Electricity Employees
-
కరెంట్ కట్ చేస్తే.. సస్పెన్షన్!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా విద్యుత్ కోతలు విధించే అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలయ్యాయన్న ప్రచారం నేపథ్యంలో సీఎం గురువారం సచివాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రభుత్వం ఎలాంటి విద్యుత్ కోతలు విధించాలని ఆదేశించలేదని.. అనవసరంగా కోతలు పెట్టి రైతులను, ప్రజలను ఇబ్బందిపెడితే క్షమించేది లేదని హెచ్చ రించారు. అవసరానికి సరిపడా విద్యుత్ ఉందని, గతంతో పోలిస్తే సరఫరా పెరిగిందన్నారు. అయినా కూడా కోతలు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ అధికారులదేనని సీఎం పేర్కొన్నారు. ఇటీవల పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిపేసిన ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ సిబ్బంది అత్యుత్సాహంతో.. ఇటీవల రాష్ట్రంలో మూడు సబ్స్టేషన్ల పరిధిలో కొంతసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని.. మిగతాచోట్ల ఎలాంటి ఇబ్బందీ లేదని ట్రాన్స్‌కో సీఎండీ రిజ్వీ ఈ సమీక్షలో వివరించారు. ఆయాచోట్ల సరఫరా లోపానికి కారణాలేమిటని సీఎం ప్రశ్నించగా.. సబ్స్టేషన్లలో లోడ్ హెచ్చుతగ్గులను డీఈలు సరిచూడాలని, అలా చేయకపోవడంతో సమస్య తలెత్తిందని సీఎండీ వివరించారు. దీంతో ఇలా నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మరమ్మతులు, సాంకేతిక సమస్యలు, ప్రకృతిపరమైన కారణాలు మినహా విద్యుత్ సరఫరాలో కోతలు ఉండొద్దని స్పష్టం చేశారు. విద్యుత్ కోతలు విధించే పక్షంలో ముందుగా ఆయా సబ్స్టేషన్ల పరిధిలోని వినియోగదారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన క్షేత్రస్థాయి సిబ్బంది అత్యుత్సాహంతో కోతలు విధిస్తున్నట్టు తన దృష్టికి వచి్చందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో సరిపడా విద్యుత్ అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని అధికారులు సీఎంకు వివరించారు. ఈసారి ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 13వ తేదీ వరకు రోజుకు సగటున 264.95 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశామని.. గతేడాది ఇదే వ్యవధిలో 242.44 మిలియన్ యూనిట్ల సరఫరానే ఉందని తెలిపారు. -
విద్యుత్ ఉద్యోగులతో ఫలించిన చర్చలు
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగులతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో ఉద్యోగుల ఆందోళనకు తెరపడింది. గురువారం తలపెట్టిన సమ్మె ప్రతిపాదనను కూడా వారు ఉపసంహరించుకున్నారు. పే రివిజన్లో భాగంగా డిమాండ్ల సాధన కోసం గత నెల 27 నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన ఉద్యోగులు ఈనెల 10 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని వెల్లడించారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (ఏపీఎస్‌పీఈజేఏసీ) నోటీసు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీఎస్‌పీఈజేఏసీ ప్రతినిధులతో ప్రభుత్వం బుధవారం సచివాలయంలో చర్చలు జరిపింది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ సమక్షంలో ఈ చర్చలు జరిగాయి. ఇది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వమని, అందరికీ మేలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విద్యుత్ ఉద్యోగులకు తెలిపారు. విద్యుత్ సంస్థలను కాపాడుకునేందుకు యాజమాన్యం, ఉద్యోగులు ఎంతో కొంత త్యాగం చేయాల్సిన అవసరం ఉందని మంత్రులు, అధికారులు సూచించారు. అనామలీస్ ఉంటే సరిచేసి పేస్కేలును నిర్ధారించడానికి ఏపీజెన్కో ఎండీ నేతృత్వంలో డిస్కంల సీఎండీలతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసేలా అంగీకారం కుదిరింది. సింగిల్ మాస్టర్ స్కేల్ పీపీతో కలిపి రూ.2.60 లక్షలు, 8 శాతం ఫిట్మెంట్, ఒక డీఏ విడుదల, 12 వాయిదాల్లో బకాయిలు, వైద్య పరిమితి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు, మాస్టర్ స్కేల్ రూ.2.60 లక్షలు దాటిన వారికి తప్పనిసరిగా పర్సనల్ పే, అవుట్సోర్సింగ్ సిబ్బందికి 2018 స్కేల్ ప్రకారం జీతాలతో పాటు అదనంగా 2 శాతం పెంపునకు యాజమాన్యాలు, ఉద్యోగ సంఘాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. యాజమాన్యం ప్రతిపాదనలను ఆమోదిస్తున్నట్లు జేఏసీ ప్రతినిధులు ప్రకటించారు. ఈ మేరకు పీఆర్సీ ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఏపీ ట్రాన్స్‌కో, ఏపీజెన్కో, ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు, జేఏసీ ప్రతినిధుల మధ్య శుక్రవారం ఒప్పందం జరుగుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఈ చర్చల్లో సీఎస్ జవహర్‌రెడ్డి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్, ఏపీజెన్కో ఎండీ చక్రధర్‌బాబు, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పద్మాజనార్దన్ రెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ మల్లారెడ్డి, జేఏసీ నేతలు చంద్రశేఖర్, ప్రతాప్‌రెడ్డి, సాయికష్ణ, శేషారెడ్డి, శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అందరికీ ఆమోదయోగ్యంగా ‘పీఆర్సీ’పై నిర్ణయం
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీపై అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటామని రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. వీరు విద్యుత్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సచివాలయంలో బుధవారం భేటీ అయ్యారు. సంఘాల ప్రతినిధులు పే రివిజన్‌పై ఉద్యోగుల డిమాండ్లను మంత్రులకు వివరించారు. ప్రస్తుత విధానాన్ని కొనసాగిస్తూ సింగిల్ మాస్టర్ స్కేల్ అమలు చేయాలని కోరారు. జెన్కో ఉద్యోగులకు అలవెన్స్‌లు, ఇతర అలవెన్స్‌లను యథాతథంగా కొనసాగించాలని, వెయిటేజీతో పాటు ఫిట్మెంట్లను అలానే ఉంచాలని, అలాకాని పక్షంలో అధిక ఫిట్మెంట్ ఇవ్వాలని కోరారు. ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ మాట్లాడుతూ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగానే పరిశీలిస్తోందన్నారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల డిమాండ్లను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళతామని, వారం రోజుల్లో మరోసారి ఉద్యోగసంఘాల ప్రతినిధులతో భేటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే వన్ మెన్ కమిషన్ నివేదికపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో దానిని పూర్తిస్థాయిలో పరిగణనలోకి తీసుకోవడం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఏపీ జెన్కో ఎండీ, ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్ బాబు, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వితేజ్, ట్రాన్స్ కో విజిలెన్స్ జేఎండీ మల్లారెడ్డి పాల్గొన్నారు. -
విద్యుత్ ఉద్యోగుల చర్చలు సఫలం.. పీఆర్సీ ఎంత శాతమంటే?
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుతో విద్యుత్ ఉద్యోగుల చర్చలు సఫలమయ్యాయి. ఈ క్రమంలో ఏడు శాతం పీఆర్సీకి విద్యుత్ ఉద్యోగులు అంగీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, సీఎండీ ప్రభాకర్ రావుకు విద్యుత్ ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం, ఏడు శాతం పీఆర్సీ ఒప్పందంపై విద్యుత్ ఉద్యోగులు సంతకం చేశారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 17 నుంచి తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎస్పీఈ జాక్) తలపెట్టిన సమ్మె విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం జరిగిన చర్చలు విజయవంతమయ్యాయి. దీంతో, రేపటి నుంచి తలపెట్టిన సమ్మె విరమించుకున్నారు. -
ఈనెల 17 నుండి విద్యుత్ ఉద్యోగుల సమ్మె
-
కరెంటోళ్ల సమ్మెపై జోక్యం చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల సమ్మె నోటీసుపై జోక్యం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖను తెలంగాణ ట్రాన్స్‌కో కోరింది. ఈ మేరకు పరస్పర ఆమోదయోగ్య పరిష్కారం కోసం విద్యుత్ సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగ సంఘాలతో చర్చలకు సంయుక్త సమావేశానికి ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు రాష్ట్ర కార్మిక శాఖ కమిషనర్‌కు గురువారం లేఖ రాశారు. వేతన సవరణ, ఇతర డిమాండ్లను పరిష్కరించని పక్షంలో ఈ నెల 17న ఉదయం 8 గంటల నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తూ తెలంగా ణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ ఇటీవల యాజ మాన్యాలకు నోటిసులు అందజేసిన విషయం తెలి సిందే. విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగితే ప్రజలు తీవ్ర అసౌకర్యాలకి గురి అవుతారని, సమ్మెకు వెళ్లకుండా వారితో రాజీ కుదర్చాలని కార్మిక శాఖ కమిషనర్‌ను తాజా లేఖలో ట్రాన్స్‌కో సీఎండీ కోరారు. మళ్లీ చర్చలకు సిద్ధం.. విద్యుత్ ఉద్యోగుల జేఏసీలతో ఇప్పటికే ఐదు దఫాలుగా చర్చలు జరిపి 6శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ అమలుకు హామీ ఇచ్చామని ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు తెలిపారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014, 2018లో వరుసగా 30శాతం, 35శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయడం, సర్విసు వెయిటేజీ, ఇతర ప్రయోజనాలను కల్పించడంతో ఉద్యోగుల వ్యయం గణనీయంగా పెరిగిందన్న అంశాన్ని సైతం జేఏసీలకు తెలియజేశామన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని విద్యుత్ సంస్థలతో పోల్చితే రాష్ట్ర విద్యుత్ సంస్థల ఉద్యోగుల జీతాలు, ఇతర ప్రయోజనాలు అధికంగా ఉన్నట్టు జేఏసీలకు వివరించినట్టు పేర్కొన్నారు. యాసంగి పంటల సాగు, పదో తరగతి వార్షిక పరీక్షలు, టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురి చేస్తాయని జేఏసీలకు వివరించామన్నారు. తదుపరి చర్చలకు యాజమాన్యాలు సిద్ధంగా ఉన్నాయని, సమ్మె పిలుపును ఉపసంహరించుకోవాలని కోరుతూ ఇటీవల తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జేఏసీకి లేఖ సైతం రాసినట్టు ప్రభాకర్‌రావు వెల్లడించారు. విద్యుత్ సంస్థల ఆర్థిక పరిస్థితికి లోబడి డిమాండ్ల పరిష్కారానికి మళ్లీ చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని, మధ్యవర్తిత్వం వహించి చర్చలకు ఏర్పాట్లు చేయాలని కార్మికశాఖ కమిషనర్‌ను కోరారు. విద్యుత్ సమ్మె తథ్యం తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ స్పష్టికరణ సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులు ఆత్మస్థైర్యంతో ఈ నెల 17 నుంచి సమ్మెకు సిద్ధం కా వాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్, కన్వీనర్లు సాయిబాబు, రత్నాకర్‌రావు పిలుపునిచ్చారు. సమ్మెలపై నిషేధాలు, చట్టాల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తూ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఎదురుదాడికి దిగాయని దుయ్యబట్టారు. సమ్మె తథ్యమని, వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. సమ్మెలపై నిషేధం అమల్లో ఉందని హెచ్చరిస్తూ జేఏసీకి ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు లేఖ రాయ డాన్ని ఖండిస్తూ గురువారం ఒక ప్రకటనను విడుదల చేశారు. అత్యవసర సేవలైనందున విద్యుత్ సంస్థల్లో ప్రతి 6 నెలలకోసారి సమ్మెలపై నిషేధాన్ని పొడిగించడం ఆనవాయితీ అని, ఏ రోజూ ఈ ఉత్తర్వులను ఉద్యోగులు అతిక్రమించలేదని గుర్తుచేశారు. పీఆర్సీ అమలుపై ఏడాదిగా కాలయాపన చేస్తూ ఇప్పుడు పరీక్షా సమయం, యాసంగి కాలం అని పేర్కొనడం సరికాదన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు జీతాలు ఎక్కువ అని యాజమాన్యాలు పేర్కొనడం అన్యాయ మన్నారు. గుజరాత్లో ఉద్యోగుల జీతాలు ఇక్కడి కంటే అధికమని పేర్కొన్నారు. 23 వేల మంది ఆర్టీజన్లు తక్కువ వేతనాలతో శ్రమ దోపిడీకి గురవుతున్నారని, వారికికూడా న్యా యం చేయాలన్నారు. గతేడాది ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులు, ఆ ర్టీజన్లు, పెన్షనర్లకు మెరుగైన పీఆర్సీ వర్తింపజేయాలని, ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ సదుపాయం, ఆ ర్టీజన్ల సమస్యలను పరిష్క రించాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో 17 నుంచి సమ్మె తథ్యమన్నారు. సమ్మెతో వినియోగదారులు, రైతులు, పరిశ్రమలకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందన్నారు. -
వారంలోగా విద్యుత్ ఉద్యోగులకు పీఆర్సీ
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్‌తో మాట్లాడి వారంరోజుల్లో విద్యుత్ ఉద్యోగులకు వేతన సవరణపై ప్రకటన చేస్తామని విద్యుత్ శాఖమంత్రి జగదీశ్‌రెడ్డి హామీ ఇచ్చారు. విద్యుత్ ఉద్యోగ సంఘాలన్నీ కలిసి సోమవారం ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీతో చర్చించి ఓ ఫిట్మెంట్ శాతాన్ని నిర్ణయించుకోవాలని సూచించారు. అనంతరం ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు సమర్పించే నివేదికపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. తెలంగాణ విద్యుత్ జేఏసీ నేతలు శనివారం జగదీశ్‌రెడ్డిని మింట్ కాంపౌండ్‌లోని ఆయన కార్యాలయంలో కలిసి పీఆర్సీ ప్రకటించాలని వినతిపత్రం అందజేశారు. ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. విద్యుత్ వేతన సవరణ సంప్రదింపుల కమిటీ విద్యుత్ ఉద్యోగులకు 5 శాతం, ఆర్టిజన్లకు 10 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని సిఫారసు చేయగా, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు జేఏసీ నేతలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంచి ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక జాప్యం చేయకుండా వారంలో పీఆర్సీ ప్రకటిస్తామని, ఆందోళనలు విరమించుకోవాలని జగదీశ్‌రెడ్డి వారికి సూచించారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ కె.ప్రకాశ్, కన్వీనర్ శివాజీ, వైస్‌చైర్మన్ అంజయ్య, జేఏసీ నేతలు నాసర్ షరీఫ్ పాల్గొన్నారు. -
31లోగా ‘వేతన’ ప్రకటన చేయాలి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణపై ఈ నెల 31లోగా ప్రకటన చేయాలని, లేనిపక్షంలో వచ్చే నెల 2 నుంచి ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటించింది. ఫిబ్రవరి 1న నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తామని, 2న విద్యుత్ సౌధ ముట్టడి, మహాధర్నా నిర్వహిస్తామని వెల్లడించింది. జేఏసీ నేతలు మంగళవారం విద్యుత్ సౌధలో తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావును కలిసి వినతిపత్రం అందజేశారు. అమల్లో ఉన్న విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ గడువు గతేడాది మార్చి 31తో ముగిసిపోగా, అదే ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయాల్సి ఉందని నేతలు జి.సాయి బాబు, రత్నాకర్‌రావు, శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త పీఆర్సీపై గతేడాది మే 30న సంప్రదింపుల కమిటీని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఏర్పాటు చేసినా, ఇప్పటి వరకు పీఆర్సీపై ప్రకటన చేయలేదన్నారు. 1999, అక్టోబర్ 2 నుంచి 2004, ఆగస్టు 31 మధ్యకాలంలో నియమితులైన విద్యుత్ ఉద్యోగులకు ఈపీఎఫ్‌కి బదులు జీపీఎఫ్‌ను అమలు చేయాలన్నారు. -
17 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఆ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దాదాపు పదిహేడేళ్ల తరువాత ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ జెన్కోతో పాటు ఏపీ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లలోని ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరో సంస్థకు బదిలీ అయ్యే వెసులుబాటు కల్పించింది. 2005లో ఈ తరహా బదిలీలపై బ్యాన్ విధించడంతో ఇన్నాళ్లూ ఏ సంస్థ పరిధిలోని వారు ఆ సంస్థ పరిధిలోనే బదిలీ అవుతున్నారు. అంటే ఏపీఈపీడీసీఎల్ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగి ఆ సంస్థ పరిధిలోని జిల్లాల్లోనే బదిలీ అవుతారు. తాజా వెసులుబాటుతో ఆ సంస్థ ఉద్యోగి ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని జిల్లాలకు బదిలీని కోరవచ్చు. ఈ బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఏపీ ట్రాన్స్‌కో హెచ్ఆర్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్‌గా ఓ కమిటీని నియమిస్తూ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తాజాగా ఉత్తర్వులిచ్చారు. ఈ నెల 12లోగా సిబ్బంది తమ బదిలీ అభ్యర్థన దరఖాస్తులను హెచ్ఆర్ కమిటీకి అందించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం దరఖాస్తు ప్రతిపాదనలను పరిశీలించిన తరువాత కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది. అనంతరం ఉద్యోగుల బదిలీలు జరుగుతాయి. చదవండి: (అది వారాహి కాదు.. నారాహి: మంత్రి రోజా సెటైర్లు) -
విద్యుత్ సంస్థల్లో 250 మందికి రివర్షన్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో 172 మంది ఇంజనీర్లతో పాటు మొత్తం 250 మంది ఉద్యోగులకు రివర్షన్లు ఇవ్వనున్నట్లు తెలిసింది. విద్యుత్ ఉద్యోగుల విభజన కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలపై తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ యాజమాన్యాలు వారం రోజులుగా చేస్తున్న కసరత్తు చివరి దశకు చేరుకుంది. ఒకటì , రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నట్టు సమాచారం. నెలాఖరులో సుప్రీంకోర్టులో విచారణ.. విద్యుత్ ఉద్యోగుల విభజన కేసు విషయంలో తమ ఆదేశాలను అమలు చేయనందుకుగాను విద్యుత్ సంస్థల యాజమాన్యాలపై ఇప్పటికే సుప్రీంకోర్టు కన్నెర్ర చేసింది. తమ ఆదేశాలను అమలు చేసి ఆ మేరకు అఫిడవిట్‌ను సమర్పించాలని, నెలాఖరులోగా మళ్లీ విచారణ నిర్వహిస్తామని.. కోర్టు ధిక్కరణ కేసు విచారణ సందర్భంగా ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన పదోన్నతులు, వేతన బకాయిలను చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగుల విభజనలో భాగంగా ఏపీ నుంచి దాదాపు 700 మందిని జస్టిస్ ధర్మాధికారి కమిటీ తెలంగాణ విద్యుత్ సంస్థలకు కేటాయించింది. తెలంగాణ ఏర్పాటుకు ముందు 2014 జూన్ 1 నాటికి ఉన్న సీనియారిటీ జాబితాల ఆధారంగా కొత్తగా పదోన్నతులు కల్పించాలని ధర్మాధికారి కమిటీ సిఫారసు చేసింది. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదోన్నతులు పొందిన తెలంగాణ ఉద్యోగుల్లో 250 మంది రివర్షన్లు పొందనున్నట్టు సమాచారం. ఏపీ నుంచి వచ్చిన ఉద్యోగుల్లో అధిక శాతం సీనియర్లు ఉండటంతో వారికి పదోన్నతులు లభించనున్నాయి. రివర్షన్లు ఇస్తే ఒప్పుకోం.. తెలంగాణ ఉద్యోగులకు రివర్షన్లు ఇస్తే అంగీకరించమని ఇప్పటికే తెలంగాణ విద్యుత్ ఇంజనీర్లు, ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం విద్యుత్ సౌధలో మధ్యాహ్న భోజన విరామంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఉద్యోగులకు నష్టం కలగకుండా సూపర్‌న్యూమరరీ పోస్టులను సృష్టించాలని వారు డిమాండ్ చేశారు. -
‘విద్యుత్’ను ప్రైవేటీకరిస్తే భవిష్యత్తు అంధకారమే..
