మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
డాక్టర్ వేధింపులే కారణమని లేఖ
దుర్గాబాయి దేశ్‌ముఖ్ రీసెర్చ్ సెంటర్లో ఘటన
హైదరాబాద్: జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పై చదువుల కోసం నగరానికి వచ్చిన ఓ యువతి అర్ధాంతరంగా తనువు చాలించింది. డాక్టర్ వేధింపులే తన చావుకు కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన హైదరాబాద్ నల్లకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివా రం చోటుచేసుకుంది. ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్ జిల్లా హన్మకొండ పోస్టల్ కాలనీలో నివాసముండే పత్తిపాక వెంకటయ్య కుమార్తె మాధవి(27). కాకినాడలో ఎంబీబీ ఎస్ పూర్తి చేసింది. విద్యానగర్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఆస్పత్రి రీసెర్చ్ సెంటర్లో పీజీ గైనకాలజీలో సీటు రావడంతో రెండు నెలల కిందట ఇక్కడ చేరింది. ఒక వైపు చదువుకుంటూనే అదేఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌గా పనిచేస్తుంది. అక్కడే హాస్టల్లో ఉంటోంది. కాగా, శనివారం రాత్రి విధులు ముగించుకొని తన గదికి వెళ్లిపోయిన మాధవి.. తల్లికి ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడింది. ఆదివారం ఉదయం కూడా తన స్నేహితురాలు ఫోన్‌చేయగా ఆమెతో కూడా మాట్లాడింది. మధ్యాహ్నం వరకు కూడా మాధవి ఉంటున్న గది తలుపులు తెరుచుకోలేదు. దీంతో ఆస్పత్రి సిబ్బంది అనుమానంతో కిటికిలోంచి చూడగా ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆస్పత్రి అధికారులు పోలీసులకు సమాచారమందించారు. మాధవి తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సూసైడ్ నోట్లో డాక్టర్ పేరు..
ఆసుపత్రికి చెందిన డాక్టర్ సరోజిని కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్లో మాధవి పేర్కొంది. పోలీసులు ఆ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన కుమార్తె ఆత్మహత్యకు ఆస్పత్రి యాజమాన్యం, డాక్టర్ సరోజిని కారణమని మృతురాలి తండ్రి ఆరోపించాడు. కాగా, రెండు నెలల కిందట ఇదే కళాశాలలో చదువుతున్న కడపకు చెందిన అశ్విని అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గతంలో కూడా ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. రెండు నెలల్లో ఇలా ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంతో అక్కడి విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.