అదిగదిగో చిరుత
–గూళ్యపాళ్యంలో మళ్లీ కలకలం
వజ్రకరూరు : మండలంలోని గూళ్యపాళ్యంలో చిరుత మళ్లీ కలకలం సష్టించింది. ఆదివారం ఉదయం గ్రామసమీపంలోని కొండపై నుంచి కిందకు వచ్చింది. కొద్దిసేపు పరిసరాల్లో తిరిగింది. అక్కడున్న కుక్కపై దాడికి యత్నించగా.. అది తప్పించుకుంది. ఆ తర్వాత మళ్లీ కొండపైకి వెళ్లి..కొద్దిసేపు ఒకేచోట ఉంది. చిరుత మరోమారు కనిపించడంతో గ్రామస్తులు హడలిపోయారు. మిద్దెలపైకెక్కి దాన్ని చూశారు. గ్రామస్తులకు చిరుత కన్పించడం నెల రోజుల వ్యవధిలో ఇది నాల్గోసారి. దీంతో రాత్రి సమయాల్లో ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. కొండ సమీపంలో నివసిస్తున్న కుటుంబాలు మరింత ఆందోళనకు గురవుతున్నాయి. పంట పొలాలకు వెళ్లడానికి రైతులు కూడా జంకుతున్నారు.
ఈ నెల ఎనిమిదిన కురుబ కొమ్మె కేశప్ప అనేlరైతుకు చెందిన ఆవుదూడను గ్రామ సమీపంలోని ఊరుకుంట వద్ద చంపేసింది. అలాగే తొమ్మిదోతేదీ లాలుస్వామి ఆలయానికి చెందిన గుర్రంపైనా దాడి చేసి గాయపరిచింది. చిరుత విషయమై ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి గతంలోనే జిల్లా అధికారులతో మాట్లాడారు. వారి సూచన మేరకు అటవీ శాఖ అధికారులు, రెస్క్యూటీం, పోలీసులు గ్రామంలో ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. ఆదివారం వజ్రకరూరు ఎస్ఐ జనార్దన్ నాయుడు, ఏఎస్ఐ కుళ్లాయిస్వామి కూడా గ్రామంలో పర్యటించి.. ప్రజలను అప్రమత్తం చేశారు. కొండ పరిసరాల్లో బోన్లు ఏర్పాటు చేసి..చిరుతను బంధిస్తే సమస్య తీరుతుందని స్థానికులు అంటున్నారు.