లిబియాలో కిడ్నాపైన డాక్టర్ విడుదల
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఎట్టకేలకు లిబియా ఉగ్రవాదుల చెర నుంచి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన డాక్టర్ రామ్మూర్తి విడుదలయ్యారు. ఈ మేరకు ఆయన కుటుంబీకులకు సమాచారం అందింది.ఆయన లిబియాలోని ఇండియన్ ఎంబసీకి చేరుకున్నారని, 25న ఢిల్లీకి చేరుకుంటారని తెలిసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన కొసనం రామ్మూర్తి వైద్యుడు. కుటుంబంతో ఏలూరు శివారు దొండపాడులో స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో 16 ఏళ్ల కిందట రామ్మూర్తి లిబియా వెళ్లారు.
ఆయనను 2015 సెప్టెంబర్లో లిబి యాలోని సిర్త్ పట్టణంలో ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. కిడ్నాపైన వారిలో ఒడిశాకు చెందిన ఒక వ్యక్తితో పాటు రామ్మూర్తి కూడా ఉన్నారని తెలియడంతో ఆయన భార్య, పిల్లలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరికి వారి నిరీక్షణకు తెరపడింది. ఆయన బుధవారం లిబియాలోని ఇండియన్ ఎంబసీకి క్షేమంగా చేరుకో వడంతో కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.