సాక్షి, హైదరాబాద్: పేదలకు, వృత్తిదారులకు, రైతు సంక్షేమానికి విఘాతంగా మారిన విద్యుత్ సవరణ బిల్లు–2022ను తక్షణమే ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే యోచనను విరమించుకోవాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీఎస్పీఈ జేఏసీ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యుత్ ఉద్యోగులు ఎంతో కష్టపడి తయారు చేసుకున్న డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను అంబాని, అదానీలకు కట్టబెట్టడం దారుణమని విమర్శించింది. విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం ఇక్కడ ఖైరతాబాద్ ఇంజనీర్స్ భవన్లో విద్యుత్ ఉద్యోగుల రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. అంతకు ముందు మింట్ కాంపౌండ్ నుంచి ఎన్టీఆర్మార్గ్ మీదుగా ఇంజనీర్లు ప్లకార్డులు చేతబట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రణా ళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ జాతీయ చైర్మన్ శైలేంద్ర దూబే మాట్లాడుతూ స్టాడింగ్ కమిటీ ఆమోదం లేకుండా విద్యుత్ సవరణ బిల్లును దొడ్డిదారిలో పార్లమెంట్లో పెట్టి ఆమోదం పొందేందుకు కేంద్రం యత్నిస్తోందని ఆరోపించారు. ఈ బిల్లును అడ్డుకునేందు కు పోరాటాన్ని తీవ్రతరం చేయాల్సి ఉందని, అవసరమైతే ప్రజాప్రతినిధుల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేసి నిరసన తెలపాలని సూచించారు. విద్యుత్‌ప్రైవేటీకరణతో భవిష్యత్తులో పేదల జీవితాల్లో చీకట్లు తప్పవని హెచ్చరించారు. విద్యుత్ సంస్థలు, బొగ్గు గనుల ప్రైవేటీకరణను నిరసిస్తూ నవంబర్ 23న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వ హిస్తున్నట్లు తెలి పారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని వినోద్ చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామిక విలువలను కాలరాస్తోందని కార్యక్రమంలో ఉద్యోగుల జేఏసీ చైర్మన్ సాయిబాబు, ఆల్ ఇండియా కిసాన్ సభ ప్రతినిధులు సాగర్, మోహన్‌శర్మ, జేఏసీ కన్వీనర్ రత్నాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యమైన సేవల కోసం.. పనివేళల్లో సెల్‌ఫోన్ కట్!
సాక్షి, అమరావతి: విద్యుత్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు అదేపనిగా సెల్ఫోన్లు ఉపయోగిస్తూ పని గంటలు వృథా చేస్తున్నారని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మాజనార్ధనరెడ్డికి పలువురు ఉన్నతాధికారులు, వినియోగదారులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీఎండీ.. కార్యాలయాల పని వేళల్లో సెల్ఫోన్లు వాడొద్దంటూ ఉద్యోగులకు మెమో జారీ చేశారు. ఉల్లంఘిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంతో పాటు జిల్లా స్థాయిలో ఆపరేషన్ సర్కిల్ కార్యాలయాల్లోనూ ఇవే నిబంధనలు అమలయ్యేలా ఉత్తర్వులు జారీ చేయాలని సూపరింటెండెంట్ ఇంజినీర్లను ఆదేశించారు. ఇటీవల ఏపీసీపీడీసీఎల్ సీఎండీ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో ఆయన మాట్లాడిన అంశాలను.. వాయిస్ రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. దీనిపై సీఎండీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి చర్యలతో పాటు కార్యాలయాల పనివేళల్లో సెల్ఫోన్లను విపరీతంగా ఉపయోగించడం వల్ల సంస్థ పనితీరుకు, అంతర్గత భద్రతకు, గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదముందని సీఎండీ భావించారు. అక్టోబరు 1 నుంచి పనివేళల్లో సెల్‌ఫోన్ వాడకూడదనే నిబంధనను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ రోజు నుంచి ఉద్యోగులు కార్యాలయానికి రాగానే తమ ఫోన్లను సెక్యూరిటీ వద్ద డిపాజిట్ చేసి రసీదు తీసుకోవాలి. భోజన విరామ సమయంలో ఫోన్లు వాడుకునే అవకాశమిచ్చారు. అత్యవసరంగా మాట్లాడాల్సి వస్తే.. ఉన్నతాధికారి ఫోన్‌ను ఉపయోగించుకోవచ్చు. -
విద్యుత్ సవరణ బిల్లుపై ఉద్యోగుల నిరసన
సాక్షి, అమరావతి: లోక్‌సభలో సోమవారం ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ బిల్లు 2022ను ఏపీ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ వ్యతిరేకించింది. బిల్లులు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపినప్పటికీ జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు సర్కిల్, డివిజన్ కార్యాలయాల్లో నిరసనలకు దిగారు. విజయవాడలోని విద్యుత్ సౌధలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగులు కార్యాలయం బయటకు వచ్చి ధర్నా చేపట్టారు. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ను జేఏసీ చైర్మన్ పి.చంద్ర శేఖర్, జనరల్ సెక్రటరీ పి.ప్రతాపరెడ్డి, కన్వీనర్ బి.సాయికృష్ణ తదితరులు కలిసి బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. కేంద్రం ఈ విషయంలో ముందుకు వెళితే తక్షణమే ఆందోళనలకు దిగేలా కార్యాచరణ రూపొందించినట్టు వెల్లడించారు. ఆందోళనకు ఇదీ కారణం ప్రైవేటు విద్యుత్ పంపిణీ సంస్థలకు లైసెన్స్ విధానాన్ని సులభతరం చేయడం ఈ బిల్లు ప్రధాన లక్ష్యమని చెబుతున్నప్పటికీ, విద్యుత్ రంగం ప్రైవేటీకరణను అనుమతించడం వల్ల వినియోగదారులపై ధరల భారం పడే అవకాశం ఉందని, ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కరువవుతుందని జేఏసీ అభిప్రాయం పడింది. బిల్లు ఆమోదం పొందితే టెలిఫోన్, మొబైల్, ఇంటర్నెట్ సేవల కోసం వినియోగదారులు తమకు నచ్చిన నెట్‌వర్క్‌ను ఎంచుకుంటున్న విధంగా విద్యుత్ సరఫరాదారుని కూడా ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఒకే ప్రాంతంలో పలు కంపెనీలకు విద్యుత్ పంపిణీ లైసెన్సులివ్వాల్సి వస్తే వాటి కోసం ’క్రాస్ సబ్సిడీ నిధి’ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వస్తుంది. డిపాజిట్ సొమ్మును ముందుగా చెల్లించకపోతే డిస్కంలు కోరినంత విద్యుత్‌ను ‘జాతీయ లోడ్ డిస్పాచ్ కేంద్రం’(ఎన్ఎల్డీసీ) సరఫరా చేయదు. -
TS: ఉద్యోగుల ధర్నా.. ఏ క్షణంలోనైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం
