ఈ నెల 9న బీమా ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మె
బీమా సవరణ బిల్లుకు నిరసనగా
ముంబై: బీమా బిల్లుకు నిరసనగా ఈ నెల 9న బీమా ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఒక రోజు సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెలో నాలుగు ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థ ఉద్యోగులతో పాటు ఎల్ఐసీ ఉద్యోగులు కూడా పాల్గొననున్నారు. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ)పరిమితిని ప్రస్తుతమున్న 26 శాతం నుంచి 49 శాతానికి పెంచే బీమా బిల్లు గురువారం లోక్సభ ఆమోదం పొందింది. ఈ బిల్లు కారణంగా మరిన్ని విదేశీ బీమా సంస్థలు వస్తాయని, ప్రైవేట్ రంగ కంపెనీలకే ప్రయోజనం కలుగుతుందని భారతీయ విమా కామసాగర్ సేన(బీవీకేఎస్) అధ్యక్షుడు శరద్ జాదవ్ చెప్పారు.
ప్రభుత్వ రంగంలోని 4 సాధారణ బీమా సంస్థలు పోటీపడి భారీ డిస్కౌంట్ల ఇవ్వ డం ద్వారా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నాయని, వీటిన్నింటినీ విలీనం చేయాలని కూడా యూనియన్ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇలా చేస్తే ఏడాదికి రూ.1,000 కోట్లు ఆదా అవుతాయని వారంటున్నారు. బీమా రంగంలో ఎఫ్డీఏ పెంపు వల్ల బీమా అందరికీ అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం మోసం చేస్తోందని ఆల్ ఇండియా ఎల్ఐసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పేర్కొంది. 26% ఎఫ్డీఐలు ఉన్నప్పటికీ, బీమా విస్తరణ 2009 నుంచి తగ్గుతోందని తెలిపింది.