గవర్నర్ సాబ్.. డూండో జరా!
రాంపూర్: ‘సార్.. మా కుక్క తప్పిపోయింది. వెతికించండి. మా కోళ్లు పోయాయి. తెప్పించండి. మేకను దొంగిలించారు. ఇప్పించండి’ అంటూ ఎవరైనా గవర్నర్ అంతటి వ్యక్తిని అడుగుతారా? కానీ ఉత్తరప్రదేశ్ రాజ్‌భవన్‌కు ఇలాంటి విచిత్ర ఫిర్యాదులు వస్తున్నాయట! ఔదార్యంతో ఓ వ్యక్తికి సాయపడాలని గవర్నర్ రామ్ నాయక్ జోక్యం చేసుకోవడమే ఇప్పుడు సమస్యగా మారిందట! వివరాల్లోకెళితే... ఫర్హానుల్లాఖాన్కు చెందిన పన్నెండు కోళ్లు చోరీకి గురయ్యాయి. పోలీసులు పట్టించుకోకపోవడంతో గవర్నర్‌కు ఈ-మెయిల్లో ఫిర్యాదు చేశాడు.
గవర్నర్ పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. ఆ కోళ్ల జాడ ఇప్పటికీ తెలియలేదు. కానీ.. గవర్నర్‌కు అలాంటి విజ్ఞప్తులు మాత్రం వరుసగా మొదలయ్యాయి! ‘నూతన్(కుక్క)ను నా కన్నబిడ్డలా చూసుకున్నా. దాని కోసం ఇంట్లో ఏసీ కూడా పెట్టించా’ అంటూ రజ్మీక్ ఖాన్ అనే వ్యక్తి మొరపెట్టుకున్నాడు. ‘నా మేకను వెతికించేందుకు ఇంకా చర్యలు తీసుకోలేదు. కోళ్లు ఆఫ్ట్రాల్. మేక వాటికన్నా విలువైనది కదా’ అంటూ మోయిన్ పఠాన్ అనే వ్యక్తి అసహనం వ్యక్తంచేశాడు.
ఇటీవలే కారును పోగొట్టుకున్న ఆర్ఎల్డీ రాంపూర్ శాఖ చీఫ్ దీనిపై మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోళ్లు, కుక్కలు, మేకలకే భద్రత లేదు. మనుషులకు ఉండాలని ఎలా ఆశిస్తారు?’ అంటూ చమత్కరించారు. అన్నట్టూ.. యూపీ మంత్రి ఆజమ్ ఖాన్‌కు చెందిన ఏడు గేదెలూ ఇటీవల చోరీకి గురయ్యాయి. మంత్రి గారి గేదెలు కదా.. ఏకంగా క్రైమ్‌బ్రాంచ్ పోలీసులే జాగిలాలతో సహా రంగంలోకి దిగి మరీ దొంగలను పట్టుకున్నారట!