3నేలబారు చదువులు
శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో సమస్యల గురించి విద్యార్థులు చెప్పినవి, చూసినవి చాలా బాధ కలుగుతోంది. వీటిపై సమగ్ర నివేదిక రూపొందించి ఇంటర్ విద్య కమిషనర్ దృష్టికి తీసుకెళ్తాను. ప్రస్తుతానికి ఎక్యూమలేషన్ ఫండ్స్ నుంచి డ్రా చేసి కొన్ని సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాను. అధ్యాపకుల కొరత ఒక్క శ్రీకాకుళంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెల కొంది. వచ్చే విద్యాసంవత్సరం నాటికి కొరత లేకుం డా చూడాలని ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. శ్రీకాకుళం పట్టణ పరిధిలో హెచ్ఆర్ఏ తక్కువ ఇస్తున్నారన్నట్లు కొందరు నా దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం, ఉన్నతాధికారుల నుంచి సానుకూలంగా నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాను.
- పాత్రుని పాపారావు, జిల్లా వృత్తివిద్యాధికారి, శ్రీకాకుళం
విద్యా సంవత్సరం దాదాపు చివరికొచ్చింది. మరో మూడు వారాల్లో ప్రాక్టికల్ పరీక్షలు, అక్కడికి పక్షం రోజుల తర్వాత పబ్లిక్ పరీక్షలు మొదలుకానున్నాయి. కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు మాత్రం పాఠాలకు నోచుకోవడంలేదు. ప్రధానంగా అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది కొరత సర్కారీ విద్యను వెంటాడుతోంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలోనే పలు సమస్యలు తిష్ఠ వేశాయి. తరగతి గదులు పూర్తిస్థాయిలో లేవు. నేలచదువులే దిక్కు. మరుగుదొడ్లు లేవు. తాగునీరు కూడా గగనమే. ఇలా ఎన్నో సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతున్నామని పిల్లలు, మిగిలిన జిల్లాల మాదిరిగా ప్రభుత్వం తమకు అందించాల్సిన రాయితీలను ఇవ్వడంలేదని జూనియర్ లెక్చరర్లు, ఉద్యోగ భద్రత లేక బిక్కుబిక్కుమంటూ పాఠాలు బోధిస్తున్నామని కాంట్రాక్ట్ లెక్చరర్లు ‘సాక్షి వీఐపీ రిపోర్టర్’కు తమ గోడు వినిపించారు. ఆయన మరెవరో కాదు.. జిల్లా వృత్తివిద్య అధికారి (డీవీఈవో) పాత్రుని పాపారావు. ఇంటర్ విద్య పర్యవేక్షణాధికారి ఆయన స్వయంగా కళాశాలకు వెళ్లి అధ్యాపకులు, విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
ఆ వివరాలు యథాతథంగా...
ప్రిన్సిపాల్‌తో..
డీవీఈవో : సార్ చెప్పండి.. ఈ కళాశాలకు చాలా ప్రత్యేకత ఉంది కదా! ప్రస్తుతం పరిస్థితి ఏంటి. సదుపాయాలు ఎలా ఉన్నాయి?
ప్రిన్సిపాల్(సత్యనారాయణ) :
ఇక్కడ చదువుకున్న ఎంతోమంది వ్యక్తులు ఉన్నత హోదాల్లో ఉన్నారు. నేను గత ఏడాదిన్నర కాలంగా ఇక్కడ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నాను. 1200
మందికిపైగా విద్యార్థులు ఉన్నారు. తరగతి గదులు, మరుగుదొడ్లు లేవు. మంచినీరు అందుబా
టులో ఉండదు. మరీ ముఖ్యంగా అవసరమైనంతమంది అధ్యాపకులు లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది.
డీవీఈవో : ఏఏ సబ్జెక్టుల్లో ఖాళీలున్నాయి?
ప్రిన్సిపాల్: అధ్యాపకులతోపాటు బోధనేతర సిబ్బంది కొరత కూడా ఉంది. ప్రధానంగా ఇంగ్లిషుకు ఇద్దరు అవసరం. జువాలజీ, జాగ్రఫీ, హిందీ సబ్జెక్టులకు అధ్యాపకులే లేరు.
డీవీఈవో : ఉన్నతాధికారులకు నివేదించారా?
ప్రిన్సిపాల్: కళాశాలలో మౌలిక సదుపాయాల కొరతపై ఇప్పటికే ఇంటర్ విద్య కమిషనర్, మున్సిపల్ కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాను. ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు.
విద్యార్థులతో..
డీవీఈవో(తరగతి గదిలోకి వెళి): నేల చదువులు చదువుతున్న విద్యార్ధులతో మాట్లాడుతూ.. చెప్పమ్మా కళాశాలలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలేంటి?
