వరంగల్ క్రైం: ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం లైసెన్స్ తుపాకులను వెనక్కి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రాణభయం ఉందని పలువురు పోలీసు అధికారులు, రాజకీయ నేతలు, ఆర్థికంగా పలుకుబడి ఉన్నవారు, సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు గన్‌లైసెన్స్ పొంది తుపాకులు కలిగి ఉన్నారు.
ఈ విధంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 305 మంది వద్ద లైసెన్స్‌డ్ గన్స్ ఉన్నాయి. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే తుపాకులు పోలీసుల దగ్గర తప్ప మరెవ్వరి వద్ద ఉండరాదనే నిబంధనల ప్రకారం కమిషనరేట్ అధికారులు ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. అయా పోలీసు స్టేషన్ల పరిధిలో గన్ లైసెన్స్ దారులకు తుపాకులుు రిటర్న్ చేయాలని సమాచారం ఇవ్వడంతోపాటు నోటీసులు అందజేశారు.
కమిషనరేట్ పరిధిలో 305 లైసెన్స్‌డ్ గన్స్..
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 305 మంది వద్ద ఉన్న లైసెన్స్‌డ్ తుపాకులను ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలయ్యే నాటికి పోలీసు స్టేషన్లు , కమిషనరేట్ కార్యాలయం, తుపాకులు విక్రయించే వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా కమిషనరేట్ కార్యాలయంలో ఇప్పటివరకు సుమారు 46 మంది తుపాకులను అప్పగించారు. అయితే.. కమిషనరేట్ పరిధిలోని వివిధ బ్యాంకుల్లో సెక్యురిటీ గార్డుల వద్ద 54 గన్స్ ఉన్నాయి. వీటిని మాత్రం వెనక్కి తీసుకోవడం లేదని అధికారులు తెలిపారు. పోలీసులు డిపాజిట్ చేసుకుంటున్న తుపాకులను కౌంటింగ్ పూర్తయ్యే వరకు వారి దగ్గరనే భద్రపరచనున్నారు. ఆ తర్వాత ఎవ్వరికి వారికి అందజేయనున్నారు.
ప్రమాదం ఉంటే పరిశీలిస్తాం..
నిబంధనల ప్రకారం ఎలక్షన్ సమయంలో ఎవ్వరి దగ్గర తుపాకులు ఉండకూడదు. అందుకే అధికారులకు అదేశాలు జారీ చేశాం. అందరూ తుపాకులు డిపాజిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల సమయంలో ఎవరికైనా ప్రమాదం పొంచి ఉందని తెలిస్తే వారి విషయంలో ఆలోచన చేస్తాం. ఎన్నికల నామినేషన్ల తర్వాత వారికి ఉండే ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని రక్షణ కల్పిస్తాం. ఎవరు కూడా ఎన్నికల సమయంలో ఎట్టి పరిస్థితుల్లో తుపాకులు కలిగి ఉండకూడదు. ఒకే వేల ఉంచుకుంటే చర్యలు తప్పవు. – డాక్టర్ విశ్వనాథ రవీందర్, వరంగల్ పోలీసు కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment