Iru mugan
-
రూ.100 కోట్ల దిశగా మరో సినిమా
చియాన్ విక్రమ్ తాజా చిత్రం ‘ఇరుమురుగన్’ రూ. వంద కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద రూ. 90 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమా భారీ కలెక్షన్లు కొల్లగొట్టడం విశేషం. ఆదివారం నాటికి ఈ సినిమా రూ.90.07 కోట్ల కలెక్షన్లు సాధించిందని సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్ రమేశ్ బాల వెల్లడించారు. వంద కోట్ల క్లబ్ లో ఈ చిత్రం చేరే అవకాశాలున్నాయని ఆయన అంచనా వేశారు. విక్రమ్ సినిమాల్లో అత్యధిక ఆరంభ వసూళ్లు సాధించిన రెండో చిత్రం ‘ఇరుమురుగన్’ అని నిర్మాత శిబు తమీన్స్ తెలిపారు. గతేడాది శంకర్, విక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఐ’ సినిమా అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టింది. సై-ఫై థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘ఇరుమురుగన్’ లో విక్రమ్ డ్యుయల్ రోల్ లో నటించాడు. రా ఏజెంట్, హిజ్రా సెంటిస్ట్ గా డిఫరెంట్ గా కనిపించాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమ్ సరసన నయనతార, నిత్యామీనన్ నటించారు. #Chiyaan - #Nayanthara 's #IruMugan in Tamil and Tel grosses 90 Crs till Sun.. Will enter 100 cr club this week.. pic.twitter.com/RiWPa4yzNu — Ramesh Bala (@rameshlaus) 20 September 2016 -
8న తెరపైకి ఇరుమురుగన్
ఇరుమురుగన్.. ప్రస్తుతం భారీ అంచనాలను సంతరించుకున్న చిత్రం ఇదేనని చెప్పవచ్చు. కారణం వైవిధ్యం కోసం తపించే నటుడు సియాన్ విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం ఇరుముగన్. ఈయన పలు చిత్రాల్లో పలు గెటప్‌లలో కనిపించి అలరించినా తొలిసారిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ఇదే అవుతుంది. ఐ చిత్రం అందరిని ఆశ్చర్య పరచినా, ఆ తరువాత నటి0చిన 10 ఎండ్రదుకుళ్ చిత్రం విక్రమ్‌ను నిరాశపరచిందనే చెప్పాలి. దీంతో చాలా కసిగా చేసిన చిత్రం ఇరుముగన్. ఇక లేడీ సూపర్‌స్టార్ నయనతారతో కలిసి నటించిన మొదటి చిత్రం ఇదే. ఇందులో మరో నాయకిగా నిత్యామీనన్ నటించారు. నాజర్, తంబిరామయ్య, బాలా, మనో, ప్రతాప్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అరిమనంబి చిత్రం ఫేమ్ ఆనంద్‌శంకర్ దర్శకుడు. కాగా ఇంతకు ముందు విజయ్ హీరోగా రూపొందిన పులి చిత్ర నిర్మాతల్లో ఒకరైన శిబు తమీన్స్ నిర్మించిన భారీ చిత్రం ఇరుముగన్. హారీష్ జయరాజ్ సంగీతాన్ని, ఆర్డీ.రాజశేఖర్ చాయాగ్రహణం అందించిన ఈ చిత్రంలో మరో ప్రత్కేక అంశం నటుడు విక్రమ్ హిజ్రా తరహా పాత్రలో విలనీయం ప్రదకర్శించడం. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సోమవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఇరుముగన్ చిత్రానికి యూఏ సర్టిఫికెట్‌ను ఇచ్చారు. దీంతో చిత్రానిన్ని సెప్టెంబర్ 8వ తేదీన విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. -
తెలుగులోనూ భారీగా..!
