ఆ స్పత్రిలో ఉంటున్నారు, తర్వాత ఇళ్లకు వెళ్లిపోతున్నారు. అత్యవసరం ఉన్నప్పుడు సిబ్బంది ఫోన్‌చేసి సమాచారం ఇస్తేనే వస్తున్నారు. వారు వచ్చేసరికి గర్భిణులు, శిశులు మృత్యువాత పడుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు జరుగకుండా చూడాలని కోరుతున్నారు. -
మందు నింపకుండానే సూది
సాక్షి, హుస్నాబాద్(మెదక్): మండలంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం నవ్వులాటగా మారింది. సిరంజిలో మందు నింపకుండానే ఖాళీ సూది ఇచ్చిన తీరు వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. పట్టణానికి చెందిన కేడం సుచిత్ర కరోనా రెండో డోస్ కోసం సోమవారం హుస్నాబాద్ ఆస్పత్రికి వచ్చింది. ఈ క్రమంలో సిరంజిలో వ్యాక్సిన్ మందు నింపి సూది వేయాల్సిన వైద్య సిబ్బంది, మందు నింపకుండానే ఎడమ చేతికి ఇంజక్షన్ ఇచ్చారు. పక్కనే ఉన్న సు చిత్ర తమ్ముడు ఇదేమిటని ప్రశ్నించగా, తెరుకున్న సిబ్బంది తిరిగి కరోనా వ్యాక్సిన్ మందు నింపి మళ్లీ కుడి చేతికి టీకా ఇచ్చారు. ముచ్చట్లలో పడిన సిబ్బంది మందు నింపారో లేదో చూసుకోకుండానే çసూది ఇవ్వడంపై అక్కడున్నవారు వాపోయారు. దీనిపై వివరణ అడగగా మరోసారి పొరపాటు జరకుండా చూస్తామని వైద్య సిబ్బంది తెలిపారు. దీనిపై ఆస్పత్రి వైద్యాధికారి సౌమ్యను ఫోన్లో స్పందించగా, స్పందించలేదు. -
కడుపులో కాటన్ పెట్టి కుట్టేశారు!
భువనగిరి: ప్రసవం కోసం ఆపరేషన్ చేసిన సమయంలో వైద్యులు నిర్లక్ష్యంతో కడుపులో కాటన్ పెట్టి మరిచిపోయారు. అయితే ఇటీవల అనారోగ్యానికి గురైన ఆ మహిళ మంగళవారం మృతి చెందింది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని కేకే ఆస్పత్రి వద్ద వైద్యుల నిర్లక్ష్యంపై మహిళ కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నా చేశారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరికి చెందిన చింతపల్లి ప్రవీణ్ భార్య మమత (21) మొదటి కాన్పు కోసం సంవత్సరం క్రితం భువనగిరి పట్టణంలోని కేకే నర్సింగ్ హోంలో చేరింది. ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్ చేసి కాన్పు చేయగా ఆ మహిళ పాపకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం ఇంటికి వెళ్లిపోయింది. కొన్ని నెలల తర్వాత ఆమె తిరిగి రెండోసారి గర్భం దాల్చింది. ప్రతి నెలా చికిత్స కోసం అదే నర్సింగ్‌హోంకు వెళ్తోంది. ప్రస్తుతం ఆమెకు 6వ నెల. 15 రోజుల క్రితం కడుపులో విపరీతమైన నొప్పి రావడంతో ఆస్పత్రికి వెళ్లగా, వైద్యులు మందులు రాసి ఇంటికి పంపించారు. అయితే నొప్పి తిరగబెట్టడంతో మళ్లీ అదే ఆస్పత్రికి వెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. వెంటనే హైదరాబాద్‌కు వెళ్లగా అక్కడ ఆస్పత్రి వైద్యులు చికిత్స చేయలేమని చెప్పడంతో మరో ఆస్పత్రికి వెళ్లారు. మమత మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు ఈ విధంగా మూడు నాలుగు ఆస్పత్రులు తిరగడంతో ఆమెకు గర్భస్రావమైంది. ఈ సమయంలో సన్‌ఫ్లవర్ ఆస్పత్రి వైద్యులను కుటుంబ సభ్యులు బతిమిలాడటంతో పరిస్థితి విషమించిందని తెలిపి, కుటుంబ సభ్యుల వద్ద హామీ తీసుకుని ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఆమె గర్భంలో కాటన్ ఉన్నట్లుగా గుర్తించారు. ప్రసవం కోసం నిర్వహించిన ఆపరేషన్ సమయంలో రక్తస్రావాన్ని నిరోధించేందుకు ఉంచిన కాటన్ కడుపులోనే మర్చిపోయి కుట్లు వేశారని, ఆ కారణంగా కడుపులో ఇన్ఫెక్షన్ ఏర్పడి ప్రాణానికి ముప్పుగా మారిందని చెప్పారు. అయితే చికిత్స పొందుతూ ఆ గర్భిణి మంగళవారం మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు మమత మృతదేహంతో పట్టణంలోని కేకే నర్సింగ్‌హోం వద్ద ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చారు. ఫిర్యాదు అందిన వెంటనే దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. -
‘వైద్యురాలి నిర్లక్ష్యంతో బాలింత మృతి’
సాక్షి, మన్సూరాబాద్, హైదరాబాద్: ప్రసవం కోసం వచ్చిన మహిళ డాక్టర్ నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందంటూ మన్సూరాబాద్ చంద్రపురికాలనీలోని అరుణ ఆసుపత్రిలో బంధువులు ఆందోళన చేశారు. బంధువులు తెలిపిన మేరకు.. చింతలకుంట చెక్‌పోస్ట్ సమీపంలో ఇంజనీర్స్‌కాలనీలో సువర్ణ –లక్ష్మణ్ దంపతులు నివాసముంటున్నారు. వీరి కుమార్తె ప్రతిభ(27)ను శుక్రవారం మధ్యాహ్నం ప్రసవం కోసం తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకొచ్చారు. సాధారణ కాన్పు చేద్దామని చెప్పిన వైద్యులు అర్ధరాత్రి 2 గంటల సమయంలో కాన్పు కావటం లేదని చెప్పి ఆపరేషన్ చేశారు. ప్రసవం అనంతరం శిశువు ఆక్సిజన్ తీసుకోవటం లేదని, బాలింతకు రక్తస్రావం జరుగుతుంతోందని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. రక్తప్రసరణ నివారణకు ఆపరేషన్ చేయడంతో మరో రెండు ఆపరేషన్లు చేశారన్నారు. అయితే శనివారం ఉదయం 9గంటల ప్రాంతంలో పరిస్థితి విషమంగా ఉందని, అవెర్‌గ్లోబల్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సలహా ఇచ్చారని పేర్కొన్నారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం 3 గంటల ప్రాంతంలో మృతి చెందింది. దీంతో ఆదివారం బంధువులు, కాలనీవాసులు ఎల్బీనగర్లోని అరుణ ఆసుపత్రికి చేరుకుని ఆందోళన చేశారు. ‘డాక్టర్ నిరక్ష్యం వల్లే మృతి చెందింది... మాకు న్యాయం చేయాలంటూ’ నిరసనకు దిగారు. దీంతో ఎల్బీనగర్ పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. అయితే.. అరుణ ఆసుపత్రి వైద్యురాలిని వివరణ కోసం ప్రయత్నిస్తే అందుబాటులో లేరు. సిబ్బంది కూడా లేరు. చదవండి: మహాగణపతి సిద్ధం.. ఖైరతాబాద్ చరిత్రలోనే తొలిసారి బైక్‌పై వెళ్లి.. ఆకస్మిక తనిఖీలు చేపట్టిన హైదరాబాద్ కలెక్టర్ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్న మృతురాలి బంధువులు -
ఠాగూర్ సినిమాను తలపించే సీన్.. అస్సలు తగ్గేదే లే!
