పరిశ్రమలు.. జూలైలో జూమ్!
పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు 4.2%
- తయారీ, కేపిటల్ గూడ్స్ రంగాల దన్ను
న్యూఢిల్లీ: భారత పారిశ్రామిక ఉత్పత్తి జూలై గణాంకాలు కూడా ఉత్సాహాన్ని అందించాయి. ఈ నెలలో ఉత్పత్తి వృద్ధి రేటు 4.2 శాతంగా నమోదయ్యింది. అంటే 2014 జూలై పారిశ్రామిక ఉత్పత్తి విలువతో పోల్చితే... 2015 జూలైలో ఉత్పత్తి విలువ 4.2 శాతం అధికంగా ఉన్నదన్నమాట. 2014 జూలైలో ఈ రేటు 0.9 శాతం మాత్రమే. 2015 జూన్‌లో 4.4 శాతం. అంటే వార్షికంగా చూస్తే వృద్ధి రేటు పెరిగినా- నెలవారీగా తగ్గింది.
పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో దాదాపు 75 శాతం వాటా కలిగిన తయారీ రంగం, అలాగే వ్యవస్థలో పెట్టుబడులను, డిమాండ్‌ను సూచించే కేపిటల్ గూడ్స్ రంగాలు మంచి ఫలితాలను సాధించడం మొత్తం గణాంకాలను తగిన స్థాయిలో నిలిపాయి. కాగా ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో (2015-16, ఏప్రిల్-జూలై)లో ఐఐపీ వృద్ధి రేటు 3.6 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గింది (2014-15, ఏప్రిల్-జూలైతో పోల్చి). కేంద్ర గణాంకాల కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, రంగాల వారీగా వివరాలు...
తయారీ: ఈ రంగం 2014 జూలైలో అసలు వృద్ధిలేకపోగా -0.3% క్షీణతను నమోదుచేసుకుంది. అయితే 2015 జూలైలో భారీగా 4.7 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. తయారీ రంగంలోని మొత్తం 22 విభాగాల్లో 12 సానుకూల ఫలితాన్ని నమోదుచేసుకున్నాయి. కాగా నాలుగు నెలల కాలంలో ఈ రంగం వృద్ధి రేటు 2.8% నుంచి 4%కి ఎగసింది.
కేపిటల్ గూడ్స్: ఈ రంగం కూడా - 3 శాతం క్షీణత నుంచి భారీగా 10.6 శాతం వృద్ధి బాటకు మళ్లింది.
మైనింగ్: జూలైలో వృద్ధి 0.1 శాతం నుంచి 1.3 శాతానికి ఎగియగా, నాలుగు నెలల్లో ఈ రేటు 2.3 శాతం నుంచి 0.6 శాతానికి పడింది.
విద్యుత్: వృద్ధి రేటు 11.7 శాతం నుంచి 3.5 శాతానికి దిగింది. నాలుగు నెలల్లో కూడా ఈ రేటు 11.4% నుంచి 2.6 శాతానికి చేరింది.
వినియోగ వస్తువుల ఉత్పత్తి: -5.9 శాతం క్షీణబాట నుంచి 1.3 శాతం వృద్ధి బాటకు మళ్లింది.
రేట్లు తగ్గిస్తే మరింత వృద్ది
‘జూన్‌కన్నా జూలై వృద్ధి రేటు తక్కువగా ఉంది. సెప్టెంబర్ 29 పాలసీ సమీక్ష సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటు తగ్గిస్తే- వృద్ధి మరింత వేగం పుంజుకుంటుంది. ధరల పెరుగుదల స్పీడ్ తక్కువగా ఉండడం కూడా ఇందుకు దోహదపడే అంశం’ అని అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ వ్యాఖ్యానించారు.
గ్రోత్ ఇంజన్ ‘తయారీ’: కేంద్రం
తయారీ రంగం భారత్ పారిశ్రామిక ఉత్పత్తికి సంబంధించి గ్రోత్ ఇంజన్ కానుందని ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఐఐపీ, క్యాడ్, ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి స్థూల ఆర్థిక అంశాలు భారత్ స్థిర వృద్ధి తీరుకు సంకేతంగా నిలుస్తున్నట్లు ప్రకటన విశ్లేషించింది. కాగా వృద్ధి పటిష్టతకు తాజా ఐఐపీ గణాంకాలు అద్దం పడుతున్నాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్ ట్వీట్ చేశారు.