చాలా రోజులుగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న విలక్షణ నటుడు విక్రమ్, ప్రయోగాలను మాత్రం ఆపటం లేదు. ప్రస్తుతం ఇరుముగన్ పేరుతో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ డ్రామాలో హీరోగా విలన్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి తెలుగు మార్కెట్‌ను టార్గెట్ చేసిన విక్రమ్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా ప్రమోట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. తెలుగులో ఇంకొకడు పేరుతో విడుదలవుతున్న ఈ సినిమా ఆడియో వేడుకను గ్రాండ్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు 15న హైదరాబాద్‌లోని జెఆర్సి కన్వెన్షన్ సెంటర్లో పలువురు తెలుగు తమిళ సినీ ప్రముఖుల సమక్షంలో ఈ సినిమా ఆడియోను గ్రాండ్ రిలీజ్ చేయనున్నారు. నయనతార, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తుండగా ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. -
సెంటిమెంట్‌ను నమ్ముకున్న విక్రమ్
చాలా రోజులుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న విలక్షణ నటుడు విక్రమ్ మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇరుముగన్ సినిమాలో హీరోగా విలన్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. తన క్యారెక్టర్ లుక్ విషయంలో ఎన్నో ప్రయోగాలు చేసే ఈ స్టార్ హీరో ఈ సారి విలన్ పాత్ర కోసం హిజ్రాగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ సాధించాలని భావిస్తున్న విక్రమ్, ఓ సెంటిమెంట్ మీద నమ్మకం పెట్టుకున్నాడు. తమిళ నాట.. హీరోగా విలన్‌గా ఒకే నటుడు నటించిన సినిమాలన్ని ఘనవిజయం సాధించాయి. అజిత్ నటించిన వాలి, రజనీ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన రోబో, కమల్ హాసన్ దశావతారం లేటెస్ట్గా సూర్య 24 సినిమాలు ఈ సెంటిమెంట్‌కు మరింత బలం చేకూర్చాయి. ఇప్పుడు ఇదే జానర్లో వస్తున్న ఇరుముగన్ కూడా సక్సెస్ సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు విక్రమ్. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
ఇరు ముగన్ : అఫిషియల్ ట్రైలర్ యూట్యూబ్‌లో ‘కబాలి’ తర్వాత ఆ స్థాయిలో ఇప్పుడు ‘ఇరు ముగన్’ చిత్రం హిట్ల మీద హిట్లు కొడుతోంది! ఇరు ముగన్ అంటే రెండు ముఖాలు అని అర్థం. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ తమిళ్ సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ థ్రిల్లర్‌లో విక్రమ్, నయనతార, నిత్యామీనన్ నటిస్తున్నారు. సంగీతం హ్యారిస్ జయరాజ్. ఈ చిత్రంపై నిర్మాతలు భారీ అంచనాలు పెట్టుకున్నారు. జయా టీవీ ఇప్పటికే శాటిలైట్ హక్కులను తన్నుకుపోయింది. గత ఏడాది డిసెంబరులో చిత్రం షూటింగ్ ప్రారంభం అయినప్పటికీ పర్ఫెక్షన్ కోసం దర్శక, నిర్మాతలు చేస్తున్న ప్రయత్నాలు విడుదలను జాప్యం చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. హాలీవుడ్ తరహాలో అనుక్షణం ఉత్కంఠను కలిగిస్తూ, మధ్య మధ్య మధురమైన ప్రేమ సన్నివేశాలతో ఇరు ముగన్ గిలిగింతలు పెట్టబోతోందని ఈ ట్రైలర్‌ని చూస్తే అర్థమౌతోంది. నిడివి : 2 ని. 17 సె. హిట్స్ : 41,99,362 బ్రిట్నీ స్పియర్స్ : మేక్ మీ వీడియో సాంగ్ నిడివి : 4 ని. 53 సె. హిట్స్ : 49,33,788 అమెరికన్ పాప్ గాయని బ్రిట్నీ స్పియర్స్ ఈ నెల 26న విడుదల చేయబోతున్న తొమ్మిదవ స్టుడియో ఆల్బమ్‌లోని లీడ్ సాంగ్ ‘మేక్ మీ..’ రెండు రోజుల క్రితమే యూట్యూబ్‌లోకి అప్లోడ్ అయింది. పాటను బ్రిట్నీతో పాటు మ్యాథ్యూ బర్న్, జో జనైక్, గెరాల్డ్ గిల్లమ్ కలిసి ఉమ్మడిగా రాశారు. ‘ ఐ యామ్ డ్రీమింగ్ ఎ మైల్ ఎ మినిట్ అబౌట్ సమ్‌బడీ... దిస్ ఫీలింగ్, ఐ వానా గో విత్ ఇట్, కాస్ దేర్ ఈజ్ నో వే... అంటూ మొదలయ్యే మేక్ మీ సాంగ్... ‘మై హార్ట్ ఈజ్ ఆన్ ఫైర్ వెన్ యు ఆర్ అరౌండ్.. మేక్ మీ ఊ ఊ ఊ ఊ... యా, యూ మేక్ మీ ఊ ఊ’’ అని ముగుస్తుంది. యువతరంలో సున్నితమైన భావోద్వేగాలను ప్రేరేపిస్తున్న ఈ వీడియో సాంగ్ ప్రస్తుతానికైతే యు.ఎస్.బిల్బోర్డ్ హాట్ 100 చార్ట్‌లో 17వ స్థానంలో ఉంది. చార్ట్లదేముంది? మన హార్ట్‌లో నెంబర్ వన్‌గా నిలిచిపోయే పాట... మేక్ మీ. -