సాక్షి, మీర్‌పేట: వైద్యం పేరుతో మోసం చేసి తన భర్త మృతికి కారణమయ్యారని మృతుడి భార్య మీర్‌పేట పోలీసులకు రైజ్ చిల్డ్రన్స్ ఆసుపత్రి యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ మహేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కొత్తపేట హుడాకాంప్లెక్స్‌కు చెందిన పాశం సైదులు గౌడ్ ఏప్రిల్ 26వ తేదీన కరోనా బారిన పడి హస్తినాపురంలోని రైజ్ చిల్డ్రన్స్ ఆసుపత్రిలో చేరాడు. సైదులు పరిస్థితి విషమంగా ఉందని.. హెల్త్‌కార్డు తీసుకోమని రూ.50వేలు నగదు రూపంలో చెల్లిస్తేనే చేర్చుకుంటామని చెప్పడంతో ముందుగా రూ.50వేలు చెల్లించి ఆ తరువాత బెడ్ కోసం ప్రతి రోజు రూ.40వేలు, మాత్రలు, పరీక్షలకు వేర్వేరుగా నగదు చెల్లించారు. మరుసటి రోజు వైద్యులు 6 రెమ్‌డెసివర్ ఇంజెక్షన్లు అవసరమని.. రూ.30వేలకు బ్లాక్ మార్కెట్లో శంకర్ అనే వ్యక్తి వద్ద దొరుకుతాయని చెప్పి ఇంజెక్షన్లు ఇప్పించారని తెలిపారు. ఇదిలా ఉండగా సైదులుకు ప్లాస్మా కావాలని చెప్పడంతో కుటుంబ సభ్యులు రూ.20వేలు చెల్లించారు. ఏప్రిల్ 30వ తేదీన మరికొన్ని పరీక్షలు నిర్వహించాలని అందుకు రూ.60వేలు ఖర్చవుతుందని చెప్పి నగదు చెల్లించాక 14 గంటల తరువాత సైదులు పరిస్థితి విషమించిందని తెలిపారన్నారు. వెంటిలేటర్ అత్యవసరమని లక్ష రూపాయలు చెల్లించాలని తెలిపారు. మే 2వ తేదీన సైదులుకు నాలుగు యూనిట్ల ప్లాస్మా, మందులు అవసరమని, చెప్పి ఐదు రోజుల్లో కోలుకుంటాడని వైద్యులు చెప్పారు. అనంతరం మే 8వ తేదీన సైదులు మృతి చెందాడు. వైద్యం పేరుతో రైజ్ ఆసుపత్రి యాజమాన్యం లక్షల్లో డబ్బు వసూలు చేసి, రెమ్‌డెసివర్ ఇంజెక్షన్లు తన భర్తకు వేయకుండా ఇతరులకు అమ్ముకున్నారని మృతుడి భార్య పేర్కొన్నారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తన భర్త మృతి చెందాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రెమ్‌డెసివర్ ఇంజెక్షన్లు అమ్ముకున్న మేనేజర్ శ్రీధర్‌రెడ్డితో పాటు వైద్యులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రఘుదీప్, మనోహర్‌రెడ్డి, డైరెక్టర్ శిల్పపై చీటింగ్ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
తల్లి ప్రాణం గిలగిల.. గర్భంలో బిడ్డ మృతి
ఖమ్మం వైద్య విభాగం: వైద్యుల నిర్లక్ష్యానికి గర్భస్థ శిశువు బలైంది. నిండు గర్భిణి అనే కనికరం లేకుండా వ్యవహరించడం.. ఆ తల్లికి కడుపు కోతను మిగిలి్చంది. గురువారం ఖమ్మంలో ఈ అమాననీయ సంఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ఖానాపురం యూపీహెచ్ కాలనీకి చెందిన ముసుకుల అశ్విని నిండు గర్భిణి కావడంతో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతాశిశు సంరక్షణ కేంద్రానికి వచి్చంది. ఆమెను పరీక్షించిన వైద్యులు కాన్పు చేసేందుకు కొన్ని టెస్టులు రాశారు. దీంతో కుటుంబ సభ్యులు పరీక్షలు చేయించి డాక్టర్‌కు చూపించారు. పరీక్షల్లో ఆమెకు కామెర్లు ఉన్నట్లు తేలింది. దీంతో ఆపరేషన్ చేయడం కుదరదని, వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లాలని చెప్పారు. తాము నిరుపేదలమని, లాక్డౌన్లో అంతదూరం తీసుకెళ్లలేమని అశ్విని కుటుంబ సభ్యులు డాక్టర్లను వేడుకున్నా ససేమిరా అన్నారు. ఈ క్రమంలో అశ్విని పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. కడుపులో ఇబ్బందిగా ఉందని కుటుంబసభ్యులకు తెలపడంతో డాక్టర్లు మరోసారి పరీక్షించారు. ఈ దశలో ఆమె కడుపులో బిడ్డ మృత్యువాత పడింది. దీంతో కుటుంబ సభ్యులు, అశ్విని కన్నీరు మున్నీరయ్యారు. కనీసం కడుపులోని మృత శిశువును అయినా తీయాలని కుటుంబ సభ్యులు డాక్టర్లను వేడుకున్నా కనికనించలేదు. దీంతో చేసేది లేక నగరంలోని వివిధ ప్రైవేటు ఆస్పత్రులను సంప్రదించారు. అయినా ఎవరూ వైద్యానికి అంగీకరించకపోవడంతో చివరి ప్రయత్నంగా మమత ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు తీవ్రంగా శ్రమించి మృత శిశువును బయటకు తీశారు. కాగా తల్లి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులపై కఠినచర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. కామెర్లు ఉండడంతో ఎంజీఎంకు వెళ్లమన్నాం ఈ సంఘటనపై ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి ఆర్ఎంఓ బి. శ్రీనివాసరావు వివరణ కోరగా.. ఆమెకు కామెర్లు ఉం డటంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి డాక్టర్లు రిఫర్ చేశారన్నారు. కానీ కడుపులో శిశువు మాత్రం ఆస్పత్రిలో మృతి చెందలేదని స్పష్టం చేశారు. దానికి తమ వైద్యులు బాధ్యులు కాదని తెలిపారు. చదవండి: పాపం! అయినా అమ్మ దక్కలేదు.. చదవండి: ఇంట్లోనే కరోనా పరీక్ష చేసుకోవడం ఇలా.. -
అయ్యో ఏమిటీ ఘోరం..
తల్లిని కాబోతున్న ఆ ఆలోచనే ఆనందం పిండం నాటి నుంచే ఎన్నెన్నో ఆలోచనలు మొదటి నెల నుంచే బిడ్డ రూపం కోసం ఊసులు నెలలు దాటుతున్న కొద్దీ పారవశ్యం ఉమ్మ నీటిలో తిరగాడుతూ లేలేత పాదాల స్పర్శతో పలకరింత ఆ అనుభూతులతో ఆ అమ్మ పులకరింత దగ్గరకొస్తున్న రోజులను లెక్కించుకుంటూ పురిటి నొప్పులు మరో జన్మని తెలిసినా ప్రాణత్యాగానికైనా సిద్ధమంటూ ఆ పసికందు ‘కేక’ కోసం కన్నార్పకుండా ఎదురు చూసే ఆ అమ్మకు ఎంత కష్టం పురిట్లోనే ఆ పసిగుడ్డుకు మృత్యువు కాటేస్తే ఎంత గర్భ శోకం వారేం చేశారు పాపం మన్యంలో ఇది ఓ శాపం మన్యంలో మృత్యువు వికటాట్టహాసం చేస్తోంది. ఏదో రూపంలో గిరిజనులను కాటేస్తోంది. వైద్య సేవలు అంతంతమాత్రంగా లభ్యమవుతుండడంతో ఈ దుస్థితి నెలకొంది. సాక్షి, రంపచోడవరం(తూ.గో) : ఏజెన్సీలో శిశు మరణాలు అంతులేని విషాదాన్ని నింపుతున్నాయి. కొద్దిపాటి అనారోగ్యంతో కూడా పసిపిల్లలు ప్రాణాలు కోల్పోతుంటే తల్లులకు గర్భశోకం మిగులుతోంది. వైద్యశాస్త్రం కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో కూడా మన్యంలో శిశువుల ప్రాణాలు నిలిపేందుకు అధునిక వైద్యం అక్కరకు రావడం లేదు. ఆసుపత్రులున్నా నిపుణులైన వైద్యులు లేని పరిస్ధితి, వైద్యులున్నా రోగులకు అందుబాటులో లేని దుస్థితి ఆదివాసీలకు ఆవేదన మిగుల్చుతోంది. వర్షాకాలంతోపా టు వచ్చే రోగాలు ఏజెన్సీ మారుమూల ప్రాంతాల్లో నివశిస్తున్న ఆది వాసీలకు ప్రాణాపాయం కలిగిస్తున్నాయి. గత టీడీపీ పాలకులు ఏజెన్సీలో గిరిజన సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. ఫలితంగా ఐదేళ్ల కాలంలో అనేక మంది పసిపిల్లలు ప్రాణాలు గాలిలో కలిసిపోయినా సరైన చర్యలు తీసుకోకపోవడంతో అదే విషాదం కొనసాగుతోంది. తాజాగా వై రామవరం మండలం పి. ఎర్రగొండ గ్రామానికి చెందిన పి. మోహన్‌రెడ్డి, వెంకయమ్మ దంపతుల మూడు నెలల బాలుడు అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ నెల 15వ తేదీన వై.రామవరం ఏరియా ఆసుపత్రికి జ్వరంతో ఉన్న బాలుడిని తీసుకువెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉందని మందులు లేవని చెప్పడంతో ఏలేశ్వరం ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుంచి కాకినాడ జీజీహెచ్‌కు తరలించగా బుధవారం బాలుడు మృత్యువాత పడ్డాడు. ఈ నెలలోనే లాగరాయి, ముంజవరప్పాడు ›గ్రామాల్లో ఇద్దరు శిశువులు అనారోగ్యంతో చనిపోయారు. నాలుగు నెలలు కాలంలో ఏడుగురు పిల్లలు మృత్యువాత ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై నాటికి ఏజెన్సీలో ఏడుగురు పిల్లలు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. 2016 ఏప్రిల్ నుంచి 17 మార్చి వరకు 239 మంది పిల్లలు అసువులుబాసారు. 2017 ఏప్రిల్ నుంచి 2018 మార్చి 124 శిశు మరణాలు సంభవించాయి. 2018 ఏప్రిల్ నుంచి 2019 మార్చి వరకు 67 శిశు మరణాలు నమోదుకాగా 2019 ఏప్రిల్ నుంచి జూలై వరకు ఏడు శిశు మరణాలు నమోదయ్యాయి. అందుబాటులో లేని వైద్య సేవలు: ఏజెన్సీలో గైనిక్ వైద్య సేవలతోపాటు చిన్న పిల్లల వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో గిరిజనులకు శాపంగా మారింది. అనారోగ్యంతో ఉన్న పిల్లలను పీహెచ్‌సీలకు తీసుకువచ్చినా అక్కడ సరైన వైద్య సేవలు అందడం లేదు. అక్కడి నుంచి కాకినాడ జీజీహెచ్‌కు తరలిస్తున్నా ఊపిరి నిలవడం లేదు. పీహెచ్సీ స్ధాయిలో ప్రత్యేక వైద్య నిపుణులు అందుబాటులో ఉంటేనే మెరుగైన వైద్యం అందే పరిస్ధితి ఉందని ఈ ప్రాంతవాసులు చెబుతున్నారు. ఏజెన్సీలో 24 పీహెచ్‌సీలకూ ఒకే విధంగా వైద్యుల పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. గర్భిణిలో పోషకాహారం లోపం పుట్టబోయే బిడ్డపై పడుతోంది. ఫలితంగా రోగనిరోధక శక్తి లేకపోవడంతో చిన్నపాటి అనారోగ్యంతో కోలుకోలేని పరిస్ధితిని తల్లీ, పిల్లలు ఎదుర్కొంటున్నారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ‘నేషనల్ రూరల్ హెల్త్ మిషన్’ నిధులతో ఏర్పాటు చేసిన నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో పీడియాట్రిక్ (చిన్న పిల్లల వైద్యుడు) పోస్టు ఖాళీగా ఉంది. ఏజెన్సీలో ఏకైక కేంద్రంలో వైద్యుడు లేకపోవడంతో మృత్యుహేలలు ఎక్కడో ఓ దగ్గర వినిపిస్తూనే ఉన్నాయి. -
ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. బాలింత మృతి
అనంతపురం న్యూసిటీ: ఓ బాలింత మృతి వివాదాస్పదంగా మారింది. రక్తం ఎక్కించే సమయంలో పొరపాటే ఇందుకు కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగిన ఘటన జిల్లా కేంద్రం అనంతపురంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చోటు చేసుకుంది. శింగనమల మండలం ఆకులేడుకు చెందిన ఎం.సుకన్య(26)ను రెండో కాన్పు కోసం ఈ నెల 17న సర్వజనాస్పత్రిలో చేర్చారు. ఈ నెల 19న ఆమెకు సిజేరియన్ చేయగా ఆడపిల్ల జన్మించింది. అదే రోజు ఓ–నెగిటివ్ రక్తం ఎక్కించారు. సుకన్యకు యూరిన్ రాకపోవడంతో వైద్యులు పరీక్షించి.. నెఫ్రాలజీ సేవలు అవసరమని కర్నూలుకు తీసుకెళ్లాలని సూచించారు. భర్త శివప్రసాద్, కుటుంబ సభ్యులు ఆమెను 20వ తేదీ కర్నూలు ఏఎంసీకి తీసుకెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం ఆమె మరణించింది. వందలాదిమందితో ఆందోళన: కర్నూలులోని కొందరు ఆస్పత్రి సిబ్బంది రక్త మార్పిడి సరిగా జరగలేదని చెప్పారని.. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మృతి చెందిందని మృతురాలి కుటుంబ సభ్యులు వందలాదిమందితో ఆదివారం రాత్రి సర్వజనాస్పత్రి ఎదుట రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రక్తమార్పిడిపై అనుమానం ఉంటే పోస్టుమార్టం చేస్తే తెలుస్తుందని ఆర్ఎంవో డాక్టర్ లలిత చెప్పారు. ఇదే విషయమై గైనిక్ హెచ్ఓడీలు డాక్టర్ షంషాద్‌బేగం, డాక్టర్ సంధ్యలను ‘సాక్షి’ ఆరా తీయగా.. సుకన్యకు ఆమె గ్రూపు రక్తం(ఓ–నెగిటివ్) ఎక్కించామని, యూరిన్ రాకపోవడంతో కర్నూలుకు రిఫర్ చేసినట్టు వివరించారు. -
ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళ మృతి
సాక్షి, వర్ధన్నపేట (వరంగల్) : ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం అయిన మహిళకు వైద్యం వికటించి మృతి చెందిందని ఆరోపిస్తూ గురువారం సాయంత్రం మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం వరంగల్– ఖమ్మం ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగా రు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం సిద్ధ సముద్రంకు చెందిన దారావత్ దివ్య బుధవారం ప్రసవం కోసం కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఆమెకు నొప్పులు రావడంతో దివ్యకు బుధవారం రాత్రి ఆపరేషన్ చేయగా ఆడ శిశువుకు జన్మనిచ్చింది. మరికొద్ది గంటల్లోనే రక్తస్రావం కావడంతో వెంటనే ఆమెను వైద్యులు వరంగల్ ఎంజీఎంకు తరలించారు. దివ్య ఎంజీఎంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందిం ది. దీంతో దివ్య మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట, వరంగల్–ఖమ్మం జాతీయ రహదారి పై ఆందోళనకు దిగారు. దీంతో ఇరువైపుల కిలో మీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే స్థానిక ఎస్సై బండారి సంపత్ సిబ్బందితో అక్కడకు చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడారు. దీంతో వారు ఎస్సైతో వాగ్వివాదానికి దిగారు. వారికి నచ్చజెప్పి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
పెద్దాస్పత్రిలో మరో వివాదం
ఖమ్మంవైద్యవిభాగం: పెద్దాసుపత్రిలో తరచు వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఉన్నతాధికారులు హెచ్చరికలు చేస్తున్నా వివాదాలు మాత్రం ఆగడంలేదు. ఇటీవల కాలంలో ప్రసవ దృశ్యాలు చిత్రీకరించి ఆన్లైన్లో పెట్టడం, సెక్యూరిటీ గార్డు బాలింతకు సెలైన్ బాటిల్ పెట్టిన ఘటనలు వివాదాస్పదమైన విషయం విదితమే. తాజాగా ప్రసవ వేదనతో వచ్చిన గర్భిణికి డెలివరీ చేయకుండా తిప్పి పంపటంతో మరో వివాదానికి తెరలేపారు ఇక్కడి వైద్యులు. వివరాలు ఇలా ఉన్నాయి. రమణగుట్ట ప్రాంతానికి చెందిన ఇనపనూరి అశ్విని(20)కి పురుటి నొప్పులు రావడంతో శుక్రవారం తెల్లవారు జామున 4 గంటలకు కుటుంబ సభ్యులు ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. చికిత్స ప్రారంభించిన డాక్టర్లు 5 గంటల సమయంలో ఇంజెక్షన్ ఇచ్చారు. దీంతో కొద్దిసేపటి తర్వాత గర్భిణికి రక్తస్రావమైంది. ఎంత ప్రయత్నించినా రక్తస్రావం ఆగకపోవటంతో డాక్టర్లు ఆమెను వరంగల్ తీసుకెళ్లాలని సూచించారు. ఆందోళనకు గురైన అశ్విని తండ్రి పగడాల లక్ష్మయ్య(మున్సిపల్ వర్కర్) సీఐటీయూ నాయకులను సంప్రదించాడు. సీఐటీయు నాయకులు విష్ణు తదితరులు వచ్చి డ్యూటీలో ఉన్న డాక్టర్‌ను డెలివరీ చేయాలని విజ్జప్తి చేశారు. చికిత్స అందించకపోవడంతో కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఇక చేసేది లేక కుటుంబ సభ్యులు గర్భిణిని 108 వాహనం ద్వారా వైరారోడ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రసవం చేయించగా మగబిడ్డ పుట్టాడు. పుట్టిన బిడ్డను తీసుకొచ్చి ఆస్పత్రిలో ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రైవేటు ఆస్పత్రిలో డెలివరీ చేయిస్తే రూ.30 వేలు ఖర్చయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. వెంకటేశ్వర్లు , ఆర్ఎంఓ కృపాఉషశ్రీ సముదాయించి ఇలాంటి పొరపాట్లు మరోసారి జరగకుండా చూస్తామని చెప్పడంతో సీఐటీయు నాయకులు శాంతించారు. ఎంసీహెచ్ భవనం ఎదుట డాక్టర్ల ధర్నా సీఐటీయూ నాయకుడు విష్ణు డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్‌పై దురుసుగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఆస్పత్రి వైద్యులు ఓపీ సేవలు నిలిపివేశారు. మాతాశిశు సంరక్షణ కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. డాక్టర్‌పై దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడిన వ్యక్తిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గైనిక్ సేవలందించే డాక్టర్లు ప్రస్తుతం ముగ్గురే ఉన్నారని, పెరుగుతున్న ఓపీ సేవలకు అనుగుణంగా గైనిక్ వైద్యులు నియమించాలని కోరారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి. వెంకటేశ్వర్లుకు ప్రభుత్వ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. డాక్టర్ల ఆందోళనతో ఆస్పత్రిలో ఓపీ సేవలు నిలిచిపోయాయి. దీంతో రోగులు వైద్య సేవలు లేక వెనుతిరిగారు. కాగా ఇరు వర్గాలు పరస్సరం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నాయి. డాక్టర్లను ఇబ్బంది పెడితే వైద్య సేవలు ఎలా అందిస్తారు..? డాక్టర్లను ఇబ్బందులకు గురిచేస్తే వారు వైద్య సేవలు ఎలా అందిస్తారని ఆస్పత్రి సూపరిండెంటెండ్ డాక్టర్ బి. వెంకటేశ్వర్లు అన్నారు. ఓపీ సేవలు నిలిపివేసి సూపరింటెండెంట్ చాంబర్లో సమావేశమైన డాక్టర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. డాక్టర్‌పై దురుసుగా ప్రవర్తించటం సరికాదన్నారు. డాక్టర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి పోలీస్ ఔట్‌పోస్టు ఏర్పాటు చేస్తానని, కలెక్టర్‌కు కూడా లేఖ అందజేస్తామని తెలిపారు. - వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్. -
వేళకురాని వైద్యులు..రోగుల ఎదురుచూపులు
వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. వైద్యులు దేవుడితో సమానమని దీని అర్థం. అంతటి ప్రాధాన్యత ఉన్న డాక్టర్లు సమయ పాలన పాటించకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సరైన సమయంలో వైద్యం అందక పలువురు మృత్యు ఒడికి చేరుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. వరదయ్యపాళెం మండలం చిన్న పాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ దుస్థితి కనిపిస్తోంది. సాక్షి, వరదయ్యపాళెం : 24గంటలు స్థాయి కలిగిన మండలంలోని చిన్న పాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనితీరు రోజురోజుకూ అధ్వానంగా మారుతోంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల సామాన్యులకు వైద్యసేవలు దూరమవుతున్నాయి. ముగ్గురు వైద్యులున్న ఈ ఆస్పత్రిలో సోమవారం ఉదయం 11గంటలు కావస్తున్నా ఏ ఒక్కరూ హాజరుకాలేదు. వైద్యం కోసం వచ్చిన రోగులు డాక్టర్ల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి. నిరీక్షించలేని రోగులు ఆస్పత్రిలో ఉన్న నర్సు ద్వారా తాత్కాలిక వైద్యం చేయించుకుని వెనుదిరిగారు. 11 గంటలు దాటిన తర్వాత ఓ వైద్యాధికారి వచ్చారు. మరో వైద్యాధికారిణి 11.40గంటలకు వచ్చారు. సరిగ్గా ఒంటిగంటకు వీరు తిరుగుపయనమయ్యారు. ఆస్పత్రికి వైద్యం కోసం ప్రతిరోజూ 100మందికి వస్తుంటారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆ సంఖ్య క్రమేణా తగ్గుతోంది. మండు వేసవి కారణంగా గ్రామాల్లో వడదెబ్బ బాధితులు అధికంగా ఉన్నారు. విషజ్వరాలు కూడా ప్రబలమవుతున్నాయి. ఇటీవల చిన్న పాండూరు ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఎంజీనగర్ గిరిజనకాలనీలో ఊరంతా విషజ్వరాలు ప్రబలి నలుగురు మృతి చెందారు. అయినా ఇక్కడి వైద్యుల పనితీరులో మాత్రం మార్పు కనిపిం చడం లేదు. ప్రభుత్వ నిబంధనలకు తూట్లు వేసవి కాలం దృష్ట్యా ఉదయం 10 గంటలపైబడి ప్రభుత్వ కార్యాలయాల వద్దకు సామాన్య ప్రజలను రప్పించద్దంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే చిన్న పాండూరు ఆస్పత్రిలో పది గంటల వరకు డాక్టర్లు విధులకు హాజరుకాకపోవడం గమనార్హం. ఆస్పత్రి పనితీరు రోజురోజుకూ దిగజారుతోంది. 24 గంటలు స్థాయి కలిగిన ఈ ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు వైద్యులను ప్రభుత్వం నియమించింది. అయితే వీరు ముగ్గురు ఒక్క రోజు కూడా హాజరుకావడం లేదు. రోజు మార్చి రోజు విధులకు హాజరవుతూ హాజరు పట్టికలో మాత్రం నెలంతా హాజరైనట్లు నమోదు చేసుకోవడం గమనార్హం. ప్రభుత్వం తప్పనిసరిగా బయోమెట్రిక్ ఏర్పాటు చేయాలని ఆదేశించినప్పటికీ అక్కడ నెట్ పనిచేయలేదన్న సాకుతో బయోమెట్రిక్ విధానం అమలుకు నోచుకోలేదు. రోజులో విధులకు హాజరయ్యే ఆ ఒక్క వైద్యుడు సైతం 2గంటలు మాత్రమే విధులు నిర్వహించడం గమనార్హం. లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటూ మొక్కుబడి విధులు నిర్వహించడమేమిటంటూ పరిసర ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
పురిటిలోనే పసి ప్రాణం బలి
కమ్మర్పల్లి(బాల్కొండ): వైద్యుల నిర్లక్ష్యంతో అప్పుడే పుట్టిన శిశువు మృతి చెందిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందిని నిలదీశారు. కమ్మర్‌పల్లికి చెందిన మల్లగారి రేణుక అనే గర్భిణికి శుక్రవారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు మధ్యాహ్నం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోగా, స్టాఫ్ నర్సు, హెల్త్ సూపర్వైజర్ మాత్రమే ఉన్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న రేణుకను ప్రసూతి గదిలోకి తీసుకెళ్లారు. పేషెంట్ అవసరమైన(పొలీస్ క్యాథటర్) యూరిన్ పైప్ ఆస్పత్రిలో అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది ప్రిస్కిప్షన్‌పై రాసిచ్చారు. కమ్మర్పల్లి మందుల దుకాణాల్లో లేకపోవడంతో మెట్‌పల్లికి వెళ్లి తీసుకువచ్చారు. ఈ కారణంగా రెండు గంటలు ఆలస్యమైంది. దీంతో వైద్య సిబ్బంది కాన్పు చేశారు. సహజ ప్రసవంతో మగ శిశువుకు జన్మించింది. పుట్టిన శిశువులో కదలికలు లేకపోవడంతో పాటు, నీలిరంగుగా మారడంతో శిశువును మరో ఆస్పత్రికి సిఫారసు చేశారు. కుటుంబ సభ్యులు మెట్‌పల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే శిశువు మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. శిశువు మృతదేహాన్ని ఆస్పత్రి వద్ద ఉంచి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వైద్య సిబ్బంది కారణంగానే శిశువు మరణించిందని ఆరోపిస్తూ సిబ్బందిని నిలదీశారు. కాన్పు చేసిన హెల్త్ సూపర్వైజర్, స్టాఫ్ నర్స్ శిశువు ఉమ్మ నీరు మింగిందని ఒకసారి, మరోసారి తెమడ తట్టుకుందని పొంతన లేని మాటలు చెప్పడంతో బాధిత కుటుంబ సభ్యులు కోపోద్రిక్తులయ్యారు. డ్యూటీ డాక్టర్ ఎక్కడ అని నిలదీశారు. వైద్యాధికారి సెలవులో ఉంటే సంబంధిత రిజిస్టర్‌ను చూపించాలని పట్టుపట్టారు. పోలీసుల సమక్షంలో రిజిస్టర్ చూపించడంతో అందులో అటెండ్ బాక్స్ ఖాళీగా ఉంది. అర్హత కలిగిన వైద్యులు లేకపోవడంతో అనర్హత కలిగిన సిబ్బంది కాన్పు చేయడం కారణంగా శిశువు మరణించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధిత కుటుంబ సభ్యులను సముదాయించారు. ఘటనపై అనుమానాలుంటే సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో బాధితులు స్థానిక తహసీల్దార్, ఎస్ఐలకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. -
హైటెక్ ప్రచారం.. లోటెక్ వైద్యం
అనారోగ్యంతో ధర్మాసుపత్రికి పోతే ప్రాణాలు పోతాయి.. కార్పొరేట్ హాస్పిటల్‌కు వెళ్తే ఆస్తులు కరుగుతాయి అన్నట్లుగా రోజులు మారిన నేపథ్యంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం భారమవుతోంది. పేదలందరికీ ఆధునిక వైద్యం.. అందరికీ ఆరోగ్యం.. ఉచితంగానే అన్నీ పరీక్షలు.. ఇలా ఎన్నో పథకాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్భాటంగా ప్రకటించి ఆచరణలో చేతెలెత్తేశారు. ఐదేళ్ల పాలనలో పేదల ఆరోగ్య పరిరక్షణ గాలిలో దీపంలా మారింది. కుయ్ కుయ్ మనే 108 వాహనాలు కుయ్యో మొర్రో అంటున్నాయి. సంచార చికిత్స వాహనాలు గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదు. మురికివాడల్లోని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో నామమాత్ర వైద్య సేవలే అందుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య పరీక్షలు అధిక శాతం బోగస్‌గా నమోదవుతున్నాయి. బడిపిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేస్తామని చెప్పిన బాలసురక్ష వాహనాల కోసం పిల్లలు ఎదురు చూస్తున్నారు. – కర్నూలు(హాస్పిటల్) సాక్షి, కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఆసుపత్రిలో గాకుండా 133 రకాల శస్త్ర చికిత్సలను కేవలం ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే ఎన్టీఆర్ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ) ద్వారా చేయించుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగులకు ప్రైవేటుకు మించి ఖర్చు అవుతోంది. అత్యవసరం పేరుతో అధిక శాతం మందులను బయటి నుంచి రోగులతో కొనిపిస్తున్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ పథకం వర్తించినా సదరు రోగి కుటుంబీకులు డిశ్చార్జ్ అయ్యేలోగా రూ.4 వేల నుంచి రూ.30వేల దాకా ఖర్చు పెడుతున్నారు. ఇలా ఖర్చు పెట్టిన మొత్తంలో కేవలం 10 శాతం మాత్రమే నెలల తరబడి తిప్పుకుని వెనక్కి ఇస్తున్నారు. ఇలా తిరగలేక చాలా మంది ఆ మొత్తాన్ని కూడా వదిలేస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా వచ్చిన క్లెయిమ్ నిధుల నుంచి వాటా రూపేణా అధికారులు, వైద్యులు, పారా మెడికల్, స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది పంచుకుంటున్నారు. మరోవైపు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్యసేవ పథకం ఉన్నా తగిన ప్యాకేజి మొత్తం లేకపోవడంతో చాలా ఆసుపత్రులు రోగుల నుంచి ప్యాకేజికి మించిన మొత్తాన్ని వసూలు చేస్తున్నాయి. మరికొన్ని ఆసుపత్రులు మా వల్ల కాదంటూ వెనక్కి పంపిస్తున్నాయి. ఆపద్బాంధవుడికి అష్టకష్టాలు జిల్లాలో ప్రస్తుతం 108 అత్యవసర అంబులెన్స్‌లు 32 ఉన్నాయి. వీటిలో అధిక శాతం వాహనాలు మరమ్మతులకు గురయ్యాయి. అయినా నిర్వహణ పనులు చేపట్టకుండా వాటిని అలాగే తిప్పుతున్నారు. ఏ బండి ఎక్కడ ఆగిపోతుందోనని డ్రైవర్లు(పైలెట్లు) తీవ్ర ఆందోళనలో విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి వాహనానికి రూ.2,500 విలువ జేసే డీజిల్ కార్డు మాత్రమే ఇస్తున్నారు. ఒక్కోసారి ఇంధనం చాలక షెడ్డుకే వాహనాలు పరిమితం చేయాల్సి వస్తోంది. ఇందులో పనిచేసే 64 మంది పైలెట్లు, టెక్నీషియన్లకు సైతం రెండు నెలల నుంచి జీతాలు రావడం