పార్టీల బలహీనానికే కొత్త జిల్లాలు: ఎల్.రమణ
సాక్షి, హైదరాబాద్: జిల్లాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న తీరుతో వాటికున్న పవిత్రత పోతోందని టీటీడీపీ నేత ఎల్.రమణ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఇతర రాజకీయ పార్టీలను బలహీనపరిచేందుకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర భూసేకరణ చట్టం-2013 అమలు చేయకపోవడం, ఎంసెట్ లీకేజీతో విద్యార్థులకు నష్టం, కరువు వల్ల రైతాంగం కడగండ్లు వంటి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ ఈ ఆలోచన చేశారన్నారు.
గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ సాధనలో ముఖ్య భూమిక పోషించిన కరీంనగర్ జిల్లాలో ఇతర జిల్లాల్లోని 8 ప్రాంతాలను కలిపారన్నారు. తూతూ మంత్రంగా, బలహీన వర్గాలను దెబ్బతీసేలా జిల్లాల విభజన ఉందని ఆరోపించారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పరిశ్రమలకు కేంద్రమిచ్చే రాయితీలను ఏ జిల్లాలకు కేటాయిస్తారని టీడీపీ నేత పెద్దిరెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ మెట్రో రైలు పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని, అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసి ప్రాజెక్టుపై ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.