పిల్లాడి రక్తం తాగి, గుండెను విసిరేశాడు
లుథియానా: పంజాబ్లో లుథియానాకు 16 ఏళ్ల టీనేజర్ అత్యంత భయానకంగా, క్రూరంగా తొమ్మిదేళ్ల చిన్నారిని హత్య చేశాడు. డుగ్రీ ప్రాంతంలో కర్నైల్ సింగ్ నగర్లో 8వ తరగతి చదవుతున్న విద్యార్థి.. దూరపు బంధువు, ఇంటి పక్కన ఉండే దీపు అనే బాలుడ్ని మంగళవారం హత్య చేశాడు. తర్వాత నిందితుడు పిల్లాడి రక్తం తాగి, అతని తొడకండరాన్ని కోసి తిన్నాడు. దీపు మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికాడు. హంతకుడు బాత్రూమ్లో వీటిని శుభ్రం చేసి, తీసుకెళ్లి నిర్మానుష ప్రాంతంలో పడేశాడు. అంతేగాక దీపు మృతదేహం నుంచి గుండెను తొలగించి స్కూల్ కాంపౌండ్లోకి విసిరేశాడు. పోలీసులు దీపు మృతదేహపు భాగాలను, గుండెను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టంకు తరలించారు.
సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారించగా, నేరం చేసినట్టు అంగీకరించాడు. కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో దీపును కత్తితో పొడిచి చంపినట్టు ఒప్పుకున్నాడు. కేసు విచారణలో నిందితుడు చెప్పిన ఈ వివరాలు విని పోలీసులే షాకయ్యారు. స్కూలుకు వెళ్లడం తనకు ఇష్టంలేదని చెప్పాడు. స్కూలుకు చెడ్డపేరు తీసుకురావడం కోసం దీపు గుండెను స్కూల్లోకి విసిరినట్టు తెలిపాడు. దీపును కిడ్నాప్ చేశానని చెప్పి, అతని కుటుంబం నుంచి డబ్బులు డిమాండ్ చేయాలని నిందితుడు భావించాడని, తర్వాత ఈ పథకాన్ని విరమించుకున్నాడని పోలీసులు చెప్పారు. నిందితుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, నరమాంసం తినేందుకు క్రూరంగా ప్రవర్తిస్తాడని పోలీసులు చెప్పారు. కొన్నిసార్లు అతను తన చేతులను కొరుక్కునేవాడని కుటుంబ సభ్యులు చెప్పినట్టు వెల్లడించారు.