లేదు. అడిగితే టెర్మినేట్ చేస్తామని యాజమాన్యం బెదిరిస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బడికి రాని బాలసురక్ష జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఆరోగ్యస్థితిగతులను తెలుసుకునేందుకు బాల సురక్ష పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనిని కూడా ధనుష్ అనే సంస్థకు అప్పగించింది. ఇందుకు గాను జిల్లాలోని మండల, జిల్లా పరిషత్ పాఠశాలల్లోని ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు అవసరమైన వైద్యపరీక్షలు నిర్వహించి చికిత్స అందించాలి. అయితే ఈ పథకం ప్రారంభమైన ఆరు నెలల వరకు ఎలాంటి కార్యక్రమాలను ఈ సంస్థ చేపట్టలేదని, ఇటీవలే కార్యక్రమాన్ని ప్రారంభించిందని జిల్లా స్థాయి అధికారులు సైతం చెబుతున్నారు. ఈ కార్యక్రమం సైతం సరిగ్గా నిర్వహించడం లేదని అధికారులు ప్రభుత్వానికి పలుమార్లు నివేదికలు పంపించారు. సంచార వాహనాల్లో మందుల కొరత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గ్రామాల్లో సేవలు అందించిన 104 సంచార వాహనాలను నేడు రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ చంద్రన్న సంచార చికిత్సగా నామకరణం చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 5 కిలో మీటర్ల ఆవల ఉన్న గ్రామాలకు వాహనాన్ని తీసుకెళ్లి గ్రామీణులకు చికిత్స అందిస్తోంది. అయితే ఇలా వెళ్లిన వాహనాల్లో సిబ్బంది సరిగ్గా ఉండటం లేదని, మందులు కూడా ఇవ్వడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీపీ, షుగర్ మందులు కూడా తగినంత ఇవ్వకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్ణీత తేదీల్లోనూ ఈ వాహనాలు ఆయా గ్రామాలకు వెళ్లడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్య కేంద్రాల్లో బోగస్ పరీక్షలు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో డయా గ్నోస్టిక్ పరీక్షలు (రక్త, మూత్ర పరీక్షలు)ను, ఎక్స్‌రే తీసేందుకు రాష్ట్ర ప్రభు త్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. కొన్ని చోట్ల వైద్యుల సహాయంతో ముందుగానే సంతకాలు చేయించి అవసరం లేకపోయినా రోగులకు పరీక్షలు చేస్తున్నారు. అందులో కొన్ని మాత్రమే చేసి, మిగిలిన వాటికి నార్మల్ రిపోర్ట్లు ఇస్తున్నారు. ఇలా ఆసుపత్రికి వచ్చిన రోగుల్లో 20 నుంచి 30 శాతం మంది రోగులకు పరీక్షలు చేశామని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లులు డ్రా చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల వైద్యుల సంతకాలు లేకపోయినా రోగులకు పరీక్షలు చేసినట్లు రాసుకుని బిల్లులు డ్రా చేసుకుంటున్నా అడిగే నాథుడు కరువయ్యారు. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలకు ఆదరణ కరువు పట్టణాల్లోని మురికివాడల్లో స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న అర్బన్‌హెల్త్ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం అపోలో సంస్థకు అప్పగించింది. వీటిని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలుగా నామకరణం చేసింది. రెగ్యులర్‌గా అందే సేవలతో పాటు టెలి మెడిసిన్‌ను కూడా రోగులకు అందిస్తామని ఆ సంస్థ చెప్పింది. అయితే ఈ సంస్థ వచ్చిన తర్వాత ఏఎన్ఎంలు క్షేత్రస్థాయికి వెళ్లి చికిత్సలు చేయడం లేదు. రోగులే కేంద్రానికి వచ్చి చికిత్స తీసుకోవాల్సి వస్తోంది. టెలి మెడిసిన్ సైతం అందించడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు గర్భిణిలు, పిల్లలకు సైతం సరైన వైద్యం అందించేందుకు వైద్యులు అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు ఉన్నాయి. రూ.40 వేల మందులు బయట కొన్నా నాకు ముగ్గురు పిల్లలు. రెండో కుమారుడు యూనుస్(5)కు అపెండిక్స్ వచ్చింది. మూడు వారాల క్రితం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని చిన్నపిల్లల శస్త్రచికిత్స విభాగంలో చేర్పించాము. వెంటనే డాక్టర్లు స్పందించి ఆపరేషన్ చేశారు. అయితే ఆపరేషన్ వికటించడంతో మళ్లీ గత సోమవారం ఆపరేషన్ చేశారు. అయితే బాబు కోలుకోలేక 9వ తేదీన మరణించాడు. మూడు వారాల సమయంలో మాకు రూ.40 వేల దాకా మందులు, ఇతర ఖర్చులు అయ్యాయి. ఎన్టీఆర్ వైద్యసేవ కింద చికిత్స చేస్తున్నామని చెప్పినా ఇంత స్థాయిలో ఖర్చు అయ్యింది. – యూసుఫ్, తిరుమిల్ల గ్రామం, కంభం మండలం, ప్రకాశం జిల్లా 108కు ఫోన్ చేస్తే బిజీ అని చెబుతున్నారు రెండు వారాల క్రితం నా ఫ్రెండ్‌కు రోడ్డు ప్రమాదం జరగడంతో వెంటనే 108కు ఫోన్ చేశాము. ఆ నెంబర్ రింగ్ అవుతోంది గానీ ఎవరూ లిఫ్ట్ చేయడం లేదు. కొంత సేపటికి నా మరో ఫ్రెండ్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేశారు. అయితే వాహనాలన్నీ బిజీగా ఉన్నాయి...కాస్త ఆలస్యం అవుతుందని, వేచి ఉండాలని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఫోన్లోనే రోగి స్థితిగతులను అడిగి తెలుసుకుని, ఇలా చేయండి...అలా చేయండి అంటూ సూచనలు, సలహాలు ఇచ్చారు. దీంతో ఆలస్యం అవుతుందని చెప్పి మేమే ఆటోలో ఆసుపత్రికి తరలించాము. – బషీర్, కల్లూరు డాక్టర్లు ఉండటం లేదు కర్నూలులోని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు ఉండటం లేదు. టెలిమెడిసిన్ ద్వారా చికిత్స అందిస్తామంటున్నారు గానీ రోగులను వేచి ఉండాలని చెబుతున్నారు. గంటల తరబడి రోగులు అక్కడ కూర్చోలేక వెనక్కిపోతున్నారు. మాది స్వచ్ఛంద సంస్థ. పేదలకు సేవ చేయాలన్న భావనతో ఆరోగ్య కేంద్రాలకు రోగులను తీసుకెళ్తుంటాము. కానీ అక్కడ సరైన వైద్యసేవలు అందకపోవడంతో రోగులు నిరాశ చెందుతున్నారు. – ప్రసాద్, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు, కర్నూలు -
స్కూలు బస్సుకు తప్పిన పెను ప్రమాదం
వెల్దుర్తి (మాచర్ల): గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ బస్సు విద్యార్థులను ఎక్కించుకుని వస్తూ మాచర్ల మండలం మండాది వద్ద సోమవారం ఉదయం 8 గంటలకు కానవాగులో బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ ఉపాధ్యాయురాలితో పాటు ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలవ్వగా, వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో 26 మంది విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 70 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. మండలంలోని ఉప్పలపాడు, మండాది గ్రామాల నుంచి ప్రతిరోజూ విద్యార్థులను స్కూల్ బస్సులో తీసుకొచ్చి తిరిగి సాయంత్రం వదిలి వస్తుంటారు. సోమవారం యధావిధిగా విద్యార్థుల్ని ఎక్కించుకుని వస్తుండగా, కానవాగు వద్ద బస్సు స్టీరింగ్ రాడ్ ఊడిపోవడంతో అదుపు తప్పి వాగులోకి బోల్తా పడింది. ఆ సమయంలో అక్కడే ఉన్న బోర్వెల్ వాహనం వారు వాగులోకి వెళ్లి బస్సు అద్దాలు పగులగొట్టి విద్యార్థులను రక్షించే ప్రయత్నం చేశారు. వీరు వెంటనే స్పందించడం వల్ల ప్రాణాపాయం తప్పింది. ఈలోపు మండాది గ్రామస్తులు సైతం అక్కడకు చేరుకుని బస్సులో ఇరుక్కున్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తెచ్చారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను హుటాహుటిన మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఉప్పలపాడు గ్రామానికి చెందిన విద్యార్థులు దాసి రాజు, బలిగొడుగుల అజయ్, మారెబోయిన నవీన్, ఒంటేరు వాసు, తన్విజ్ రెడ్డి, భార్గవి, ఉపాధ్యాయురాలు కామిరెడ్డి మల్లీశ్వరిలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం గుంటూరు, నరసరావుపేట వైద్యశాలలకు తరలించారు. స్వల్పంగా గాయపడిన 26 మంది విద్యార్థులకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించి తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. సంఘటనా స్థలానికి గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు, మాచర్ల ఎంవీఐ ఎ.మాధవరావు, ఇన్చార్జి తహసీల్దారు బుడేసాహెబ్, మాచర్ల రూరల్ సీఐ ఎ.