30 సెం.మీ.చాలు!
నగరానికి వరద ముప్పు
సిటీబ్యూరో: మహా నగరంలో గట్టిగా 30 సెం.మీ. వర్షం కురిస్తే చాలు. నిండా మునిగిపోతాం. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ సైతం అనేక సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ నగరంలో వర్షాకాల సమస్యలను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. అయినా పరిష్కారానికి ఇంతవరకు కార్యాచరణ ప్రారంభం కాలేదు. 2000వ సంవత్సరంలో కురిసిన భారీ వర్షానికి రహదారులు చెరువులుగా మారాయి. అప్పుడు 24 గంటల్లో కురిసిన 24 సెం.మీ.ల వర్షానికే ఎన్నో ఇళ్లు మునిగిపోయాయి. ఆ అనుభవంతో వరద నీటి పారుదలకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని... వైస్రాయ్ హోటల్ వద్ద మినీ డ్యామ్లా గేట్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కానీ.. కార్యరూపం దాల్చలేదు.
నగర భౌగోళిక పరిస్థితులు... కుంచించుకుపోయిన నాలాలు... భారీ నిర్మాణాలతో వర్షం కురిస్తే నీరు పోయే దారి లేదు. రోజురోజుకూ ఈ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. గంటకు దాదాపు రెండు సెం.మీ. లేదా రోజుకు దాదాపు 25 సెం.మీ.కు మించి వర్షం కురిస్తే తట్టుకునే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. ఇవన్నీ పైపై అంచనాలే తప్ప నగరం ఎంత వర్షపాతాన్ని తట్టుకుంటుందనే దానిపై ఇంతవరకు ఎలాంటి శాస్త్రీయ అధ్యయనాలు జరుగలేదు.
విపత్తు నిర్వహణ లేదు
కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టు ఆదేశాలతో జీహెచ్ఎంసీలో విపత్తు నివారణ విభాగాన్ని ఏర్పాటు చేసినప్పటికీ... సిబ్బంది కానీ.. ఉపకరణాలు కానీ లేవు. కనీసం ఎంత వర్షం కురిసిందో ఎప్పటికప్పుడు వెల్లడించే వ్యవస్థ కూడా లేదు. ఏటా వాటర్‌లాగింగ్ పాయింట్లను (వర్షం వస్తే నీరు నిలిచే ప్రాంతాలను) గుర్తించి రూ.5 నుంచి రూ.10 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు తప్ప... శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవడం లేదు.
ప్రతిపాదనలకే పరిమితం
ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి జీహెచ్ఎంసీ అధికారుల వద్ద కొద్ది కాల క్రితం వరకూ త గిన ప్రణాళిక లే దు. నగరంలో ఏ రోడ్ల కింద ఎన్ని నాలాలున్నాయి? ఏ చెరువులు ఎంత మేర కబ్జాకు గురయ్యాయి? సివరేజి నీరు ఏఏ ప్రాంతాల్లో వరదనీటి కాలువల్లో కలుస్తోంది? అందుకు కారణాలేమిటి ? అనే సమాచారం జీహెచ్ఎంసీ వద్ద లేదు. ముఖ్యమంత్రి శ్రద్ధ చూపడంతో ఐదేళ్ల సగటు వర్షపాతాన్ని పరిగణనలోకి తీసుకొని గంటకు దాదాపు ఏడు సెం.మీ. వర్షపాతాన్ని తట్టుకునేలా ఇటీవల నాలాల ఆధునీకరణకు ప్రణాళికలు రూపొందించారు. ఈ పనులకు సుమారు రూ.10 వేల కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేశారు. వీటిని బ్రిక్స్బ్యాంక్ నుంచి రుణంగా పొందేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు.
నగరంలో ఇదీ పరిస్థితి
⇒ వర్షాకాలంలో (జూన్ -సెప్టెంబర్)లో 61 సెం.మీ.ల నుంచి 80 సెం.మీ.ల వర్షపాతం నమోదవుతోంది.
⇒నగరం మునగడానికి 24 గంటల్లో వర్షపాతం 50 మి.మీ.లు దాటితే చాలు.
⇒ఒకప్పుడు 530 చెరువులు ఉండగా... ప్రస్తుతం దాదాపు 170 మిగిలాయి.
⇒హుస్సేన్‌సాగర్ 75 హెక్టార్ల నుంచి 25 హెక్టార్లకు కుంచించుకుపోవడం, మీర్ జుమాలాట్యాంక్, మాసాబ్‌ట్యాంక్, బతుకమ్మ కుంట పేర్లుగా మాత్రమే మిగలడం పరిస్థితికి దర్పణం.
గత వందేళ్లలో ఇలా...
1908, 1915, 1916, 1933, 1962, 1970, 2000 సంవత్సరాల్లో నగరంలో భారీ వర్షాలు కురిశాయి. ఇవి నగరాన్ని ముంచెత్తిన వానలుగా రికార్డుకెక్కాయి.