చెన్నైలో మండుతున్న ఎండలు
- సముద్రపు గాలి రాకలో ఆలస్యం
- ఎల్‌నినో కారణమంటున్న వాతావరణ కేంద్ర నిపుణులు
ప్యారిస్: చెన్నై సహా రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా చెన్నై నగరంలో 1948లో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్‌ను ప్రస్తుత ఎండలు సమీపిస్తున్నాయి. కొన్నేళ్లకంటే ఈ ఏడాది మే, జూన్ నెలల్లో ఉష్ణోగ్రత అధికమైనట్లు వాతావరణ నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి ఏటా అగ్ని నక్షత్ర ఎండా కాలం మే నెలలో 24 రోజులు ఉంటుంది. ఇందులో మే నెల లో 15, 16 తేదీల్లో ఉష్ణోగ్రత భారీ స్థాయికి చేరుకుంటుంది.
ఈ ఏడాది ఆ రోజుల్లో ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. ఆ తర్వాత ఎండలు కొంత తగ్గా యి. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు ప్రాం తాల్లో ఎండలు కాస్త తగ్గుముఖం పట్టి వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాల రాకతో కన్యాకుమారి, తిరునల్వేలి, కోయంబత్తూరు జిల్లాల్లో వర్షాలు కురి శాయి. దీంతో ఆయా జిల్లాల్లో ఉష్ణోగ్రత కొంత తగ్గింది. సాధారణగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో నైరుతీ రుతు పవనాలు వీస్తారు. తద్వారా వర్షాలు కురిసి ఎండలు తగ్గుముఖం పడతాయి. ఈ ఏడాది అందుకు విరుద్ధంగా ఎండ వేడిమి అధికమైంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల వర్షాలు తక్కువగానే కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలుపుతోంది.
చెన్నైలో: చెన్నైకు సంబంధించినంత వరకు 1948లో అత్యధికంగా 43.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ తర్వాత 2012లో 42.4 డిగ్రీలు, 2013లో 39.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ ఏడాదిలో గత నెలలో 42 డిగ్రీలు, ఈ నెలలో 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అత్యధికంగా నమోదైంది. సాధారణ స్థాయికంటే నాలుగు డిగ్రీల సెల్సియస్ అధికంగా కని పిస్తోంది. నగరంలో ఎండలు రోజు రోజు కూ పెరిగిపోతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అలాగే నెల్లై, మదురై, తిరుచ్చి, వేలూర్ వంటి నగరాల్లో కూడా ఎండల తీవ్రత పెరుగుతోంది. కొన్ని రోజులుగా మదురై, తిరుచ్చి, వేలూర్‌లో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకుంది. కన్యాకుమారి, కోవై జిల్లాల్లో సాధారణ స్థితి కంటే ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదవుతోంది.
పుదుచ్చేరిలో: పుదుచ్చేరిలో 2012లో 43.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది 41 డిగ్రీల ఎండ కాస్తోంది. ఇదే స్థితి కొనసాగితే గత ఏడాది కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత పెరుగుదల గురించి చెన్నై వాతావరణ కేంద్ర డెరైక్టర్ రామన్ మాట్లాడుతూ పశ్చిమ దిశలో గాలి అధికంగా వీస్తుండడంతో సముద్రపు గాలి రావడంలో ఆలస్యం ఏర్పడుతోందన్నారు. దీంతో ఉష్ణోగ్రత స్థాయి పెరుగుతోందన్నారు.
ఎల్‌నినో కారణం: పసిఫిక్ సముద్రంలోని నీటి ప్రవాహంలో ఉష్ణోగ్రత (ఎల్‌నినో) అధికం కావడమే ఉష్ణోగ్రత పెరగడానికి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీని గురించి వాతావరణ శాఖ అధికారి విజయ్‌కుమార్ మాట్లాడుతూ ఎల్‌నినో కారణంగా ఉష్ణోగ్రత పెరుగుతుందన్నారు.