వెంకటేశ్వర్లు, తదితరులు చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాగులో నీరు లేకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పిందని, లేకపోతే తమ పిల్లల పరిస్థితి ఏమిటంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ బస్సు రాడ్ ఊడిపోయే పరిస్థితి వచ్చే వరకు చూసుకోకుండా పాఠశాల యాజమాన్యం, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వహించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యంపై ఆందోళన ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, గ్రామస్తులు గాయపడిన విద్యార్థులను మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆ సమయంలో ఆసుపత్రిలో వైద్యులు ఎవరూ లేకపోవడం, సిబ్బంది సరిగా స్పందించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు అక్కడే ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. వైద్య అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడితే సహించేది లేదని హెచ్చరించారు. 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ కూడా లేకపోవడంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థులను తన సొంత వాహనంలో మాచర్లలోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. పిల్లలకు ఏదైనా జరిగితే అందుకు ప్రభుత్వం, వైద్య అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎమ్మెల్యే హెచ్చరించారు. బస్సులో పరిమితికి మించి విద్యార్థులు పరిమితికి మించి విద్యార్థులను తరలించడం వల్లే ఎక్కువ మంది విద్యార్థులు గాయపడినట్లు తెలుస్తోంది. ఉప్పలపాడు, మండాది గ్రామాల్లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌కు వచ్చే విద్యార్థులు 90 మంది ఉండగా, ఒకే ట్రిప్పులో వీరిని చేరవేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. 57 మంది పట్టే బస్సులో 70 నుంచి 90 మందిని తిప్పుతున్నా రవాణా శాఖ, పోలీసు, విద్యా శాఖ అధికారులు పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. సోమవారం వర్షం కారణంగా 20 మంది వరకు విద్యార్థులు పాఠశాలకు రాకపోవడంతో ప్రమాద సమయంలో బస్సులో 70 మంది విద్యార్థులే ఉన్నారంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. -
గర్భసంచి ఆపరేషన్ కోసం వస్తే.. ప్రాణాలు పోయాయి
నిర్మల్‌టౌన్: గర్భసంచి ఆపరేషన్ కోసం వస్తే మహిళ ప్రాణాలు కోల్పోయిన సంఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రసూతి ఆసుపత్రిలో మంగళవారం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం మూలంగానే ఇలా జరిగిందని బంధువులు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. మృతురాలి కుటుంబ సభ్యులు, వైద్యుల వివరాల ప్రకారం.. నేరడిగొండ మండలం వాంకిడి అనుబంధ గ్రామం చిన్నరాజురకు చెందిన లలిత(44) గర్భసంచి ఆపరేషన్ నిమిత్తం నిర్మల్ ప్రసూతి ఆసుపత్రికి తీసుకొచ్చా రు. సోమవారం లలితకు అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మంగళవారం ఆపరేషన్ నిర్వహించారు. ఈక్రమంలో ముందుగా మత్తుమందును ఇచ్చారు. ఆపరేషన్ ప్రారంభిం చిన కొద్ది సేపటికి పరిస్థితి విషమించి లలిత మృతిచెందింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే లలిత మృతిచెందిందని ఆమె భర్త రాములు, బంధువులు ఆరోపించారు. ఆసుపత్రి వద్ద ఆందో ళన చేపట్టారు. డీఎంఅండ్‌హెచ్‌వో జలపతి నాయ క్, జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్ సురేష్, సీఐ జాన్‌దివాకర్ అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. ఆపరేషన్ నిర్వహించిన వైద్యురాలు రజిని, అనస్తిసియా నిపుణులు మృతి చెందిన విధానాన్ని వారికి వివరించారు. ఆపరేషన్ నిర్వహించిన సమయంలో లలితకు అకస్మాత్తుగా గుండెపోటు, ఫిట్స్ రావడంతోనే మరణించిందని తెలిపారు. రోగిని రక్షించేందుకు ప్రయత్నించిన ఫలితం దక్కలేదని వివరించారు. రోగి బంధువులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో సీఐ జాన్‌దివాకర్ వారిని సముదాయించి పంపించారు. -
మందగించిన ‘కంటివెలుగు’
ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘కంటి వెలుగు’ కార్యక్రమం ముందుకు సాగుతున్నా.. వైద్య పరీక్షలు చేయించుకున్న వారు శస్త్ర చికిత్సల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో వారిచూపు మందగిస్తోంది. కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆగస్టు 15న ప్రారంభించారు. నాలుగు నెలలు గడిచినా ఇంతవరకు జిల్లాలో ఒక్కరికి కూడా కంటి ఆపరేషన్ చేసిన దాఖలాలు లేవు. దీంతో బాధితులు ఆపరేషన్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. కాగా ఈ కార్యక్రమం ఫిబ్రవరిలో ముగియనుంది. జిల్లాలో 7లక్షల 8వేల మందికి కంటి పరీక్షలు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 2లక్షల 49వేల మందికి మాత్రమే పరీక్షలు జరిపారు. గడువులోగా పరీక్షలు పూర్తవ్వడం గగనంగానే కనిపిస్తోంది. జిల్లాలోని 18 మండలాల్లో 18 బృందాలతో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొత్తం 7లక్షల 8వేల మంది ఉండగా, ఇప్పటి వరకు 2లక్షల 49వేల 88 మందికి కంటి పరీక్షలు చేశారు. ఇందులో పురుషులు 1లక్ష 12వేల 120 మంది ఉండగా, మహిళలు 1లక్ష 36వేల 950 ఉన్నారు. దాదాపు 40 శాతం వరకు మాత్రమే లక్ష్యం పూర్తయినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. అప్పటిలోగా అందరికి కంటి పరీక్షలు జరిగేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా 4లక్షల 50వేల మంది వరకు కంటి పరీక్షలు చేయాల్సి ఉంది. అయితే అధికారుల లెక్కల ప్రకారం మరో లక్ష మంది వరకు మాత్రమే కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు అంచనా వేస్తున్నారు. కళ్లాద్దాల పంపిణీలోనూ జాప్యమే.. పరీక్షలు పూర్తిచేశాక కంటి సమస్యతో బాధపడుతున్న వారికి కంటి అద్దాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో బాధితులకు అద్దాల పంపిణీలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇప్ప టి వరకు 44,035 మందికి రీడింగ్ అద్దాలు పంపి ణీ చేశారు. అలాగే దూరపు, దగ్గరి చూపునకు సంబంధించిన కంటి అద్దాలు 27,428 పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు 7,215 మందికి మాత్రమే పంపిణీ చేశారు. దాదాపు 20వేల మందికి ఇంకా పంపిణీ కావాల్సి ఉంది. కంటి పరీక్షలు చేయించుకున్న వీరు కంటి అద్దాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. శస్త్రచికిత్స సంగతేంటి? పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో కొంత మందికి శస్త్ర చికిత్సలు అవసరం కాగా, ఇప్పటివరకు ఏ ఒక్కరికి సైతం శస్త్ర చికిత్స చేసిన దాఖలాలు లేవు. కేవలం కంటి పరీక్షలకే పరిమితమవుతున్నట్లు తెలుస్తోంది. కంటి సమస్యతో బాధపడుతున్న 25,447 మందిని శస్త్ర చికిత్సల కోసం వివిధ ఆస్పత్రులకు రిఫర్ చేయగా, ఎక్కడ కూడా ఇప్పటివరకు ఆపరేషన్ చేయలేదు. కంటి సమస్యతో బాధపడుతున్న వారు అధికారులను ఆపరేషన్ ఎప్పుడు చేస్తారని అడిగితే దాటవేస్తున్నారని చెబుతున్నారు. లక్ష్యం పూర్తయ్యేనా.. ఫిబ్రవరిలోగా కంటి వెలుగు కార్యక్రమ లక్ష్యం పూర్తవ్వడం అనుమానంగానే కనిపిస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఆగస్టులో ప్రారంభించగా జిల్లాలో 50 శాతానికి కూడా లక్ష్యం చేరుకోలేదు. మరో 60 రోజుల్లో వంద శాతం కంటి పరీక్షలు చేసేలా పరిస్థితులు కనిపించడం లేదు. ప్రభుత్వ సెలవులు, పండుగ రోజుల్లో ఈ శిబిరాలకు సెలవు ఉండడంతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు. కాగా గడిచిన నాలుగు నెలల్లో 2లక్షల 49వేల మందికి పరీక్షలు జరిపారు. ఇంకా 4లక్షల 50వేల వరకు పరీక్షలు చేయాల్సి ఉంది. మార్చిలో కంటి ఆపరేషన్లు కంటి వెలుగు కార్యక్రమం ద్వారా జిల్లాలో 2.60లక్షల మందికి కంటి పరీక్షలు చేశాం. శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి 2019 మార్చి మొదటి వారంలో చేయిస్తాం. ఫిబ్రవరి చివరి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 80 శాతం వరకు స్క్రీనింగ్ పూర్తవుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలి. – రాజీవ్‌రాజ్, డీఎంహెచ్‌వో, ఆదిలాబాద్ -
నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం
