Fund Review: పెట్టుబడులకు రాబడితోపాటు విలువ
ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర అస్థిరతలు చూస్తున్నాం. భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు, పెరిగిపోయిన కమోడిటీ ధరలు, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు అన్నీ కలసి ఈక్విటీ మార్కెట్లు ప్రతికూల పరిస్థితులను చూస్తున్నాయి. వడ్డీ రేట్ల పెంపే సెంట్రల్ బ్యాంకుల అస్త్రంగా కనిపిస్తోంది. కరోనా సమయంలో ఇచ్చిన ఉద్దీపనలను కూడా వెనక్కి తీసుకుంటున్నాయి. ఇవన్నీ ఈక్విటీలకు ప్రతికూలతలే. కనుక సమీప భవిష్యత్తులో మార్కెట్లు ఎలా స్పందిస్తాయన్నది ఎవరూ ఊహించలేరు. దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ తరహా ప్రతికూల పరిస్థితులు అనుకూలం. ఈ దశలో వ్యాల్యూ ఫండ్స్‌ను పరిశీలించడం మెరుగైన ఆప్షన్ అవుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ విభాగంలో సుదీర్ఘ చరిత్ర ఉన్న ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వ్యాల్యూ డిస్కవరీ ఫండ్‌ను పరిశీలించొచ్చు.
పెట్టుబడుల విధానం..
2020 వరకు వ్యాల్యూ ఇన్వెస్టింగ్ అంత ఆకర్షణీయంగా లేదు. 1988–89, 2007–2008 కాలంలోనూ ఇంతే. కానీ, 2020 సంక్షోభం అనంతరం వ్యాల్యూ పెట్టుబడుల విధానానికి తిరిగి ఆకర్షణీయత ఏర్పడింది. వడ్డీ రేట్లు పెరిగే తరుణం కనుక ఖరీదైన వ్యాల్యూషన్లతో ఉన్న స్టాక్స్‌లో పెట్టుబడి రిస్క్ అవుతుంది. ఈ తరుణంలో చౌక వ్యాల్యూషన్లలో ఇన్వెస్ట్ చేసే వ్యాల్యూ ఫండ్స్ ఆకర్షణీయంగా ఉంటాయి. చారిత్రకంగా వాటి పనితీరుతో పోలిస్తే తక్కువ వ్యాల్యూషన్ల వద్దనున్న స్టాక్స్‌ను గుర్తించి ఈ పథకం పెట్టుబడులు పెడుతుంది. అంతేకాదు, పుస్తక విలువ, క్యాష్ ఫ్లో సామర్థ్యాలను కూడా ఫండ్ పరిశోధన బృందం చూస్తుంది. ఈ సామర్థ్యాల బలంతోనే ఈ పథకం వ్యాల్యూ విభాగంలో దీర్ఘకాలంగా ఇన్వెస్టర్ల పెట్టుబడులకు మంచి విలువను తెచ్చి పెడుతోంది.
రాబడులు
వ్యాల్యూ థీమ్ ఆధారంగా ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వారికి ఫండ్ ఎంపిక కీలకం అవుతుంది. దీనిపైనే భవిష్యత్తులో మెరుగైన రాబడులన్నవి ఆధారపడి ఉంటాయి. వ్యాల్యూ విభాగంలోనే అని కాదు, మొత్తం ఈక్విటీ మ్యచువల్ ఫండ్స్‌లోనే ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వ్యాల్యూ డిస్కవరీ ఫండ్ పనితీరు ప్రమాణాలకు తగ్గకుండా ఉండడాన్ని ఇన్వెస్టర్లు గమనించొచ్చు. అదిపెద్ద వ్యాల్యూ ఫండ్ కూడా ఇదే. దీని నిర్వహణలో రూ.23,149 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడి 23 శాతంగా ఉంది. మూడేళ్లలో వార్షికంగా 20 శాతం చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని తెచ్చిపెట్టింది. ఇక ఐదేళ్ల కాలంలో వార్షికంగా 13 శాతం, ఏడేళ్లలో 12 శాతం, పదేళ్లలో 18 శాతం చొప్పున రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. 2004 ఆగస్ట్‌లో ఈ పథకం ఆరంభమైంది. నాటి నుంచి చూసుకుంటే వార్షికంగా ఇచ్చిన రాబడి 20 శాతం. ఆరంభంలో రూ.10 లక్షలు ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈ 18 ఏళ్లలో ఆ మొత్తం రూ.2.5 కోట్లు అయి ఉండేది. కనీసం ఆరంభం నుంచి ప్రతి నెలా రూ.10,000 చొప్పున సిప్ వేసుకుంటూ వచ్చినా.. రూ.1.1 కోట్ల సంపద సమకూరేది. కానీ, అదే కాలంలో నిఫ్టీ 500లో అదే రూ.10,000 సిప్ రూ.72 లక్షలు అయి ఉండేది.
పోర్ట్‌ఫోలియో..
పస్త్రుతం తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 91.4 శాతాన్నే ఈక్విటీలకు కేటాయించింది. 1.9 శాతం డెట్‌లో పెట్టుబడులు పెట్టగా, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. అంతేకాదు ఈక్విటీల్లోనూ 81 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్ కంపెనీలకే కేటాయించింది. 14 శాతాన్ని మిడ్‌క్యాప్ కంపెనీల్లో పెట్టుబడిగా పెట్టింది. స్మాల్‌క్యాప్ పెట్టుబడులు 5 శాతంగా ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 60 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల్లో 18 శాతాన్ని బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు, 17 శాతాన్ని ఇంధనరంగ కంపెనీలకు, నిర్మాణ రంగ కంపెనీలకు 13 శాతం, హెల్త్‌కేర్ కంపెనీలకు 12 శాతం చొప్పున కేటాయింపులు చేసింది.
చదవండి: కల్లోలంలో కుదురుగా ఉంటేనే..!