నిర్లక్ష్యం
► గందరగోళంగా రీవాల్యుయేషన్ ఫలితాలు
ఎస్కేయూ:
దినేష్ (హాల్‌టికెట్ నెంబర్ 155 85029) బీకాం రెండో సంవత్సరానికి సంబంధించి రెండు సబ్జెక్టులకు రీవాల్యుయేషన్ దరఖాస్తు చేసుకొన్నాడు. కానీ ఫైనాన్స్ అకౌంటింగ్ రీవాల్యుయేషన్ ఫలితాలు ప్రకటించలేదు. రెండు రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలకు దరఖా స్తు చేసుకోవడానికి నోటిఫికేషన్‌ను వి డుదల చేయనున్నారు. ఉత్తీర్ణులయ్యామా?లేదా? అనే అంశంపై స్పష్టత రాకపోవడంతో సప్లిమెంటరీ పరీక్షలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలనే సందిగ్ధం నెలకొంది. ఇది అనేక మంది విద్యార్థుల పరిస్థితి.
చలనా చూపితేనే రీవాల్యుయేషన్..
ఆశించినంత మార్కులు రాకపోవడం, ఫెయిల్ అయిన వారికి అవకాశం కల్పించడం కోసం రీవాల్యుయేషన్ (పునర్ మూల్యాంకనం) విధానం అమలు చేస్తున్నారు. దీంతో ఒక్కో విద్యార్థి రెండు, మూడు సబ్జెక్టులకు దరఖాస్తు చేసుకొన్నారు. ఒక సబ్జెక్టుకు మాత్రమే ఫలితాలు ప్రకటించి మిగిలిన సబ్జెక్టుల ఫలితాలను పట్టించుకోలేదు. దీంతో విద్యార్థులు గందరగోళంకు గురవుతున్నారు. ఫీజు కట్టినట్లు బ్యాంకు చలానా చూపితే జవాబు పత్రాలు తీసి రీవాల్యుయేషన్‌కు పంపుతున్నారు.
గందరగోళంగా వాల్యుయేషన్..
బీకాం మొదటి, రెండు, మూడో సంవత్సరానికి సంబంధించి 4 వేల మంది విద్యార్థులు తాజాగా చేపట్టిన రీవాల్యుయేషన్లో ఉత్తీర్ణులయ్యారు. వేలాది మంది విద్యార్థులు రీవాల్యుయేషన్లో పాస్ కావడం ఇదే తొలిసారి. అధ్యాపకుల నిర్లక్ష్యంతో మొదటి వాల్యుయేషన్‌లో విద్యార్థులు ఫెయిల్ అయినట్లు స్పష్టమవుతోంది. నిర్లక్ష్యంగా వాల్యుయేషన్ చేశారా? లేక రీవాల్యుయేషన్ తేలికగ్గా చేశారా? అనే అంశంపై స్పష్టత లేదు.