సూపర్ ఎర్త్‌ను గుర్తించిన కెప్లర్ మిషన్
* భూమికి 180 కాంతి సంవత్సరాల దూరంలో హెచ్ఐపీ 116454బీ
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన కెప్లర్ అంతరిక్ష నౌక కొత్త మిషన్‌లో ఓ సూపర్ ఎర్త్‌ను గుర్తించింది. ఈ సూపర్ ఎర్త్ భూమికి సుమారు 180 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ గ్రహాన్ని హెచ్ఐపీ 116454బీగా పిలుస్తున్నారు. దీని వ్యాసార్థం భూమికంటే రెండున్నర రెట్లు ఎక్కువ కాగా.. బరువు భూమికంటే 12 రెట్లు ఎక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ రకమైన గ్రహం మన సౌర వ్యవస్థలో లేదని పేర్కొం టున్నారు.
కేంబ్రిడ్జ్‌లోని హార్వర్డ్-స్మిత్సోనియన్ సెంటర్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్‌లో గ్రాడ్యుయేట్ విద్యార్థిగా ఉన్న ఆండ్రూ వెండర్‌బెర్గ్ కే2 మిషన్‌కు సంబంధించిన డేటాను సేకరించి ఈ సూపర్ ఎర్త్‌ను గుర్తించాడు. హెచ్ఐపీ 116454బీ ఓ నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తోందని, దీని పరిభ్రమణానికి తొమ్మిది రోజుల సమయం పడుతోందని పేర్కొన్నాడు. అయితే ఈ నక్షత్రం సూర్యుని కంటే చిన్నగా.. చల్లగా ఉందని, వేడి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ జీవులు బతకడం కష్టమని తెలిపారు.
కానరీ ద్వీపంలోని టెలిస్కోపియో నజియోనలె గెలీలియోలోని హార్ప్స్ నార్త్ స్పెక్ట్రాగ్రాఫ్ సాయంతో ఈ సూపర్ ఎర్త్ కొలతలను నిర్ధారించారు. ఈ ఏడాది మేలో ప్రారంభమైన కే2 మిషన్‌లో ఇప్పటి వరకూ 35 వేల నక్షత్రాలను పరిశీలించారు. అలాగే నక్షత్ర సమూహాలు, నక్షత్రాలు సృష్టించబడే ప్రాంతాలు, మన సౌర వ్యవస్థలోని అనేక గ్రహ శకలాలను కూడా పరిశీలించారు.