సాక్షి, హైదరాబాద్: కేంద్రం పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న విద్యుత్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ అండ్ ఇంజినీరింగ్ జేఏసీ దేశ వ్యాప్త విధుల బహిష్కరణ పిలుపు మేరకు.. ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా విధులు బహిష్కరించిన విద్యుత్ ఉద్యోగులు నల్లరంగు చొక్కాలు ధరించి మహా ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. నూతన విద్యుత్ బిల్లు ద్వారా విద్యుత్‌శాఖ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మారుతుందని విద్యుత్ ఉద్యోగులు విమర్శించారు. గతంలో తీసుకొచ్చిన చట్టాన్నే కాస్తా మార్చి కేంద్రం తప్పుదోవ పట్టిస్తుందని మండిపడ్డారు. ఈ బిల్లు ద్వారా వినియోగదారులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు. కార్యరూపం దాలిస్తే దేశవ్యాప్తంగా ప్రభుత్వ విద్యుత్ రంగం ధ్వంసం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ చట్టసవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేపట్టారు. చట్టసవరణ బిల్లు ప్రవేశ పెడితే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగుల ఆందోళనతో తెలంగాణలో ఏ క్షణంలోనైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. విద్యుత్ సరఫరా నిలిచిపోతే పునరుద్ధరణ కష్టమేనని విద్యుత్ ఉద్యోగులు చెబుతున్నారు. ఎవరు విధుల్లో ఉండరని ప్రకటించిన ఉద్యోగులు.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటే ప్రజలు సహకరించాలని కోరారు. చదవండి: Telangana: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ప్రారంభించిన సీఎం కేసీఆర్ -
దక్షిణ డిస్కంలో బదిలీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగుల బదిలీలకు తెరలేచింది. సబ్ ఇంజనీర్లతో పాటు అకౌంట్స్ విభాగంలో జేఏఓల కేడర్ వరకు, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగాల ఉద్యోగుల బదిలీకి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ గురువారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నెల 30 నాటికి మూడేళ్లు, అంతకుమించి ఎక్కువ కాలం పాటు ఒకేచోట పనిచేసే వారిని బదిలీ చేయనున్నారు. సీని యారిటీ ప్రాతిపదికగా మొత్తం ఉద్యోగుల్లో 40% మందికి మించకుండా బదిలీలు చేపట్టనున్నారు. ఆర్టిజన్లకు సైతం స్థానచలనం కల్పించనున్నట్లు పేర్కొంది. బదిలీకానున్న వారి జాబితాను ఈనెల 13న డివిజనల్/సర్కిల్ కార్యాలయాలకు అందజేయనున్నారు. జాబితాపై 17 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారని, విజ్ఞప్తులుంటే 21లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. పరస్పర బదిలీలకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొంది. ఈ నెల 28లోగా బదిలీలపై ఉత్తర్వులు జారీ కానుండగా.. బదిలీ అయిన ఉద్యోగులు 30న రిలీవ్ కావాలని సంస్థ ఆదేశించింది. -
విద్యుత్ ఉద్యోగులకు నగదురహిత వైద్యం
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత అపరిమిత వైద్యం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలతో బుధవారం వారు సమావేశమయ్యారు. విద్యుత్ సంస్థల్లో కారుణ్య నియామకాలు వెంటనే చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. గత నెల 28న విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ 24 డిమాండ్లతో ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. అందులోని అంశాలను జేఏసీ నేతలు మరోసారి బాలినేని, సజ్జల దృష్టికి తెచ్చారు. కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ప్రైవేటు నిర్వహణకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. దీనిపై బాలినేని, సజ్జల స్పందిస్తూ ఉద్యోగులకు నష్టం జరుగుతుందనుకుంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. దశలవారీగా పరిష్కారం... విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీ బాధ్యతలను తమ సంస్థలకు చెందిన ఉన్నతాధికారులకే కేటాయించాలని కోరగా సమీక్షించి ఉద్యోగులకు నష్టం కలగకుండా చూస్తామని బాలినేని, సజ్జల తెలిపారు. జేఏసీ విజ్ఞప్తి మేరకు సర్వీస్ రెగ్యులేషన్స్‌ను ప్రస్తుతానికి నిలుపుదల చేయాలని అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టు కార్మికులకు నేరుగా జీతాలిచ్చే అంశాన్ని పరిశీలిస్తామని, అన్ని సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్, ఏపీజెన్కో ఎండీ బి.శ్రీధర్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు, జేఏసీ యూనియన్ల నాయకులు చంద్రశేఖర్, ప్రతాప్‌రెడ్డి, సాయికృష్ణ చర్చల్లో పాల్గొన్నారు. అంతకు ముందు వైఎస్సార్ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ నేతలు బాలినేని, సజ్జల, ఇంధన శాఖ కార్యదర్శి, డిస్కంల సీఎండీలతో ప్రత్యేకంగా సమావేశమై ఇవే అంశాలపై చర్చించారు. అన్నింటిపై ప్రభుత్వం నుంచి సానుకూల హామీ లభించిందని వెల్లడించారు. -
AP: విద్యుత్ ఉద్యోగులకు త్వరలో శుభవార్త
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగులు డీఏ విషయంలో త్వరలోనే శుభవార్త వింటారని ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) ద్వితీయ వార్షికోత్సవం, విద్యుత్ సంస్థల నూతన సంవత్సర డైరీలు, క్యాలెండర్లను విజయవాడలో మంగళవారం మంత్రి ఆవిష్కరించారు. 13 జిల్లాల నుంచి ఏపీ ట్రాన్స్‌కో, జెన్కో, మూడు డిస్కంలు, నెడ్‌క్యాప్, ఏపీఎస్ఈసీఎం, ఏపీసీడ్కో విభాగాల ఉద్యోగులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి బాలినేని ప్రసంగిస్తూ..పే రివిజన్ కమిటీతో జీతాలు తగ్గుతా యని సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను ఉద్యోగులెవరూ పట్టించుకోవలసిన అవసరం లే దని స్పష్టం చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఇ బ్బందులను పరిగణనలోకి తీసుకుని వారికి న్యాయం జరిగేలా సానుకూల నిర్ణయం తీసుకుంటా మని మంత్రి భరోసా ఇచ్చారు. చదవండి: (పోలీసుల అదుపులో స్మగ్లర్ చంద్రబాబు?) బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ను చవకగా కొనుగోలు చేసి రూ.2,500 కోట్లు ఆదా చేయగలిగిన విద్యుత్ రంగాన్ని క్షేత్రస్థాయి నుంచి పటిష్టపర్చడంలో భా గంగా రికార్డు స్థాయిలో ఒకేసారి సుమారు 7,329 మంది లైన్ మెన్లను, 213 మంది అసిస్టెంట్ ఇంజనీర్లను నియమించామన్నారు. ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ..ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి రెండేళ్లలో రూ.28,166 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. సీఎండీ జె పద్మజనార్ధన రెడ్డి, ఏపీ జెన్కో ఎండీ బి. శ్రీధర్, జేఎండీలు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