ఖమ్మం వైద్యవిభాగం: మారుమూల ప్రాంతాల్లో గర్భిణులు అవస్థలు పడొద్దని.. సుఖ ప్రసవం జరగాలని.. తల్లీ బిడ్డ క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2017, జూన్ 2న అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు పెంచేలా కార్యాచరణ రూపొందించి.. అమలు చేస్తోంది. కేసీఆర్ కిట్ అందజేయడంతోపాటు ఆడపిల్ల పుడితే రూ.13వేలు, మగపిల్లాడు పుడితే రూ.12వేల చొప్పున అమ్మ ఒడి పథకం ద్వారా అందించేందుకు శ్రీకారం చుట్టింది. దీంతో జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య 15 నెలల కాలంలోనే రెట్టింపు అయింది. పథకానికి ముందు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఏడాదికి 22వేలకు పైగా ప్రసవాలు జరగగా.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వాటి సంఖ్య 5వేలకు మించని పరిస్థితి. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరుగుతున్నా.. పీహెచ్సీలలో ఆశించిన మేర జరగకపోవడంతో పథకం లక్ష్యం నెరవేరకుండా పోతోంది. పీహెచ్‌సీల్లో 8 శాతం మాత్రమే.. జిల్లాలో 22 పీహెచ్‌సీలు ఉండగా.. పథకం ప్రారంభమైన 15 నెలల కాలంలో కేవలం 8 శాతం మాత్రమే ప్రసవాలు జరగడం గమనార్హం. కల్లూరు పీహెచ్సీలో మాత్రమే 182 ప్రసవాలు జరిగాయి. వైరా 101, బోనకల్ 98 ప్రసవాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కొన్ని పీహెచ్సీలలో రెండు అంకెలు కూడా దాటకపోవడం శోచనీయం. మంచుకొండ 2, సుబ్లేడు 3, కూసుమంచి 5, పెద్దగోపతి 6, కామేపల్లి పీహెచ్సీలలో 9 డెలివరీలు మాత్రమే చేయడంతో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 12,606 ప్రసవాలు చేయగా.. పీహెచ్సీలలో 1,019 మాత్రమే చేశారు. ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్పటికీ పీహెచ్‌సీల్లో మాత్రం 8 శాతం మాత్రమే కావడం వల్ల ఆ శాఖ పనితీరు అర్థమవుతోంది. 92 శాతం వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లోనే.. జిల్లాలోని పెద్దాస్పత్రితోపాటు సత్తుపల్లి, పెనుబల్లి, మధిరలో వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులున్నాయి. అయితే పీహెచ్సీలకన్నా వీటిలోనే అధికంగా ప్రసవాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు కావడంతో ఎక్కువ మంది గర్భిణులు ఆయా ప్రాంతాల్లో ప్రసవాలు చేయించుకునేందుకు వస్తున్నారు. ఇక్కడైతే మంచి సౌకర్యాలు ఉంటాయనే ఉద్దేశంతో వ్యయ ప్రయాసలకోర్చి వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల వైపు మొగ్గు చూపుతున్నారు. 15 నెలల కాలంలో 92 శాతం డెలివరీలు ఈ ఆస్పత్రుల్లోనే జరిగాయి. పెద్దాస్పత్రిలో రికార్డు స్థాయిలో.. రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రసవాలు హైదరాబాద్ తర్వాత ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో జరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 15 నెలల కాలంలో జిల్లావ్యాప్తంగా 12,606 ప్రసవాలు జరగగా.. ఒక్క పెద్దాస్పత్రిలోనే 10,082 ప్రసవాలు జరగడం గమనార్హం. ముఖ్యంగా మాతా, శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడంతో ఇక్కడ ప్రసవాలు చేయించుకునేందుకు గర్భిణులు ఆసక్తి చూపుతున్నారు. పెద్దాస్పత్రిలో ప్రతి రోజు 20 నుంచి 30 వరకు ప్రసవాలు చేస్తున్నారు. 90 శాతం వరకు ఇక్కడే ప్రసవాలు జరుగుతున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ లెక్కలు చెపుతున్నాయి. అయితే ఎక్కువ సంఖ్యలో గర్భిణులు పెద్దాస్పత్రికి వస్తుండడంతో ఇక్కడి వైద్యులపై మరింత భారం పడుతోంది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యధికంగా ప్రసవాలు జరుగుతుండగా.. పీహెచ్‌సీల్లో ఇందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పీహెచ్‌సీల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం, మారుమూల ప్రాంత ప్రజల్లో అవగాహన కల్పించకపోవడం వంటి కారణాల వల్ల అక్కడ ప్రసవాలు చేయించుకునేందుకు గర్భిణులు ఇష్టపడట్లేదని తెలుస్తోంది. సబ్‌సెంటర్ స్థాయిలో అవగాహన పెంచాలి.. పీహెచ్‌సీల్లో ప్రసవాలు చేయించుకోవాల్సిన ఆవశ్యకతను సబ్‌సెంటర్ స్థాయిలో ప్రచారం నిర్వహిస్తే మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. పీహెచ్‌సీల్లో కల్పిస్తున్న సౌకర్యాలు, ఆర్థికంగా వచ్చే ప్రయోజనం ఏఎన్ఎం, ఆశ కార్యకర్తల ద్వారా గర్భిణులకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేసీఆర్ కిట్ల పథకం వచ్చాక ఎక్కువ మంది ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేయించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కేసీఆర్ కిట్‌తోపాటు ప్రోత్సాహకం కూడా ఇస్తుండడంతో గర్భం దాల్చిన వెంటనే పేర్లు నమోదు చేయించుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 12,606 ప్రసవాలు జరగగా.. 11,225 మందికి కేసీఆర్ కిట్లు అందించారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. పీహెచ్‌సీలకు వచ్చేందుకు మాత్రం గర్భిణులు ఇష్టపడటం లేదు. ఆ విధానం మారాలంటే వైద్య, ఆరోగ్య శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు పీహెచ్‌సీల్లో ప్రసవాలు చేయించుకోవాల్సిన ఆవశ్యకతపై వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పీహెచ్‌సీల్లో పెంచేందుకు ప్రణాళికలు పీహెచ్‌సీల్లో ప్రసవాలు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. సబ్‌సెంటర్లలోని ఆశ, ఏఎన్ఎం, సూపర్వైజర్ల ద్వారా గర్భిణులను గుర్తించి.. వారికి అవగాహన కల్పిస్తున్నాం. దగ్గర్లోని పీహెచ్‌సీల్లో ప్రసవాలు చేయించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై వివరిస్తున్నాం. అలాగే తొలిసారి సాధారణ కాన్పు చేయించుకోవాలని అవగాహన కల్పిస్తున్నాం. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా పీహెచ్‌సీల్లో ప్రసవాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. - కళావతిబాయి, డీఎంహెచ్ఓ -
వైద్యానికి వస్తే.. ప్రాణం పోయింది
కోల్‌సిటీ(రామగుండం): జ్వరం వచ్చిందని ఓ మహిళ ఆస్పత్రికి వస్తే... ప్రాణమే పోయింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో శుక్రవారం చోటు చేసుకుంది. వైద్యులు వేసిన ఇంజక్షన్లు వికటించడంతోనే మృతి చెందిందని కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు. ఆగ్రహంతో ఆస్పత్రిలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల మేరకు... పెద్దపల్లి మండలంలోని అందుగులపల్లి గ్రామానికి చెందిన నిరుపేద పిల్లి వేణుగోపాల్, సంధ్య(25) దంపతులు. వీరికి ఐదు సంవత్సరాల కూతురు ఉంది. సంధ్యకు వారం రోజులుగా జ్వరం వస్తుండడంతో, ఈనెల 10న రామగుండం వీక్లీ మార్కెట్ సమీపంలోని తన పుట్టింటికి వచ్చింది. స్థానికంగా ఆర్ఎంపీల దగ్గర వైద్యం చేయించినప్పటకీ తగ్గకపోవడం, వాంతులు అవుతుండడంతో, గురువారం గోదావరిఖని లక్ష్మీనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. శుక్రవారం కూడా జ్వరం తగ్గకపోవడంతో ఆస్పత్రి డాక్టర్ సూచనల మేరకు సిబ్బంది వరుసగా నాలుగైదు ఇంజక్షన్లు వేశారు. కాసేటికి ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పిన ఆస్పత్రి డాక్టర్, స్థానికంగానే మరో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు కూడా పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో కరీంనగర్‌లోని మరో కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలోకి తరలించి వైద్యం అందించే ప్రయత్నం చేసిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని వెల్లడించారు. సంధ్య మృతి చెందడానికి గోదావరిఖనిలో తొలత చేర్పించిన ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్ ఇచ్చిన ఇంజక్షన్లు వికటించడంతోనేనని ఆరోపించారు. మృతదేహంతో ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశా రు. మృతిరాలి కటుంబానికి న్యాయం చెయ్యాలని, ఆస్పత్రిని మూసివేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆగ్రహంతో ఆస్పత్రి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. వన్‌టౌన్ సీఐ వాసుదేవరావు, ఎస్సై ఉపేందర్‌రావు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని, దాడులకు పాల్పడడం సరికాదని హెచ్చరించారు. చివరికి కొందరు పెద్దలు జోక్యం చేసుకొని ఆస్పత్రి వైద్యులు, మృతురాలి బంధువులతో చర్చలు జరుపుతున్నారు. -
కాన్పుకు వస్తే కడుపులో కాటన్ వేసి..
