1.90 లక్షల పోస్టులు ఖాళీ
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 1.90 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. వాటిలో అత్యంత అవసరమనుకున్న వాటిని మాత్రమే దశలవారీగా భర్తీ చేస్తామన్నారు. ఆయన శాసన మండలిలో గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. విపక్ష నేతల ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. వాటిలో మరికొన్ని...
‘బృహత్ బెంగళూరు మహానగర పాలికేకు భవనాలు, ఖాళీ స్థలాలు చేరి 5,107 ఆస్తులున్నాయి. వాటిలో కబ్జాకు గురైన వాటికి తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించాం. మిల్లర్స్ రోడ్డులోని ఖాళీ స్థలాన్ని 43 మంది కబ్జా చేసిన మాట వాస్తవమే. అందులో అన్ని పార్టీలకు చెందిన నేతలూ ఉన్నారు. వారిపై తప్పకుండా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం.
త్వరలో రాష్ట్ర నూతన పారిశ్రామిక పాలసీ (స్టేట్ ఇండస్ట్రీయల్ పాలసీ) విడుదల చేస్తాం. వచ్చే ఏడాది రాష్ట్రంలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ మీట్-జిమ్) నిర్వహిస్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతి చిన్న, చిన్న, మధ్య తరహాకు చెందిన 29,368 పరిశ్రమలు స్థాపించబడ్డాయి. హీరోహోండా, ఏషియన్పెయింట్స్ కంపెనీలు తమ కార్యక్రమాలను కర్ణాటకలోనే ప్రారంభించనున్నాయి. ఈ రెండు కంపెనీలు మా ప్రభుత్వ ప్రతిపాదనలు నచ్చక ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయని వస్తున్న వార్తల్లో నిజం లేదు.
రాష్ట్రంలోని కారాగారాల్లో ఖైదీలు గంజాయి వినియోగిస్తున్నారన్న విషయంపై సమగ్ర తనిఖీ చేయాలని హోంశాఖ అధికారులను ఆదేశించాం.’