హమ్మయ్య!
►ఊపిరి పీల్చుకున్న జనం
►సమగ్ర సర్వే విజయవంతం
►88.79% కుటుంబాల నమోదు
►సిరిసిల్లలో అప్పులపై ఆందోళన
►రోడ్లపై కర్ఫ్యూ వాతావరణం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన సర్వే పలు చోట్ల రాత్రి వరకు కొనసాగింది. రాత్రి 8 గంటల వరకు జిల్లాలో 88.79 శాతం సర్వే పూర్తయినట్లు కలెక్టర్ వీరబ్రహ్మయ్య ప్రకటించారు. అప్పటికే దాదాపు 45 మండలాల్లో 95 శాతం సర్వే ముగిసింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 12,12,724 కుటుంబాలుంటే 10,76,729 కుటుంబాల సర్వే వివరాలు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో రాత్రి పదకొండు గంటల వరకు అక్కడక్కడ సర్వే కొనసాగింది. ఎన్యూమరేటర్లు డుమ్మా కొట్టడం, ఫారాల కొరతతో చాలాచోట్ల సర్వే ఆలస్యంగా మొదలైంది.
రామగుండం కార్పొరేషన్ పరిధిలో దాదాపు 400 మంది ఎన్యూమరేటర్లు విధులకు రాకపోవటంతో అధికారులు హడావుడి పడ్డారు. ప్రైవేటు కాలేజీల విద్యార్థులను సైతం రంగంలోకి దింపి మధ్యాహ్నం నుంచి సర్వే మొదలు పెట్టించారు. జగిత్యాల పట్టణంలో దాదాపు 500 ఇళ్లు సర్వేలో గల్లంతైనట్లు ఆలస్యంగా గుర్తించారు. అప్పటికప్పుడు అదనంగా ఎన్యూమరేటర్లను రంగంలోకి దింపి సర్వేను మొదలుపెట్టారు. జాయింట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ స్వయంగా అక్కడ సర్వేను పర్యవేక్షిస్తున్నారు.
రాత్రి పదకొండు గంటల వరకు అక్కడ సర్వే జరుగుతుందని ఆయన తెలిపారు. సామాజిక ఆర్థిక స్థితిగతులను తెలుసుకునేందుకు నిర్వహిస్తున్న సర్వేలో అప్పుల వివరాలు సైతం నమోదు చేసుకోవాలని సిరిసిల్లలో దళితులు ఆందోళనకు దిగడంతో సర్వే రెండు గంటలపాటు నిలిచిపోయింది. సంజీవయ్యనగర్‌లో ఎన్యూమరేటర్లను అడ్డుకోవటంతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. కుటుంబ స్థితిగతుల కాలమ్‌లో అప్పుల వివరాల నమోదుకు అధికారులు అంగీకరించి.. ఎన్యూమరేటర్లకు అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయటంతో ఆందోళన సద్దుమణిగింది.