ఒక 'హాయ్'తో సరిపెట్టేశారు!
వాళ్లిద్దరూ కలుస్తారని, మాట్లాడుకుంటారని, చేతులు కలిపి షేక్హ్యాండ్లు ఇచ్చుకుంటారేమోనని అందరూ ఎదురు చూశారు. కానీ, గత కొంత కాలంగా భారత్ - పాక్ మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉండటం, పాక్ దళాలు పదే పదే భారత భూభాగంపై దాడులు చేస్తుండటంతో ప్రధాని నరేంద్రమోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ల మధ్య ఇవేవీ జరగలేదు. టేబుల్‌కు ఒకవైపు ఆయన, మరోవైపు ఈయన ఉండి.. కేవలం ఒక 'హాయ్'తో సరిపెట్టేశారు. అది కూడా కేవలం చేతులు ఊపుకున్నారంతే. వీళ్లిద్దరూ ఏం మాట్లాడుకుంటారోనని దౌత్యవేత్తలు, రాజకీయ పండితులు, మీడియా.. అంతా ఎదురుచూశారు. కానీ ఇద్దరి మధ్య నిశ్శబ్దమే రాజ్యమేలింది.
కశ్మీర్ సమస్యను కేవలం భారత్, పాక్ రెండు దేశాలు మాత్రమే కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకోవాలని భారతదేశం భావిస్తుంటే, పాక్ మాత్రం పదేపదే పలు అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాన్ని ప్రస్తావిస్తోంది. దాంతో మోదీ సర్కారు తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఐక్యరాజ్యసమితి సదస్సులో కలిసినప్పుడు కూడా ముందుగా షరీఫే చెయ్యి ఊపారు. దానికి సమాధానంగా మోదీ కూడా చెయ్యి ఊపి సరిపెట్టారు. ఇద్దరూ వాల్డ్రాఫ్ ఆస్టోరియా అనే ఒకే హోటల్లో బస చేసినా, కనీసం కలిసే ప్రయత్నాలు కూడా జరగలేదు. జూలై నెలలో రష్యాలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు సందర్భంగా ఇద్దరు నేతలు చేతులు కలుపుకొన్నప్పుడు చాలా మంది చాలా ఆశించారు. కానీ తర్వాత మాత్రం అదేమీ జరగలేదు. ఇరు దేశాల మధ్య జాతీయ భద్రతా సలహాదారు స్థాయిలో జరగాల్సిన సమావేశం కూడా జరగలేదు. కశ్మీర్ వేర్పాటువాదులను పాక్ ప్రోత్సహించడంతో ఈ భేటీ రద్దయింది. ఇక తర్వాతి రోజుల్లో రెండు దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయోనని అంతర్జాతీయ పరిశీలకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.