బిల్లు తెస్తే.. సమ్మె తప్పదు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సవరణ బిల్లు 2021ను పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని చూస్తే.. ఆ మరుక్షణం నుంచే దేశవ్యాప్త సమ్మెకు వెనుకాడబోమని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యచరణ కమిటీ హెచ్చరించింది. జాతీయ విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల సమన్వయ కమిటీ పిలుపు మేరకు బుధవారం మింట్ కాంపౌండ్‌లోని తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రధాన కార్యాలయం ముందు తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల జాయింట్ యాక్షన్ కమిటీ(టీఎస్పీఈజేఏసీ) ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అలాగే తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీఈ ఈజేఏసీ) ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని విద్యుత్‌సౌధ ఆవరణలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా టీఎస్పీఈజేఏసీ ప్రతినిధులు రత్నాకర్‌రావు, సదానందం, టీఈఈజేఏసీ కన్వీనర్ ఎన్.శివాజీ, కో చైర్మన్ పి.అంజయ్య మాట్లాడుతూ... రైతులు, పేదలకు నష్టదాయకంగా ఉన్న ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలా కాదని బిల్లు తీసుకొస్తే.. ఆ తర్వాత జరుగబోయే పరిణామాలకు కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం సహా ఉద్యోగులు ఏళ్ల తరబడి ఎంతో కష్టపడి ఏర్పాటు చేసుకున్న విద్యుత్ లైన్లు, ఉపకేంద్రాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం అన్యాయమన్నారు. విద్యుత్ ఉత్పత్తిలో ప్రధానమైన బొగ్గు, ఇంధనం, రవాణా తదితర రంగాలను తన గుప్పిట్లో పెట్టుకున్న కేంద్రం.. నష్టాల పేరుతో డిస్ట్రిబ్యూషన్ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కార్పొరేట్ సంస్థల ప్రయోజనం కోసమే డిస్కంల ప్రైవేటీకరణ అంశాన్ని ముందుకు తెచ్చిం దని వివరించారు. -
విద్యుత్ బిల్లు తెస్తే మెరుపు సమ్మె
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చట్ట సవరణ బిల్లు–2021ను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెడితే దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు ఒక రోజు విధులు బహిష్కరించి మెరుపు సమ్మె నిర్వహిస్తారని విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల జాతీయ సమన్వయ కమిటీ హెచ్చరించింది. విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తూ ఈ నెల 8న రాష్ట్రాలు, జిల్లాల స్థాయిల్లో నిరసనలకు కమిటీ పిలుపునిచ్చింది. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద 15న భారీ ధర్నాకు జాతీయ సమన్వయ కమిటీ సన్నాహాలు చేస్తోంది. వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలి రోజైన 2022 ఫిబ్రవరి 1న దేశవ్యాప్తంగా విధులను బహిష్కరించి మెరుపు సమ్మెకు దిగాలని కమిటీ పిలుపునిచ్చింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు మెరుపు సమ్మెకు దిగితే నిరంతర విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి గ్రిడ్ కుప్పకూలి దేశమంతా అంధకారం నెలకొనే ప్రమాదం ఉంది. ప్రైవేటీకరణతో మాకు నష్టమే: ఉద్యోగులు విద్యుత్ పంపిణీ ప్రైవేటీకరణకు రాచమార్గం వేసేందుకు కేంద్రం తీసుకొస్తున్న విద్యుత్ బిల్లుతో తమ ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని దేశవ్యాప్తంగా పనిచేస్తున్న లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే తీవ్ర ఆర్థిక నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు విద్యుత్ చార్జీలు, సరఫరా, నాణ్యతలో ప్రైవేటు కంపెనీలతో పోటీపడలేవని, ఇదే జరిగితే ప్రభుత్వరంగ డిస్కంలు మరింత నష్టాల్లో కూరుకుపోయి మూతపడే ప్రమాదముందని అంటున్నారు. ఫలితంగా లక్షల మంది విద్యుత్ ఉద్యోగులు రోడ్డునపడతారని విద్యుత్ ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఈ బిల్లు ద్వారా కేంద్రం తమ హక్కుల ను హరించేందుకు ప్రయత్నిస్తోందని చాలా రాష్ట్రా లు వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతోంది. విద్యుత్ రంగ ప్రైవేటీకరణతో పెద్ద సంఖ్యలో కొత్త ఉద్యోగావకాశాలు పుట్టుకొస్తాయని చెబుతోంది. ఈ విషయమై విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్రాల్లో గతంలో నిర్వహించిన అభిప్రాయ సేకరణ సమావేశాల్లో తెలిపింది. -
విద్యుత్ సవరణ చట్టాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలి
కృష్ణలంక (విజయవాడ తూర్పు): విద్యుత్ సవరణ చట్టం–2021ను ఉపసంహరించుకోవాలని, కాంట్రాక్టు కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని విద్యుత్ ఉద్యోగుల జాతీయ కో–ఆర్డినేషన్ కమిటీ జాతీయ కన్వీనర్ ప్రశాంత్‌చౌదరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడ గవర్నర్‌పేటలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఆదివారం విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికుల రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథి ప్రశాంత్‌చౌదరి మాట్లాడుతూ విద్యుత్ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించే ముందు రాష్ట్ర ప్రభుత్వాలు, ఉద్యోగ సంఘాలను సంప్రదించలేదన్నారు. అయితే ఫైనాన్స్ అడ్వైజరీ, ఫిక్కీ తదితర సంస్థ ప్రతినిధులు వంటి పెట్టుబడిదారుల ప్రతినిధులను సంప్రదించడం దారుణమన్నారు. సమాఖ్య స్ఫూర్తికి విద్యుత్ చట్ట సవరణ బిల్లు వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. ఇప్పుడున్న విద్యుత్ మీటర్ల స్థానంలో స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు ఏర్పాటు చేయాలని కేంద్రం ఒత్తిడి చేస్తోందని, అదే జరిగితే.. వినియోగదారులపై రూ.4 వేల అదనపు భారంతో పాటు, రీచార్జ్ చేయకుంటే వెంటనే విద్యుత్ ఆగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటీకరణ వలన వచ్చే నష్టాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పోరాటాలకు సన్నద్ధం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్య, వైద్యం, విద్యుత్ రంగాలపై రాష్ట్రాల హక్కులను కేంద్రం హరించివేస్తోందన్నారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
బిల్లుతో తీవ్ర నష్టం: కేంద్ర ప్రభుత్వంపై కరెంటోళ్ల కన్నెర్ర
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ సోమవారం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. విద్యుత్ సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం వెనకకు తగ్గకపోతే ఆందోలనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆగస్టు10వ తేదీన మెరుపు సమ్మెకు విద్యుత్ సంఘాలు పిలుపునిచ్చాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమవడంతో విద్యుత్ ఉద్యోగులు నిరసనలు చేపట్టారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ విద్యుత్ ఉద్యోగులు ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లో ఉన్న విద్యుత్ ప్రధాన కార్యాలయం ఎదుట ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఈ బిల్లుతో దేశ ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సవరణ బిల్లుపై పోరాటం సాగిస్తామని తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు తెలిపారు. -
వదంతులు నమ్మవద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థల ఉద్యోగుల వేతనాలు తగ్గించే ఆలోచన చేయడం లేదని, ఈ ప్రచారం వదంతులేనని విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ వదంతులతో ఉద్యోగులు అభద్రతకు లోనుకావద్దని కోరారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేయడం లేదన్నారు. ఖరీఫ్ నుంచి వందశాతం ఫీడర్ల ద్వారా పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్టు ప్రకటించారు. ఆయన సోమవారం విద్యుత్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల స్నేహపూర్వక వాతావరణాన్నే ఆకాంక్షిస్తోందని, వారికి నష్టం చేసే ఏ ఆలోచన చేయబోదని భరోసా ఇచ్చారు. 2018లో సవరించిన వేతనాలే 2022 వరకు కొనసాగుతాయని, ఈ విషయాన్ని వారికీ స్పష్టం చేశామని చెప్పారు. ప్రభుత్వం విద్యుత్ సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. రెండు నెలల్లో అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియను పూర్తిచేయాలనే సంకల్పంతో ఉన్నట్లు తెలిపారు. రైతు కోసం ఎంతైనా ఖర్చు రైతు పక్షపాతి అయిన సీఎం వైఎస్ జగన్ ఉచిత విద్యుత్ కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఒక్క అనంతపురంలో మాత్రం రైతుల కోరిక మేరకు రాత్రిపూట విద్యుత్ అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం 55 శాతం ఫీడర్లే 9 గంటల పగటి విద్యుత్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. దీంతో అప్పటికప్పుడే రూ.1,700 కోట్లు మంజూరు చేసి సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లను బలోపేతం చేసినట్లు చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని, రూ.80 వేల కోట్ల అప్పుల్లోకి నెట్టిందని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ మునుపెన్నడూ లేని విధంగా రెండేళ్లలోనే రూ.18 వేల కోట్ల చేయూతతో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు అడుగులేశారని చెప్పారు. ప్రైవేటీకరణ యోచన లేదు విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించే దిశగా ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేయడంలేదని చెప్పారు. కేంద్రం ఒత్తిడికి తలొగ్గిన దాఖలాలు లేనేలేవన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా పంపుసెట్లకు మీటర్లు బిగించి, కచ్చితమైన విద్యుత్ వినియోగాన్ని లెక్కగట్టామని, ఒక్క రైతుపైనా పైసా భారం మోపలేదని చెప్పారు. రైతు ఖాతాల్లోకే వ్యవసాయ విద్యుత్ సబ్సిడీని వేశామని, దీనివల్ల నాణ్యమైన విద్యుత్ అందించే దిశగా డిస్కమ్‌ల్లో జవాబుదారీతనం పెరిగిందని పేర్కొన్నారు. వ్యవసాయ సబ్సిడీ ప్రత్యక్ష నగదు బదిలీ పథకాన్ని త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామన్నారు. జగనన్న కాలనీల్లో నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. -
విద్యుత్ ఉద్యోగుల ఆందోళన విరమణ
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో కొంతకాలంగా చేస్తున్న ఆందోళనను విరమిస్తున్నట్టు విద్యుత్ ఉద్యోగ సంఘాల ఐక్య కార్యాచరణ (జేఏసీ) ప్రకటించింది. సంఘాల నేతలతో విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మంగళవారం చర్చలు జరిపారు. వారు లేవనెత్తిన ప్రతీ డిమాండ్‌పైనా సానుకూలంగా స్పందించారు. దీంతో సమ్మె విరమిస్తూ జేఏసీ నేతలు మంత్రి సమక్షంలో లిఖిత పూర్వకంగా తెలిపారు. జేఏసీ డిమాండ్లపై ప్రభుత్వ సానుకూల అంశాలను అధికారులు వెల్లడించారు. ► విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 30 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు విద్యుత్ సంస్థలే నేరుగా వేతనాలు చెల్లించేందుకు గల అవకాశాలను అధ్యయనం చేయనున్నారు. ఇందుకు ఈఆర్‌పీడీసీ సీఎండీ, ట్రాన్స్‌కో జేఎండీ నేతృత్వంలో వేయనున్న కమిటీ 60 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ► 1999–2004 మధ్య నియమించిన విద్యుత్ ఉద్యోగులకు పెన్షన్‌ను సమీక్షించి, ప్రభుత్వానికి 30 రోజుల్లో నివేదిక ఇవ్వనున్నారు. పెండింగ్ డీఏలను ఫ్రీజింగ్ ఆర్డర్స్ తొలగిన తర్వాత చెల్లిస్తారు. నగదు రహిత వైద్యసేవల విషయంలో ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ముందుకెళ్తారు. ► రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఏపీ జెన్కో పీపీఏ నిబంధనలకు అనుగుణంగా విద్యుత్ తీసుకుంటుంది. