‘నోట్ల రద్దు’ ముగిసినట్లే కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ
లండన్ : భారత్‌లో నోట్ల రద్దు ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని, ప్రపంచంలోనే సజావుగా సాగిన పెద్ద నోట్ల మార్పిడి ఇదేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక లండన్ స్కూలు ఆఫ్ ఎకనామిక్స్ విద్యా సంస్థలో శనివారం విద్యార్థులు, అధ్యాపకుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ... అధిక వృద్ధి రేటును సాధించేందుకు నోట్ల రద్దు నిర్ణయం దోహద పడుతుందని చెప్పారు. నగదు మారకంపై ఆధారపడ్డ భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు డిజిటల్‌కు మారిందని జైట్లీ పేర్కొన్నారు.
నోట్ల రద్దుతో బ్యాంకింగ్ వ్యవస్థలోకి అధిక నగదు చేరిందని, ఇది ఆదాయ ఉత్పత్తికి దారి తీస్తుందని చెప్పారు. అలాగే దీర్ఘకాలంలో అధిక జీడీపీ వృద్ధికి సాయపడుతుందన్నారు. ఈ సందర్భంగా వేల కోట్ల రుణ ఎగవేతదారు విజయ్ మాల్యాను పరోక్షంగా ప్రస్తావిస్తూ జైట్లీ ప్రసంగించారు. బ్రిటన్ లో ప్రజాస్వామ్యం మరింత ఉదారంగా... రుణ ఎగవేతదారులు తలదాచుకునే దేశంగా ఉందని వ్యాఖ్యానించారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని చెల్లించకుండా... లండన్ వచ్చి తలదాచుకోవచ్చని చాలామంది అనుకుంటున్నారని, ఆ నమ్మకాన్ని పటాపంచలు చేయాలని జైట్లీ అభిప్రాయపడ్డారు.