షాద్‌నగర్‌టౌన్ : వైద్యుల నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలైన సంఘటన షాద్‌నగర్‌లో చోటు చేసుకుంది. ఎనిమిది నెలలుగా మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. షాబాద్ మండలం బొబ్బిలిగామ గ్రామానికి చెందిన హరిత(25)ను ఏడాదిన్నర కిత్రం అదే మండలంలోని అప్పారెడ్డిగూడ గ్రామానికి చెందిన రాజుతో వివాహం చేశారు. హరితకు తొలి కాన్పు సమయం దగ్గర పడడంతో గతేడాది అక్టోబర్ 3న షాద్‌నగర్ పట్టణంలోని విజయ ఆస్పత్రికి తీసుకొచ్చారు. హరితను పరీక్షించిన వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేయాలని కుటుంబ సభ్యులకు సూచించారు. కుటుంబీకుల అంగీకారంతో అక్టోబర్ 5న ఆపరేషన్ చేయడంతో హరిత తొలికాన్పులో పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. పాపను చూసి మురిసిపోయిన ఆ కుటుంబ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. ఆపరేషన్ అయిన కొన్ని నెలల్లోనే హరిత అనారోగ్యానికి గురైంది. ఆమె ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుండడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. హరితకు స్కానింగ్ చేసి ఆమె కడుపులో కాటన్ ఉన్న విషయాన్ని వైద్యులు గుర్తించారు. ఉస్మానియా వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న కాటన్‌ను తొలగించారు. అయినా ఆమె ఆరోగ్య పరిస్ధితి మెరుగుపడలేదు. కొన్ని నెలలుగా మృత్యువుతో పోరాటం చేసి శుక్రవారం అర్ధరాత్రి తర్వాత హరిత మృతి చెందింది. ఆస్పత్రి ఎదుట పసిపాపతో ధర్నా మృతురాలి కుటుంబీకులు శనివారం సాయంత్రం షాద్‌నగర్‌లోని విజయ ఆస్పత్రి ఎదుట ధర్నా చేప ట్టారు. హరిత కూతురు పసిపాపతో ఆస్పత్రి ఎదు ట బైఠాయించారు. పసిపాపకు న్యాయం చేయాల ని, నిర్లక్ష్యంగా వ్యహరించి ఆపరేషన్ చేసిన వైద్యులను వెంటనే అరెçస్టు చేయాలని డిమాండ్ చేశారు. మృతురాలి బంధువులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా షాద్‌నగర్ పట్టణ సీఐ అశోక్‌కుమార్ గట్టి బందోబస్తు చేపట్టారు. ఉస్మానియా ఆసుపత్రి నుండి హరిత మృతదేహాన్ని పోలీసులు నేరుగా ఆమె స్వగ్రామైన షాబాద్ మండలం అప్పారెడ్డిగూడ గ్రామానికి తరలించారు. రూ. 10లక్షల నష్టపరిహారం చెల్లించాలి హరిత మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణం అంటూ బాధిత కుటుంబ సభ్యులు రూ. 10లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. చిన్నారి పాప భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని న్యాయం చేయాలని ఆందోళన చేపట్టిన వారు డిమాండ్ చేశారు. అయితే పోలీసులు, స్ధానిక నాయకులు జోక్యం చేసుకొని విజయ ఆస్పత్రి వైద్యులతో చర్చించినట్లు సమాచారం. బాధిత కుటుంబానికి రూ.3లక్షలు నష్టపరిహారం చెల్లించేందుకు అంగీకరించినట్లు తెలిసింది. -
నిర్లక్ష్యానికి బాలింత బలి
నాగర్‌కర్నూల్ ఎడ్యుకేషన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల ర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైపోయింది. పండంటి బిడ్డను జన్మనివ్వాలని పురుడు పోయడానికి వచ్చిన మహిళ విగతజీవిగా ఇంటికి చేరింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా.. ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన కృష్ణవేణి (22) గత ఆదివారం పురిటి నొప్పులతో బాధపడుతూ జిల్లా ఆస్పత్రిలో చేరింది. మరుసటిరోజు సిజేరియన్ చేయగా రెండో కాన్పులోనూ మగబిడ్డ జన్మించాడు. ఫొటోథెరపీ కోసం శిశువును వేరే ప్రైవేటు ఆస్పత్రికి పంపించారు. ప్రసవం అనంతరం బాలింత నొప్పులతో బాధపడుతుందని భర్త మల్లేష్ వైద్యులకు చెప్పాడు. అయినా వినకుండా నిర్లక్ష్యం చేశారు. మరుసిటిరోజు పొట్ట ఉబ్బడం, తీవ్ర నొప్పులు రావడంతో సంబంధిత వైద్యున్ని సంప్రదించాడు. పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం అందించాలని, ఇక్కడ సరిపోను వసతులు లేవని మహబూబ్‌నగర్‌కు రెఫర్ చేశారు. అక్క డ కూడా పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ వైద్యం అందిస్తుండగా పరిస్థితి విషమించి గురువారం రాత్రి 9.30గంటల సమయంలో మృతిచెందింది. మృతికి కారణం సిజేరియన్ చేసిన వైద్యుల అలసత్వమేనం టూ శుక్రవారం ఉదయం బంధువులతోపాటు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున ఆస్పత్రి ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. వైద్యాధికారులు స్పం దించక పోవడంతో శ్రీశైలం ప్రధాన రహదారిపై గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. మద్దతు తెలిపిన నాయకులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ బాధితులకు అండగా కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు కొండా మణెమ్మ, వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాస్, ఉస్సేన్, బాలయ్య, నాసర్‌ఖాన్, సీపీఎం, సీపీఐ ఇతర నాయకులు వారి ఆందోళనకు మద్దతు తెలిపారు. కలెక్టర్ వచ్చి కుటుంబానికి న్యాయం చేసే వరకు కదిలేది లేదని నినాదాలు చేశారు. విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను ఇతర దారులకు మళ్లించారు. అనంతరం సంఘటన స్థలానికి డీఆర్వో మధుసూదన్‌నాయక్, ఆర్డీఓ శ్రీనివాసులు, డీఎస్పీ లక్ష్మీనారాయణ చేరుకుని బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సంఘటనపై విచారం వ్యక్తంచేస్తూ కుటుంబానికి ఆస్పత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగం కల్పించడంతోపాటు జీవన భృతి కోసం ఎస్సీ కార్పొరేషన్ కింద లక్ష రూపాయల లోన్ వచ్చే విధంగా ప్రయత్నిస్తామని హామీ ఇవ్వడంతో బాధిత కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు. ఇచ్చిన హామీలను విస్మరిస్తే మళ్లీ ఆందోళనకు వెనకాడమని వివిధ పార్టీల నాయకులు స్పష్టం చేశారు. -
వైద్యం వికటించి వివాహిత మృతి
కానూరు (పెనమలూరు) : మోకాలికి గాయం అవ్వటంతో చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లిన వివాహిత.. వైద్యం వికటించటంతో మృతి చెందింది. మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట బుధవారం ధర్నా చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆస్పత్రి యాజమాన్యంతో పోలీసులు, పెద్దలు చర్చలు జరిపి మృతురాలి కుటుంబానికి పరిహారం ఇవ్వటంతో వివాదం సమసింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యనమలకుదురు భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఎండీ హనీమా (23) నాలుగేళ్ల క్రితం నజీబ్‌ను వివాహం చేసుకుంది. వీరికి రెండేళ్ల వయసున్న బాబు ఉన్నాడు. రెండు నెలల క్రితం హనీమా స్కూటీ నేర్చుకుంటూ కిందపడింది. ఆమె మోకాలికి గాయమైంది. మోకాలు నొప్పి తగ్గకపోవటంతో ఈ నెల 26న కానూరు అశోక్‌నగర్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్ష చేయించుకుంది. ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. దీంతో ఆమె ఆస్పత్రిలో చేరింది. ఆపరేషన్ చేయటానికి 27వ తేదీ మత్తు మందు ఇచ్చారు. దీంతో ఆమె ఒక్కసారిగా కోమాలోకి వెళ్లింది. ఆమెను ఐసీయూలో ఉంచారు. ఆమె ఆరోగ్యం ఏమైందని కుటుంబ సభ్యులు అడుగగా ఆస్పత్రి యాజయాన్యం సమాధానం చెప్పలేదు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఆమె చనిపోయిందని ఆస్పత్రి సిబ్బంది సమాచారం ఇచ్చారు. ఆందోళనకు దిగిన బంధువులు వైద్యం వికటించి హనీమా చనిపోయిందని, దీనికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, ఆస్పత్రిని మూయించాలని డిమాండ్ చేశారు. దీంతో సీఐ దామోదర్, ముస్లీం పెద్దలు వచ్చి ఆస్పత్రి యాజమాన్యంతో చర్చలు జరిపారు. పరిహారం ఇస్తామని ఆస్పత్రి యాజమాన్యం అంగీకరించటంతో బాధితులు ఆందోళన విరమించారు. మృతురాలి కుటుంబానికి రూ.3 లక్షలు పరిహారం ఇవ్వటానికి రాజీ కుదిరినట్లు సమాచారం.