‘సర్జికల్’ షాక్‌లోనే పాకిస్తాన్
ఆపరేషన్ మత్తు నుంచి ఇంకా కోలుకోలేదు
- హనుమంతుడి లా జవాన్లకు తమ శక్తేంటో తెలిసింది: పరీకర్
- ఎల్వోసీ వెంట మళ్లీ కాల్పులకు తెగబడ్డ పాక్ బలగాలు
- సర్జికల్ దాడుల నేపథ్యంలో రాష్ట్రపతితో ప్రధాని భేటీ
డెహ్రాడూన్: భారత సర్జికల్ దాడుల షాక్ నుంచి పాకిస్తాన్ ఇంకా తేరుకోలేదని, ఆపరేషన్ పూర్తయినా పాకిస్తాన్ ఇంకా మత్తులోనే ఉందని రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ అన్నారు. హనుమంతుడు తన శక్తిని గుర్తించినట్లు ఈ దాడులతో భారత సైన్యం తమ సామర్థ్యాన్ని తెలుసుకుందని పేర్కొన్నారు. శనివారం ఉత్తరాఖండ్‌లో స్వాతంత్య్ర సమరయోధుడు వీర్‌చంద్రసింగ్ గర్వాల్ విగ్రహావిష్కరణ సభలో పరీకర్ మాట్లాడుతూ... దాడులు పూర్తయిన రెండ్రోజుల అనంతరం కూడా ఏం జరిగిందో తెలియని పరిస్థితిలో పాక్ ఉందన్నారు. అనస్తీసియా(మత్తు)లో ఉన్న రోగికి ఆపరేషన్ పూర్తయ్యాక కూడా ఆ విషయం తెలియట్లే... సర్జికల్ దాడుల అనంతరం పాక్ పరిస్థితి అలా ఉందని చమత్కరించారు.
భారత్ శాంతినే కోరుకుంటుందని, రెచ్చగొట్టకుండా దాడులు చేయదని అన్నారు. ‘ప్రతీకారం తీర్చుకునే సత్తా భారత దళాలకు ఉందన్న విషయాన్ని పాక్‌కు చెప్పడానికే దాడులు చేశారు. హనుమంతుడి శక్తుల గురించి జాంబవంతుడు చెప్పాక ఒక్క అంగలో సముద్రాన్ని దూకిన విషయం మన సైనికులకూ వర్తిస్తుంది. సర్జికల్ దాడులకు ముందు హనుమంతుడి వలే తమ సామర్థ్యం గురించి సైనికులకు తెలియదు’ అని పేర్కొన్నారు. దాడుల అనంతరం పాక్ గందరగోళంలో ఉందని, ఎలా స్పందించాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. కాగా, ఈ దాడుల నేపథ్యంలో ప్రధాని మోదీ... శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని ట్వీట్ చేశారు. వారి మధ్య ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయో మాత్రం తెలియలేదు.
కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన
భారత సైనిక శిబిరాలు, జనావాసాలే ల క్ష్యంగా పాక్ దళాలు శనివారం కాల్పులకు తెగబడ్డాయి. మోర్టార్ బాంబులు, భారీ మెషిన్ గన్స్‌తో జమ్మూ కశ్మీర్‌లోని అక్నూర్ తాలుకాలో ఎల్వోసీ వెంట 3 గంటలకు పైగా కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఎలాంటి నష్టం జరగలేదని ఆర్మీ పేర్కొంది. తెల్లవారుజాము 3.30 గంటలకు ప్రారంభమైన కాల్పులు 6 గంటల వరకూ కొనసాగాయంది. అక్నూర్ తాలూకా పల్లాన్‌వాలా సెక్టార్, చాంబ్ ప్రాంతాల్లో విచక్షణారహితంగా కాల్పులు జరిపారని, బడూ, చనూ గ్రామాలపై కూడా కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల గ్రామస్తులు పశువులు, ఇళ్లను చూసుకునేందుకు తిరిగి రాగా... వారిని లక్ష్యంగా చేసుకుని భారీ ఎత్తున కాల్పులు జరిపారని పోలీసులు వెల్లడించారు. గత నాలుగు రోజుల వ్యవధిలో ఐదో సారి పాక్ కాల్పుల విర మణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
భారత్ నిజాన్ని దాస్తోంది: పాకిస్తాన్
పీవోకేలో భారత్ దాడుల సందర్భంగా ఆ దేశ సైనికులు మరణించారని పాక్ మళ్లీ పేర్కొంది. నష్టాన్ని భారత్ దాస్తోందని పాక్ ఆర్మీ ప్రతినిధి అసిమ్ సలీం బజ్వా ఆరోపించారు. భారత దాడుల్ని తమ దళాలు తిప్పికొట్టాయన్నారు.
సరిహద్దుల్లో దల్బీర్
సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ ఉత్తర, పశ్చిమ కమాండ్ బేస్ల్ని శనివారం సందర్శించారు. నార్తర్న్ కమాండ్ ప్రధాన కార్యాలయంలో శనివారం ఉన్నతస్థాయి భేటీ నిర్వహించారు. సరిహద్దు వెంట యుద్ధ సన్నద్ధతను సమీక్షించారు. పీవోకేలోని ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేసిన సైనికులు, అధికారుల్ని వ్యక్తిగతంగా అభినందించారు.