ఏటేటా అదే తర‘గతి’!
వసతిలేని పాఠశాలల్లో విద్యార్థుల దుస్థితి
వరండాలు, చెట్ల నీడలోనే పాఠాలు
సదుపాయాల కల్పనపై అమలు కాని హామీలు
నక్కపల్లి, న్యూస్‌లైన్ : ఈ ఏడాది కూడా పాఠశాలల్లో వసతి సమస్య తప్పేటట్లు లేదు. మరో పది రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఈ ఏడాది కూడా విద్యార్థులు నేలపైన చెట్ల కింద, శిథిల భవనాల్లోను చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడనుంది. ప్రతిఏటా పాఠశాలలు పునఃప్రారంభం అయ్యేనాటికి మౌలిక సదుపాయాలు కల్పిస్తామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ఉత్త హామీలుగానే మిగిలిపోతున్నాయి. నక్కపల్లి మండలంలో ఎలిమెంటరీ పాఠశాలలే కాదు, జడ్పి ఉన్నత పాఠశాలల్లో కూడా వసతి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి.
పదోతరగతి విద్యార్థులు కూడా నేలపైనే కూర్చొవాల్సిన పరిస్థితి ఉంది. మండలంలో ఎలిమెంటరీ, యూపి, జడ్పి పాఠశాలలు కలిపి 72 ఉన్నాయి. వీటిలో తొమ్మిది జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. జడ్పి పాఠశాలల్లో గొడిచర్ల మినహా మిగతా పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా గదులు, బెంచీలు లేవు. నక్కపల్లిలో ఉన్న బాలికల ఉన్నత పాఠశాలలో 8 నుంచి 10 తరగతుల వరకు చదివే బాలికలు నేలపైన, చెట్ల కింద కూర్చొని విద్య నభ్యసిస్తున్నారు.
నాలుగేళ్లనుంచి ఈ పాఠశాలలో ఇదే సమస్య ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఇక్కడ తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో కలిపి సుమారు 350 మంది విద్యార్థినులు ఉండగా కేవలం నాలుగు గదులు మాత్రమే ఉన్నాయి. వరండాల్లోను, ఒక గదిలో రెండు తరగతులు ఉంచి బోధిస్తున్నారు. వసతి సమస్య వల్ల పాఠశాల ప్రాంగణంలో చెట్లకింద కొన్ని తరగతులు ఏర్పాటు చేస్తున్నారు. నక్కపల్లి ప్రభుత్వ బాలుర పాఠశాలలో కూడా అదే పరిస్థితి.
ఇక్కడ పైకప్పులు సగం రాలిపడుతున్న భవనాల్లోనే విద్యార్థులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ చదువుకోవాల్సిన దుస్థితి ఉంది. ఇక్కడ కూడా అదనంగా మరో 8 గదులు ఉంటే తప్ప విద్యార్థుల వసతి సమస్య పూర్తిగా పరిష్కారం కాదు. ప్రతి ఏటా ఆర్వీఎం అధికారులకు స్థానిక ఉపాధ్యాయులు నివేదికలు పంపడం, సెలవుల్లో శిథిలమైన భవనాలను మరమ్మతులు చేయించడం, కొత్తవి నిర్మించడం చేస్తామని అధికారులు ప్రకటించడం షరా మామూలుగానే జరుగుతున్నాయి.
సెలవుల అనంతరం మళ్లీ ఇదే పరిస్థి తి తలెత్తుతోంది. పెదబోదిగల్లం, ఉద్దండపురం, వేంపాడు తదితర గ్రామాల్లో కూడా ఇవే సమస్యలు రాజ్యమేలుతున్నా అధికారుల్లో మాత్రం స్పందన శూన్యం. పాఠశాలల్లో సమస్యలు పరిష్కారమయ్యేదెప్పుడో, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అన్ని వసతులతో విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునేదెన్నడో అన్నది ప్రభుత్వానికే తెలియాలి. మండలంలో వసతి సమస్య ఉన్న పాఠశాలల్లో పరిష్కారానికి తీసుకున్న చర్యలు ఒక్కటి కూడా లేవు.