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ ప్రతిపాదనేదీ లేదని చర్చల సందర్భంగా ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: బాలినేని ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు 2019–20లో రూ.17,904 కోట్లు, బిల్లుల చెల్లింపునకు రూ.20,384 కోట్లు ఇచ్చిందని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. రూ.30 వేల కోట్లకుపైగా నష్టాల్లో ఉన్న సంస్థలను ప్రైవేటీకరించకుండా ఆపిన ఘనత ఈ ప్రభుత్వానిదేనన్నారు. విద్యుత్ రంగం పటిష్టానికి 7 వేల మంది లైన్మెన్లను, 172 మంది ఏఈలను నియమించామని తెలిపారు. ప్రైవేటీకరణ ఆలోచన లేదు కాబట్టే ఇవన్నీ చేశామని మంత్రి విద్యుత్ ఉద్యోగులకు స్పష్టం చేశారు. ఆందోళన సందర్భంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలన్న జేఏసీ డిమాండ్‌పైనా మంత్రి సానుకూలంగా స్పందించారు. ► చర్చల్లో ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి, ట్రాన్స్‌కో జేఎండీలు శ్రీధర్ రెడ్డి, వెంకటేశ్వరరావు, సీపీడీసీఎల్ సీఎండీ పద్మా జనార్దన్ రెడ్డి, జేఏసీ నేతలు పి.చంద్రశేఖర్, ఎం.వాసుదేవరావు, సాయికృష్ణ, ఓసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం దృష్టికి విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లు
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగుల డిమాండ్లన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. వారి డిమాండ్లను ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్–19 కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో అందరికీ తెలుసని, ఇలాంటి సమయంలో సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 1999 నుంచి 2004 వరకూ ఉద్యోగాల్లో చేరిన వారికి పెన్షన్ ఇవ్వాలన్న ప్రధాన డిమాండ్ నెరవేర్చేందుకు దాదాపు రూ.2 వేల కోట్లు ఖర్చవుతుందన్నారు. డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి గత నెల 28న యాజమాన్యానికి నోటీసు ఇచ్చి.. ఈ నెల 19 నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టింది. కచ్చితమైన హామీ ఇవ్వాలి వర్షాలు, కోవిడ్–19 కారణంగా ఆందోళన విరమించాలన్న ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ విజ్ఞప్తిపై విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేత చంద్రశేఖర్ స్పందించారు. కనీసం వారం రోజుల ముందైనా ఈ విజ్ఞప్తి చేసి ఉంటే పునరాలోచించుకునే వీలుండేదన్నారు. ఆందోళనకు వెళ్తున్న సమయంలో ఎలా ఆపగలమని ఓ ప్రకటనలో ప్రశ్నించారు. కచ్చితమైన హామీ ఇస్తే ఉద్యోగుల్లో నమ్మకం పెరుగుతుందన్నారు. -
‘శ్రీశైలం’ బాధితులకు రూ.కోటి సాయం
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలంలోని తెలంగాణ ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు మొత్తం రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని నిర్ణయించినట్లు తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ప్రకటించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డీఈ కుటుంబానికి రూ.50 లక్షలు, మిగతా ఉద్యోగులకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. దీనికి అదనంగా ఒక్కో కుటుంబానికి రూ.75 లక్షల చొప్పున జెన్కో సాయం అందిస్తుందని తెలిపారు. దీంతో డీఈ కుటుంబానికి మొత్తం రూ.1.25 కోట్లు, ఇతర ఉద్యోగుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందుతుందని ప్రభాకర్‌రావు వెల్లడించారు. అలాగే మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి విద్యుత్ సంస్థల్లో ఉద్యోగమివ్వాలని నిర్ణయించామని తెలిపారు. విద్యార్హతలను బట్టి డీఈ, ఏఈల కుటుంబాలకు ఏఈ/పర్సనల్ ఆఫీసర్ ఉద్యోగాలు, ఇతరులకు జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్ ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఇతర శాఖాపరమైన సాయం కూడా త్వరితగతిన అందించనున్నట్లు వెల్లడించారు. ప్రభాకర్‌రావు అధ్యక్షతన శనివారం విద్యుత్ సౌధలో జెన్కో బోర్డు సమావేశమై ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకుంది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా పాల్గొన్నారు. శ్రీశైలం ప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునే విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. ‘ప్రమాదంలో మన తోటి ఉద్యోగులు మరణించడం అత్యంత దురదృష్టకరమైన విషయం. మరణించిన వారిది గొప్ప సాహసం, త్యాగం. వారిని మళ్లీ తీసుకురాలేం. కానీ మానవ మాత్రులుగా సాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ ఘట నను ప్రత్యేక అంశంగా పరిగణించి ప్రభుత్వ సాయంతో పాటు జెన్కో తరఫున అదనపు సాయం అందించాలని భావిస్తున్నాం’అని ప్రభాకర్ రావు సమావేశంలో ప్రకటించగా, బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించింది. విద్యుదుత్పత్తి పునఃప్రారంభానికి కమిటీ.. ప్రమాదానికి గురైన శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో తిరిగి ఉత్పత్తి ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి ముగ్గురు సభ్యుల కమిటీని ప్రభాకర్‌రావు నియమించారు. జెన్కో హైడల్, సివిల్ డైరెక్టర్లు, శ్రీశైలం ప్రాజెక్టు సీఈలు ఇందులో సభ్యులుగా ఉంటారు. శ్రీశైలం ప్లాంటులో జరుగుతున్న పునరుద్ధరణ పనులను పర్యవేక్షించడంతో పాటు, అక్కడికక్కడే అవసరమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు. వీలైనంత త్వరగా ప్లాంటును పునరుద్ధరించే లక్ష్యంగా కమిటీ పనిచేస్తుంది.