కె.దేవి(సీఈసీ ద్వితీయ): కళాశాలలో మేం చాలా ఇబ్బందులు పడుతున్నాం. టాయిలెట్స్ లేవు. నీరు కూడా రాదు. నేలచదువులే చదువుతున్నాం.
డీవీఈవో : మీ సార్లు తరగతులు బాగా చెబుతున్నారా?.. సమయపాలన పాటిస్తున్నారా?
దేవి : ఉన్న సార్లంతా బాగా క్లాసులు చెబుతారు సార్. కానీ చాలా సబ్జెక్టులకు సార్లే లేరు. నాతోపాటు మిగిలిన గ్రూపుల్లోని మా స్నేహితులు చాలా ఇబ్బందులు పడుతున్నాం. పరీక్షలు దగ్గరపడుతున్నాయి. భయమేస్తోంది. అధికారులు చర్యలు తీసుకోవాలి సార్.
డీవీఈవో : మరో క్లాసు రూమ్‌కు వెళ్లి.. బాబూ ఈ కళాశాలలో ఉన్న సమస్యలేంటి చెప్పు?
ఎ.మహేష్(ఒకేషనల్ ప్రథమ): బాత్రూమ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. అత్యవసర సమయాల్లో నాగావళి నదే మాకు దిక్కు. తరగతి గదులు లేక స్టోర్రూములో కూర్చుంటున్నాం. ఫ్యాన్లు లేవు. కొన్ని సబ్జెక్టులకు సార్లు లేరు.
ఆధ్యాపకులతో..
డీవీఈవో : మీ కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలేంటి? జీతాలు సక్రమంగా అందుతున్నాయా?
ఎన్.సత్యనారాయణ(కాంట్రాక్ట్ లెక్చరర్): దశాబ్దకాలంగా నాతోపాటు జిల్లాలో చాలామంది కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. భద్రత లేని ఉద్యోగాలు కావడంతో మనోధైర్యంతో పనిచేయలేకపోతున్నాం. కొన్నిసార్లు ఏకాగ్రత దెబ్బతింటోంది. ప్రభుత్వం మాకు భద్రత కల్పిస్తుందని భావిస్తున్నాం. జీతాలు నెలనెలా అందడంలేదు. ఉన్నతాధికారులు దానిపై దృష్టిసారించాలి.
డీవీఈవో : చెప్పండి.. మీరు కెమిస్ట్రీ లెక్చరర్ కదా.. ప్రాక్టికల్స్ ఏవిధంగా నిర్వహిస్తున్నారు?
బి.శ్యామ్‌సుందర్(లెక్చరర్) : విద్యార్థులను ప్రాక్టికల్ పరీక్షలకు ఇప్పటికే సిద్ధం చేశాం సార్. సైన్స్ లెక్చరర్లమంతా ఒక క్రమ పద్ధతిలో విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా బాలురకు కంపెనీల్లో చేరదలచుకునేవారికి టైట్రేషన్స్ అనాలసిస్, మూలకాలపై పూర్తిస్థాయిలో తర్ఫీదు ఇస్తున్నాం సార్.
డీవీఈవో : ప్రాక్టికల్ పరీక్షలకు డీవోలగా ఇతర శాఖల సిబ్బందిని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై మీ అభిప్రాయమేంటి?
జి.వెంకటేశ్వరరావు(సీనియర్ ఫిజిక్స్ లెక్చరర్) : ఇంటర్‌బోర్డు ఏర్పడినప్పటి నుంచి ప్రాక్టికల్ పరీక్షలకు డిపార్ట్మెంటల్ అధికారులుగా ఇతర
శాఖల సిబ్బందిని నియమించలేదు. ఆనవాయితీని పక్కనపెడితే మా మనోభావాలను దెబ్బ
తీసినట్లే. అదే జరిగితే ఊరుకునేది లేదు సార్. ప్రభుత్వానికి చేతనైతే కార్పొరేట్‌కు తలొగ్గకుండా
ప్రాక్టికల్ పరీక్షలను జంబ్లింగ్ పద్ధతిలో నిర్వహించాలి.
బోధనేతర సిబ్బందితో..
డీవీఈవో : జిల్లాలో బోధనేతర సిబ్బంది ఎంతమంది ఉన్నారు? కొరత ఏమైనా ఉందా?
కె.కమలాకర్(నాన్‌టీచింగ్ స్టాఫ్ జిల్లా అధ్యక్షుడు) : జిల్లాలో 43 ప్రభుత్వ కళాశాలల్లో ప్రస్తుతం 120 మంది మాత్రమే నాన్‌టీచింగ్ స్టాఫ్ ఉన్నాం.
200కుపైగా ఖాళీలను భర్తీచేయాల్సి ఉంది. దీంతో కళాశాలల్లో పరిపాలన సక్రమంగా సాగడంలేదు. ప్రస్తుతం అంతా ఆన్లైన్లోనే ఉత్తర
ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇంటర్నెట్ వినియోగంపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తే మంచిది.