hunter arrested
-
పట్టుబడిన అడవి జంతువుల వేటగాళ్లు
వైఎస్ఆర్ జిల్లా , అట్లూరు: అడవి జంతువులను వేటాడి, భక్షించే వ్యక్తులను సిద్దవటం రేంజ్ అధికారులు సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. లంకమల్లేశ్వర అభయారణ్యం కొండూరు బీటు పరిధిలో అటవీ జంతువులను వేటాడుతున్న ఐదుగురు వేటగాళ్లను అరెస్టు చేసి, వారి నుంచి వలలు, రెండు ద్విచక్రవాహనాలు, ఒక కొండకోడిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారు బద్వేలు పట్టణం రిక్షాకాలనీకి చెందినవారిగా సమాచారం. గతంలో వీరు పలు దొంగతనాలకు పాల్పడినట్లు తెలిసింది. అట్లూరు మండలంలోని దేవనగర్ దగ్గర పొట్టేళ్లను కూడా ఎత్తుకెళ్లిన కేసులో పోలీసులు వీరికోసం గాలిస్తున్నట్లు తెలిసింది. అయితే అటవీ అధికారుల అదుపులో ఉన్న వేటగాళ్లను ఈ కోణంలో విచారించినట్లు తెలిసింది. పట్టుబడిన వారిని నేడో, రేపో కోర్టులో హాజరు పరచనున్నట్లు సమాచారం. అయితే వేటగాళ్లు వాడుతున్న ద్విచక్రవాహనాలు దొంగిలించినవా? లేక సొంత వాహనాలా ? అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. దీనిపై సిద్దవటం రేంజ్ అధికారి ప్రసాద్‌ను ‘సాక్షి’వివరణ కోరగా వేటగాళ్లు పట్టుబడిన విషయం వాస్తవమేనని తెలిపారు. విచారణ చేస్తున్నామని పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలపారు. -
వన్యప్రాణుల వేటగాళ్ల అరెస్ట్
సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్లోని పెనుబల్లి మండలం భవన్నపాలెం సమీపంలోని నీలాద్రి అడవుల్లో వేటగాళ్లను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా, నీలాద్రీశ్వర ఆలయ సమీపంలో రోడ్డుపై స్కార్పియో వాహనం కంటపడింది. సమీపంలోనే అడవిలో వెలుతురు కనిపించడంతో అక్కడికి వెళ్లిన ఫారెస్టు అధికారులకు మృతి చెందిన చుక్కల దుప్పి, పక్కనే ఇద్దరు తుపాకీతో కన్పించారు. దీంతో నిందితులైన పెనుబల్లి మండలం భవన్నపాలెం, బీజేఆర్ క్యాంప్‌లో డ్రైవర్.. షూటింగ్ ఎక్స్పర్ట్ అయిన సాధం శ్రీనివాసరావు, కృష్ణాజిల్లా మైలవరం, రైస్‌మిల్లులో వర్కర్ సోమవరం చిట్టిబాబులను అదుపులోకి తీసుకొని సత్తుపల్లి పోలీసులకు అప్పగించారు. సంఘటనా స్థలంలో దుప్పి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, సత్తుపల్లి శివారులో వన్యప్రాణులను వేటాడేందుకు విద్యుత్ తీగలు అమర్చుతున్న కూరాకుల రామారావు, జల్లిపల్లి విజయ్‌కుమార్, ముడియం తిరుపతిరావులను బుధవారం అదుపులోకి తీసుకున్నారు.