రాష్ట్ర విద్యార్థులకు ఫ్రాక్షనల్ ర్యాంకులు
జేఈఈ మెయిన్ ర్యాంకులు ఇచ్చేందుకు సీబీఎస్ఈ ఓకే:
* కేంద్రం స్పందించింది.. అందరిని ఒప్పించాం
* 4వ తేదీన ర్యాంకుల కేటాయింపు
* 4, 5 తేదీల్లోనే ఆప్షన్లు ఇచ్చుకోవాలి
* మొదటి దశలోనే సీట్ల కేటాయింపు
* ఇది రాష్ట్ర ఇంటర్ బోర్డు తప్పిదమే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యార్థులకు ర్యాంకులు ఇచ్చేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) అంగీకరించింది.
ఈ నెల 4వ తేదీన రాష్ట్ర విద్యార్థులకు ఫ్రాక్షనల్ ర్యాంకులను (ఉదాహరణకు 100వ ర్యాంకు ఇదివరకే ఒకరికి ఇచ్చి ఉంటే.. ఇప్పుడు రాష్ట్ర విద్యార్థికి కూడా అదే ర్యాంకు వస్తే అతనికి 100.1గా ఫ్రాక్షనల్ ర్యాంకు కేటాయిస్తారు) కేటాయించనుంది. ఈ మేరకు వివరాలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గురువారం హైదరాబాద్‌లో వెల్లడించారు. విద్యార్థులు 4, 5 తేదీల్లోనే వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, మొదటి దశలోనే సీట్లు పొందవచ్చని స్పష్టం చేశారు. రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి నష్టం కలగకుండా చూసేందుకు చర్యలు చేపట్టామని.. తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
అయితే ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌లో ఆలిండియా ర్యాంకుల ఖరారుకు జేఈఈ మెయిన్ మార్కులకు 60 శాతం, ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీగా తీసుకుంటారు. ఈ సారి రాష్ట్ర ఇంటర్ బోర్డు కొందరు విద్యార్థుల మార్కులను సీబీఎస్ఈకి ఇవ్వకపోవడం వల్ల వారికి ర్యాంకులను కేటాయించలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.
దీనిపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశం మేరకు ఉన్నతాధికారులు గురువారం ఉదయమే ఢిల్లీకి వెళ్లారు. అక్కడ మానవ వనరుల శాఖ, సీబీఎస్ఈ అధికారులతో చర్చించి, ర్యాంకుల కేటాయింపునకు ఒప్పించారు. రాష్ట్ర విద్యార్థులకు సీట్లు కేటాయిస్తున్నట్లుగా సీఎస్ఏబీ కోఆర్డినేటర్ ఎంపీ సింగ్ గురువారం రాత్రే ఇంటర్‌బోర్డుకు ఈమెయిల్ చేశారు.
బోర్డు తప్పిదం వల్లే..
రాష్ట్ర ఇంటర్ బోర్డు పొరపాటు వల్లే ఈ సమస్య తలెత్తిందని కడియం శ్రీహరి తెలిపారు. ‘‘ఇంప్రూవ్మెంట్, ఇతర విద్యార్థుల మార్కులను సీబీఎస్ఈకి ఇవ్వలేదు. బోర్డు నుంచి ఇచ్చిన సీడీలో 68 వేల మంది మార్కులు ఉన్నాయి. దాదాపు 1,188 మంది విద్యార్థుల మార్కుల వివరాలు లేవు. బోర్డు అధికారులు ఇది సరిచూసుకోలేదు. అందుకే ఉన్నతాధికారులను ఢిల్లీకి పంపాను. వారు సీబీఎస్ఈ చైర్మన్‌తో చర్చించారు. ఆమె ముందు అంగీకరించలేదు.
దీంతో మానవ వనరుల శాఖ కార్యదర్శి సుభాష్ కుంతియాతో చర్చించి, పరిస్థితిని వివరించడంతో ఆయన రాత పూర్వకంగా సీబీఎస్ఈకి ఆదేశాలు జారీచేశారు. అప్పుడు ర్యాంకులు ఇచ్చేందుకు సీబీఎస్ఈ చైర్మన్ అంగీకరించారు. దీంతో అధికారులు విద్యార్థుల మార్కుల జాబితాను సీబీఎస్ఈకి అందజేశారు. తర్వాత సీఎస్ఏబీ కోఆర్డినేటర్ ఎంపీ సింగ్‌తో చర్చించారు. ఈనెల 4వ తేదీ ఉదయానికల్లా విద్యార్థులకు ఫ్రాక్షనల్ ర్యాంకులను ఇస్తే తాము మొదటి దశ కౌన్సెలింగ్‌లోనే పెడతామని చెప్పారు.
