సమైక్య పోరుపై త్వరలో కార్యాచరణ
సమైక్యాంధ్ర గెజిటెడ్ అధికారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పటేల్
విశాఖపట్నం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్య ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు రెండు మూడు రోజుల్లో కార్యాచరణ సిద్ధం చేస్తామని సమైక్యాంధ్ర గెజిటెడ్ ఆఫీసర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు ఎ.వి.పటేల్ ప్రకటించారు. సోమవారం ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీలో చర్చకు రాక ముందే అన్ని సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు ఢిల్లీలో తాకట్టుపెట్టారని మండిపడ్డారు. తెలంగాణ బిల్లు విషయంలో కేంద్రం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహ రిస్తోందని ఆరోపించారు. దేశంలో నెలకొన్న పలు సమస్యలను పట్టించుకోకుండా రాష్ట్ర విభజన ప్రక్రియను వేగవంతం చేయడం వెనక ఓట్లు, సీట్లు, కుట్ర దాగి ఉందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ దీన స్థితిలో ఉన్న ప్రతిసారీ ఉద్యోగులే సహకారమందించారని గుర్తు చేస్తూ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన ఆ పార్టీకి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పటికైనా సమైక్య ఉద్యమంలోకి రాకపోతే రాజకీయ భవిష్యత్తు ఉండదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్ల జేఏసీ చైర్మన్ మరియన్న తదితరులు పాల్గొన్నారు.