సంక్రాంతికి మూడుముక్కలాట
మూడుముక్కలాట అంటే ముందుగా గుర్తుకొచ్చేది జూదం. ఒక రకంగా సినిమా జూదం లాంటిదేనంటారు. ఇక్కడ శ్రమ ఒక్కటే మన చేతుల్లో ఉంటుంది. ఫలితం ప్రేక్షకుల తీర్పుపైనే. అలాంటి తీర్పు కోసం సంక్రాంతి రేస్ లోకి మూడు మాస్ మసాలా చిత్రాలు దిగు తున్నాయి. ఈ మూడు భారీ అంచనాలు నెలకొన్నవే. అందులో ఒకటి అజిత్ నటించిన ఎన్నై అరిందాల్. అజిత్ సరసన అనుష్క, త్రిష, పార్వతి నాయర్ నటించారు. గౌతమ్‌మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎఎం.రత్నం భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. మరో చిత్రం ఐ.
ఈ చిత్రంలో విక్రమ్‌తో ఎమిజాక్సన్ రొమాన్స్ చేశారు. దర్శకు డు శంకర్ అద్భుత సృష్టికి ఆస్కార్ ఫిలింస్ బ్రహ్మాండ నిర్మాణ విలువలకు అద్దం పట్టనుంది ఐ. రెహ్మాన్ సంగీతం అందించిన ఈ చిత్ర ట్రైలర్ సినీ ప్రియులను అబ్బురపరుస్తోంది. దీపావళికే విడుదల అవుతుందనుకున్నారు. అయితే నిర్మాణ కార్యక్రమాలు జాప్యం కారణంగా సంక్రాంతి రేస్‌కు సిద్ధమవుతోంది. హాలీవుడ్ చిత్రాలను మరిపించే విధంగా ఐ ఉంటుందనే భావన ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఇక మూడవ చిత్రం ఆంబళ. సుందర్.సి దర్శకత్వంలో విశాల్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రమిది.
హన్సిక హీరోయిన్. ఈ చిత్రంపైనా అంచనాలు తక్కువగా లేవు. అరణ్మణై వంటి విజయవంతమైన చిత్రం తర్వాత సుందర్.సి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇటీవల వరుసగా పాండియనాడు, నాన్ శిగప్పు మనిదన్, పూజై చిత్రాలు విజయాలతో హాట్రిక్ సాధించారు విశాల్. ఈ చిత్రంతో రెండవ హాట్రిక్కు శ్రీకారం చుడతాననే విశ్వాసంతో ఉన్నారు. మరో విషయం ఏమిటంటే ఆంబళ విడుదల తేదీని చిత్ర ప్రారంభం రోజునే విశాల్ ప్రకటించారు.
థియేటర్ల సంగతేంటి?
కోలీవుడ్‌లో ఇటీవల కాలంలో ముక్కోణపు పోటీ లేదనే చెప్పాలి. గత సంక్రాంతికి విజయ్ జిల్లా, అజిత్ వీరం చిత్రాలు పోటీపడ్డారుు. ఇవి రెండూ మంచి విజయాన్నే సొంతం చేసుకున్నాయి. ఈ ఏడాది మూడు చిత్రాలు పోటీపడుతున్నాయి. తమిళనాడులో 963 థియేటర్లు ఉన్నాయి. వాటిలో 1110 స్క్రీన్స్ ఉన్నాయి. ఈ థియేటర్లను మూడు చిత్రాలు పంచుకోవాల్సి ఉంటుంది. సగటున ఒక్కో చిత్రానికి నాలుగువందల స్క్రీన్స్ చొప్పు సంచుకోవాలి. ముందుగా అంటే జనవరి 8వ తేదీన అజిత్ నటించిన ఎన్నై అరిందాల్ చిత్రం విడుదల అవుతుందని సమాచారం. అంటే సంక్రాంతికి వారం రోజుల ముందుగానే ఎన్నై అరిందాల్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందన్నమాట. ఈ చిత్రం తొలి వారం 800 థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉందని సినీ విజ్ఞులు అంచనా.
సంక్రాంతి రోజుకు 400 థియేటర్లు తగ్గినా మరో 400 థియేటర్లలో ఎన్నై అరిందాల్ చిత్రం నిలబడుతుంది. ఈ విధంగా ఎన్నై అరిందాల్ చిత్రం తొలి వారంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టుకునే అవకాశం ఉంటుంది. ఇక సంక్రాంతి రోజున విక్రమ్ నటించిన ఐ, విశాల్ చిత్రం ఆంబళ చెరో 400 వందల స్క్రీన్లను పంచుకునే అవకాశం ఉంటుందని సినీ పండితుల అంచనా. మొత్తం మీద సంక్రాంతి రేసులో ముక్కోణపు పోటీ మాత్రం తప్పేటట్టులేదు.
సంక్రాంతికి అధికారికంగా మూడు రోజులు సెలవు దినాలు ఉంటాయి. అదనంగా మరో రెండు రోజులు ప్రజలు సెలవు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఐదు రోజులలో సినీ ప్రియులకు మూడు చిత్రాలు మంచి కాలక్షేపంగా మారనున్నాయి. సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వం మూడు రోజులు అధిక ప్రదర్శనలకు అనుమతిస్తుంది. దీంతో ఈ మూడు రోజుల్లో 15 నుంచి 25 వయసు గల వాళ్లు చిత్రాలను చూడడానికి అధిక ఆసక్తి చూపుతారన్నది వాస్తవం. ఈ ముక్కోణపు రేసులో ప్రేక్షకుల ఏ చిత్రానికి విజయాన్ని అందిస్తారో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.