మాఫీకి టోపీ!
కలగా మిగిలిన చేనేత రుణమాఫీ
ఏళ్లు గడుస్తున్నా నెరవేరని చంద్రబాబు హామీ
జిల్లాలో మాఫీ కావాల్సిన రుణాలు రూ.4.75 కోట్లు
రూ.110 కోట్లు విడుదల చేశామంటూ ప్రభుత్వం ప్రకటనలు
నయాపైసా కూడా మాఫీ కాని వైనం
పిఠాపురం :
చేనేత రుణమాఫీ చేస్తామంటూ ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన హామీలు నమ్మిన నేతన్నలు ‘బాబు వస్తాడు.. తమ బతుకులు మారుస్తాడ’ని నమ్మారు. రెండున్నరేళ్లు గడిచినా తమ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండడంతో.. నట్టేట మునిగామని వాపోతున్నారు. చేనేత రుణమాఫీకి రూ.110 కోట్లు విడుదల చేశామని ప్రభుత్వం ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా.. నయాపైసా రుణం కూడా మాఫీ కాక, చేసిన అప్పులు తీరక నేతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. మాఫీ పేరుతో ప్రభుత్వం తమ నెత్తిన టోపీ పెట్టినట్టుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 50 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 17,062 చేనేత మగ్గాలున్నాయి. 45 వేలకు పైగా నేత కార్మికుల కుటుంబాలున్నాయి. సుమారు 2 లక్షల మంది కార్మికులు చేనేతపై ఆ«ధారపడి జీవిస్తున్నారు. వీరుకాక సంఘాల్లో లేకుండా మరో 30 వేల మంది నేత కార్మికులున్నారు. చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యాన వివిధ బ్యాంకుల ద్వారా 2,177 మంది నేత కార్మికులు రూ.5.6 కోట్లకు పైగా వ్యక్తిగత, సంఘాల రుణాలు తీసుకున్నారు. వీటిలో 2,017 మందికి రూ.4,17,49,326 వ్యక్తిగత రుణాలు, 160 మందికి రూ.22,24,918 మేర గ్రూపు కార్మికుల వ్యక్తిగత రుణాలు, 52 పవర్లూమ్స్కు సంబంధించి రూ.59,66,479 రుణాలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా రూ.4.75 కోట్ల మేర చేనేత రుణమాఫీ చేయాలని చేనేత, జౌళి శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. నెలలు గడుస్తున్నా ఒక్క పైసా కూడా మాఫీ జరగలేదని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖాతాలో డబ్బు పడితే ఖతం
మరోపక్క రుణాలు తీసుకున్న నేత కార్మికులు కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. వారి బ్యాంకు ఖాతాల్లో ఎవరు డబ్బులు వేసినా వెంటనే సంబంధిత బ్యాంకు సిబ్బంది ఆయా కార్మికుల అప్పులకు సంబంధించిన వడ్డీల కింద ఆ మొత్తాన్ని జమ చేసుకుంటున్నారు. కొందరు కార్మికుల పిల్లలు ఇతర ప్రాంతాల్లో ఉపాధికి వెళ్లి అక్కడ నుంచి తల్లిదండ్రుల ఖాతాలకు డబ్బు పంపుతున్నారు. ఆ మొత్తాన్ని బ్యాంకులు వడ్డీగా జమ చేసుకోవడంతో పలువురు తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. చివరకు గ్యాస్ సబ్సిడీ వచ్చినా కూడా వడ్డీ కింద జమ చేసుకుంటున్నారని నేత కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకుల ఒత్తిడి ఎక్కువైందని అంటున్నారు. కనీసం ఎప్పుడు మాఫీ చేస్తారో చెప్పాలని వారు కోరుతున్నారు.
మా ఖాతాకు ఏ డబ్బు వచ్చినా తీసేసుకుంటున్నారు
రోజంతా నిద్రాహారాలు మాని నేత నేసినా పొట్ట గడవడం లేదు. చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందనగానే ఎంతో సంతోషపడ్డాం కానీ, ఏళ్లు గడుస్తున్నా ఆ హామీ నెరవేరడంలేదు. మా అబ్బాయి వేసిన డబ్బులు, గ్యాస్ సబ్సిడీ సహా నా బ్యాంకు ఖాతాకు ఏ డబ్బు వచ్చినా వడ్డీల కింద నాకు తెలియకుండానే బ్యాంకు సిబ్బంది తీసేసుకుంటున్నారు. మరోపక్క అప్పులు చెల్లించాలని ఒత్తిడి తెస్తున్నారు. అప్పు చెల్లించకపోతే బజారుకీడుస్తామంటున్నారు.
– యచ్చిన తాతారావు, నేత కార్మికుడు, కొత్తపల్లి
రూ.4.75 కోట్ల మాఫీకి ప్రతిపాదనలు పంపాం
జిల్లావ్యాప్తంగా 2014 మార్చి 31 వరకూ రుణాలు తీసుకున్న చేనేత కార్మికులకు సంబంధించి రూ.4.75 కోట్ల రుణమాఫీకి ప్రతిపాదనలు పంపాం. రుణమాఫీకి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం వడ్డీలు సహా రుణమాఫీ నివేదికలు పంపడం వల్ల జాప్యం జరుగుతోంది. అర్హులైన కార్మికులందరికీ అవకాశం ఉండేలా చర్యలు తీసుకున్నాం. రుణమాఫీ నిధులు నేరుగా ఆయా కార్మికుల బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయి. మిగిలి ఉన్న అర్హులైన చేనేత కార్మికుల వివరాలు సేకరించి రెండో దఫా పంపుతాం.
– ఎస్ఎస్ఆర్కే ప్రసాద్, సహాయ సంచాలకుడు, చేనేత, జౌళి శాఖ, కాకినాడ