అందుకు సీబీఎస్ఈ అంగీకరించింది. మన రాష్ట్రం నుంచి మిస్ అయిన వారిలో దాదాపు 130 మందికి మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ విద్యార్థులు ఏపీ ఇంటర్ బోర్డు పరిధిలోకి వస్తామని, ఏపీ విద్యార్థులు తెలంగాణ బోర్డు పరిధిలోకి వస్తామని తప్పుడు ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఈ సమస్యను కూడా అధికారులు గుర్తించి సరిచేశారు.’’ అని చెప్పారు.
రెండు రోజులే గడువు..
విద్యార్థులకు 4వ తేదీన ఉదయం సీబీఎస్ఈ ర్యాంకులను ప్రకటిస్తుందని కడియం చెప్పారు. అయితే ఇప్పటికే ఒక ర్యాంకు వేరే వారికి వచ్చి, మన విద్యార్థికి అదేర్యాంకు వస్తే ఫ్రాక్షనల్ ర్యాంకు ఇస్తారని, దాని ఆధారంగా ఆప్షన్లు ఇచ్చుకోవాలని పేర్కొన్నారు. ఆప్షన్లు ఇచ్చుకునేందుకు 4, 5 తేదీలు మాత్రమే గడువు ఉందని.. ఈ విషయాన్ని గమనించాలని విద్యార్థులకు సూచించారు.
7వ తేదీన మొదటి దశ సీట్ల కేటాయింపులో రాష్ట్ర విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారని చెప్పారు. ఈ తప్పిదానికి బాధ్యులైన వారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయని కడియం పేర్కొన్నారు. అయితే ముందుగా విద్యార్థుల సమస్య పరిష్కారం కావాలని, ర్యాంకులు రావాలని చెప్పారు. 7వ తేదీ తరువాత దీనిపై దృష్టి పెడతామని, అలాగే బోర్డులో జరుగుతున్న వరుస తప్పిదాలపై విచారణ జరిపించి చర్యలు చేపడతామని తెలిపారు.
‘ఫ్రాక్షనల్’తో న్యాయం జరిగేనా?
ఫ్రాక్షనల్ ర్యాంకుల కేటాయింపుతో విద్యార్థులకు సీట్ల కేటాయింపులో న్యాయం జరుగుతుందా అన్నదానిపై ఆందోళన నెలకొంది. ఫ్రాక్షనల్ ర్యాంకుల్లో భాగంగా ఇదివరకు ఒక విద్యార్థికి 50వ ర్యాంకు వచ్చి ఉంటే ఇప్పుడు రాష్ట్ర విద్యార్థికి 50.1 ఫ్రాక్షనల్ ర్యాంకు ఇస్తారు. లెక్క ప్రకారమైతే ఇద్దరి ర్యాంకు ఒక్కటే. కానీ సీట్లు కేటాయించే సమయంలో వీరిలో ఎవరికి ముందు ప్రాధాన్యం ఇస్తారన్న దానిపై ఆందోళన నెలకొంది. అయితే ఒకే ర్యాంకు ఉన్న వారిలో పేరు వరుస క్రమాన్ని పరిగణనలోకి తీసుకొని సీట్లు కేటాయిస్తారా, లేదా ఆయా సబ్జెక్టుల్లో, పేపర్లలో వచ్చిన మార్కులను ప్రాధాన్య క్రమంలో చూసి సీట్లను కేటాయిస్తారా? అన్నదానిపై స్పష్టత లేదు.
విద్యార్థుల ఆందోళన
రాష్ట్ర ఇంటర్ బోర్డు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని జేఈఈ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మండిపడ్డారు. గురువారం హైదరాబాద్‌లో నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ఆందోళన చేశారు. విద్యార్థుల మార్కులను సీబీఎస్ఈకి పంపకపోవడంతోనే ర్యాంకులు రాలేదని వాపోయారు. అధికారులు తప్పులు చేసి సాంకేతిక కారణాలను సాకుగా చూపడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.