Guns licences
-
గన్స్.. రిటర్న్
వరంగల్ క్రైం: ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం లైసెన్స్ తుపాకులను వెనక్కి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రాణభయం ఉందని పలువురు పోలీసు అధికారులు, రాజకీయ నేతలు, ఆర్థికంగా పలుకుబడి ఉన్నవారు, సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు గన్‌లైసెన్స్ పొంది తుపాకులు కలిగి ఉన్నారు. ఈ విధంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 305 మంది వద్ద లైసెన్స్డ్ గన్స్ ఉన్నాయి. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే తుపాకులు పోలీసుల దగ్గర తప్ప మరెవ్వరి వద్ద ఉండరాదనే నిబంధనల ప్రకారం కమిషనరేట్ అధికారులు ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. అయా పోలీసు స్టేషన్ల పరిధిలో గన్ లైసెన్స్ దారులకు తుపాకులుు రిటర్న్ చేయాలని సమాచారం ఇవ్వడంతోపాటు నోటీసులు అందజేశారు. కమిషనరేట్ పరిధిలో 305 లైసెన్స్డ్ గన్స్.. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 305 మంది వద్ద ఉన్న లైసెన్స్డ్ తుపాకులను ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలయ్యే నాటికి పోలీసు స్టేషన్లు , కమిషనరేట్ కార్యాలయం, తుపాకులు విక్రయించే వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా కమిషనరేట్ కార్యాలయంలో ఇప్పటివరకు సుమారు 46 మంది తుపాకులను అప్పగించారు. అయితే.. కమిషనరేట్ పరిధిలోని వివిధ బ్యాంకుల్లో సెక్యురిటీ గార్డుల వద్ద 54 గన్స్ ఉన్నాయి. వీటిని మాత్రం వెనక్కి తీసుకోవడం లేదని అధికారులు తెలిపారు. పోలీసులు డిపాజిట్ చేసుకుంటున్న తుపాకులను కౌంటింగ్ పూర్తయ్యే వరకు వారి దగ్గరనే భద్రపరచనున్నారు. ఆ తర్వాత ఎవ్వరికి వారికి అందజేయనున్నారు. ప్రమాదం ఉంటే పరిశీలిస్తాం.. నిబంధనల ప్రకారం ఎలక్షన్ సమయంలో ఎవ్వరి దగ్గర తుపాకులు ఉండకూడదు. అందుకే అధికారులకు అదేశాలు జారీ చేశాం. అందరూ తుపాకులు డిపాజిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల సమయంలో ఎవరికైనా ప్రమాదం పొంచి ఉందని తెలిస్తే వారి విషయంలో ఆలోచన చేస్తాం. ఎన్నికల నామినేషన్ల తర్వాత వారికి ఉండే ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని రక్షణ కల్పిస్తాం. ఎవరు కూడా ఎన్నికల సమయంలో ఎట్టి పరిస్థితుల్లో తుపాకులు కలిగి ఉండకూడదు. ఒకే వేల ఉంచుకుంటే చర్యలు తప్పవు. – డాక్టర్ విశ్వనాథ రవీందర్, వరంగల్ పోలీసు కమిషనర్ -
తుపాకుల లెసైన్స్‌పై వాగ్యుద్ధం
ఏపీలో క్రిమినల్స్‌కు ఆయుధాలు:టీఆర్ఎస్ టీడీపీ సభ్యుల తీవ్ర అభ్యంతరం సాక్షి, హైదరాబాద్: తుపాకుల లెసైన్స్(గన్ లెసై న్స్) అంశం సోమవారం తెలంగాణ శాసనసభలో టీఆర్ఎస్, టీడీపీ పక్షాల మధ్య వాగ్యుద్ధానికి దారి తీసింది. ప్రశ్నోత్తరాల అనంతరం స్పీకర్ మధుసూదనాచారి జీరో అవర్‌ను చేపట్టారు. వివిధ అంశాలపై అన్ని పార్టీల సభ్యులు మాట్లాడిన అనంతరం చివరలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మాట్లాడుతూ.. తుపాకుల లెసైన్స్ అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో ఎన్ని లెసైన్స్‌లు ఇచ్చారో, ఇందుకు అనుసరిస్తున్న మార్గదర్శకాలను ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. లెసైన్స్‌లు కలిగిన కొందరు వ్యక్తులు వాటిని అడ్డంపెట్టుకొని భూ దందాలు, ఇసుక దందాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో పక్క రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం ఫ్రొఫెషనల్ క్రిమినల్స్‌కు ఆయుధాలు ఇచ్చినట్లుగా తెలిసిందని, ఈ దృష్ట్యా తుపాకుల లెసైన్స్‌లపై సమీక్ష నిర్వహించాలని కోరారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార పక్షం కూడా ప్రతి నినాదాలు చేయడంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఇదే సమయంలో రామలింగారెడ్డికి స్పీకర్ మైక్ కట్ చేశారు. అయినా టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తమ స్థానాల్లో లేచి అభ్యంతరం తెలపడంతో స్పీకర్ సభకు టీ బ్రేక్ ప్రకటించారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యేలకు భద్రత కుదింపు అంశాన్ని కాంగ్రెస్ ఎమ్మె ల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి సభ దృష్టికి తెచ్చారు. మాజీమంత్రి శ్రీధర్‌బాబు, పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డికి భద్రతను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. హోంగార్డుల జీతాన్ని పెంచాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వక్ప్భూములన్నీ ఆక్రమణకు గురవుతున్నాయని, చేవెళ్లలో ఇటీవలే ఐదు ఎకరాల భూమి ఆక్రమణకు గురైందని, అందులో ఏబీ ఎన్ ఆంధ్రజ్యోతి చానల్ తన కార్యాల యాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలిసిందని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జాఫర్ హుస్సేన్(మజ్లిస్) ప్రభుత్వాన్ని కోరారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలపై ఉన్న నిషేదాన్ని ఎత్తేయాలని, దీనిపై సీఎం ప్రకటన చేయాలని పాయం వెంకటేశ్వర్లు(వైఎస్సార్సీపీ) కోరారు.