రొనాల్డో <vs> లెవెండోస్కీ
నేడు పోర్చుగల్, పోలాండ్ క్వార్టర్స్ మ్యాచ్
మరో గోల్ చేస్తే రొనాల్డో కొత్త చరిత్ర యూరో కప్
మార్సెల్లీ: క్లబ్ స్థాయిలో తిరుగులేని సూపర్ స్టార్లు... యూరోపియన్ ఫుట్‌బాల్‌లోనూ హేమాహేమీలే... కానీ తమ దేశాల తరఫున ఇంతవరకు అనుకున్న స్థాయిలో మాత్రం ఆడలేకపోయారు. ఒకరు పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అయితే... మరొకరు పోలాండ్ ఆటగాడు రొబెర్టో లెవెండోస్కీ... ఇప్పుడు ఈ ఇద్దరికి మరో అవకాశం వచ్చింది. యూరోపియన్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో భాగంగా నేడు (గురువారం) ఇరుజట్ల మధ్య జరగనున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఇరువురూ తమ జట్లను గెలిపించాలనే ఏకైక లక్ష్యంతో బరిలోకి దిగుతున్నారు. లీగ్ దశలో పెద్దగా ఆకట్టుకోలేని పోర్చుగల్... ప్రిక్వార్టర్స్‌లో క్రొయేషియాపై మాత్రం నెగ్గింది. అయితే నిర్ణీత 90 నిమిషాల్లో కనీసం ఒక్కసారి కూడా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడి చేయకుండా పూర్తిగా రక్షణాత్మక ధోరణితో ఆడిందనే విమర్శలను ఎదుర్కొంది. అయితే క్వార్టర్స్ మ్యాచ్‌లో తమ ప్రదర్శనతో వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టాలని రొనాల్డో బృందం భావిస్తోంది. అలాగే యూరో చరిత్రలో అత్యధిక గోల్స్ (9) చేసిన మైకేల్ ప్లాటిని (ఫ్రాన్స్) రికార్డును సమం చేసేందుకు రొనాల్డో ఒక్క గోల్ దూరంలో ఉన్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లోనే ఈ ఫీట్‌ను పూర్తి చేయాలని అతను తహతహలాడుతున్నాడు. పోర్చుగల్ తరఫున సాంచెస్, పెపె, గోమెస్, నాని, మారియో వంటి ఆటగాళ్లు చెలరేగితే... పోలాండ్‌కు కష్టాలు తప్పవు.
ప్రిక్వార్టర్స్‌లో పెనాల్టీ షూటౌట్లో స్విట్జర్లాండ్‌ను ఓడించిన పోలాండ్ తొలిసారి యూరో టోర్నీలో క్వార్టర్స్‌కు చేరుకుంది. దీంతో మరో అద్భుత ప్రదర్శనతో పోర్చుగల్‌కు చెక్ పెట్టాలని ఆటగాళ్లు కృత నిశ్చయంతో ఉన్నారు. ప్రస్తుతం జట్టులో అందరూ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. అయితే గత నాలుగు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క గోల్ కూడా చేయని లెవెండోస్కీ షూటౌట్లో మాత్రం అదరగొట్టాడు. దీంతో మరోసారి అతనిపైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. ముఖాముఖి రికార్డులో పోర్చుగల్, పోలాండ్ 10 సార్లు తలపడ్డాయి. పోర్చుగల్ నాలుగు మ్యాచ్‌ల్లో, పోలాండ్ మూడు మ్యాచ్‌ల్లో గెలిచాయి. మరో నాలుగు మ్యాచ్‌లు ‘డ్రా’ అయ్యాయి.
నేటి రాత్రి గం. 12.30 నుంచి సోనీ సిక్స్, సోనీ ఈఎస్‌పీఎన్‌లలో ప్రత్యక్ష ప్రసారం