సామి సీక్వల్లో విక్రమ్
కొంత కాలంగా ప్రయోగాత్మక చిత్రాలు మాత్రమే చేస్తూ వస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్, త్వరలో ఓ మాస్ మసాలా ఎంటర్టైనర్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో విక్రమ్ హీరోగా సామి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన హరి దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం సూర్య హీరోగా సింగం సినిమాకు రెండో సీక్వల్‌ను రూపొందిస్తున్న హరి, విక్రమ్ హీరోగా కూడా సీక్వల్నే రూపొందించే ఆలోచనలో ఉన్నాడు. ఇటీవల విక్రమ్ హీరోగా తెరకెక్కిన ఇరుముగన్ సినిమా ఆడియో ఫంక్షన్లో పాల్గొన్న డైరెక్టర్ హరి, త్వరలోనే విక్రమ్‌తో సినిమా చేయనున్నట్టుగా ప్రకటించారు. ప్రస్తుతం సింగం 3ని రూపొందిస్తున్న ఈ దర్శకుడు విక్రమ్‌తో సామి సినిమాకు సీక్వల్‌ను రూపొందిస్తానని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ చాలా కాలం కిందే మొదలవ్వాల్సి ఉన్నా.. వాయిదా పడుతూ వచ్చిందని.. త్వరలోనే మొదలవుతుందని తెలిపారు. -
విక్రమ్ 'ఇరుముగన్' ఆడియో లాంచ్
-
షాక్ ఇస్తున్న విక్రమ్ లుక్స్
ప్రయోగాత్మక చిత్రాలతో కూడా భారీ కమర్షియల్ సక్సెస్ లు సాధించొచ్చని నిరూపించిన సౌత్ హీరో విక్రమ్. శివపుత్రుడు, అపరిచితుడు లాంటి సినిమాలతో ఆకట్టుకున్న విక్రమ్ ఐ సినిమాతో కమర్షియల్ గా నిరాశపరిచినా.. నటుడిగా మాత్రం తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. అయితే ఐ తరువాత మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న చియాన్.. ప్రయోగాలను మాత్రం పక్కన పెట్టడం లేదు. తాజాగా విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఇరుముగన్. ఈ సినిమా కోసం మరోసారి తన క్యారెక్టర్ విషయంలో భారీ ప్రయోగాలు చేస్తున్నాడు విక్రమ్. ఈ సినిమాలో విలన్ గా, హీరోగా ద్విపాత్రాభినయం చేస్తున్న విక్రమ్, విలన్ పాత్ర కోసం సాహసం చేస్తున్నాడు. డ్రగ్స్ తయారు చేసే హిజ్రా సైంటిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు విక్రమ్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేస్తోంది. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిత్యామీనన్, నయనతారలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈసినిమాను తెలుగులో ఇంకొకడు పేరుతో రిలీజ్ చేస్తున్నారు. -
షాక్ ఇస్తున్న విక్రమ్ లుక్స్
-
మనిషి ఒక్కడే.. మొహాలు రెండు!
‘ఇరుముగన్’... అంటే రెండు మొహాలు ఉన్నవాడు అని అర్థం. విక్రమ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం టైటిల్ ఇది. సినిమా సినిమాకీ విభిన్నమైన పాత్రల్లో కనిపించి, తనలో విలక్షణ నటుడు ఉన్న విషయాన్ని విక్రమ్ నిరూపించుకున్నారు. గతేడాది విడుదలైన ‘ఐ’లో ఎవరూ ఊహించని విచిత్రమైన గెటప్‌లో కనిపించి, ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు ‘ఇరుముగన్’లో విలక్షణమైన పాత్రలో కనిపించనున్నారాయన. విక్రమ్, నయనతార, నిత్యామీనన్ ముఖ్య తారలుగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో శిబు థమీన్స్ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో విడుదల కానుంది. ఎన్కేఆర్ ఫిలింస్ పతాకంపై ‘ఇంకొక్కడు’ పేరుతో నీలం కృష్ణారెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ- ‘‘యాక్షన్, థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ రాలేదు. హై టెక్నికల్ వేల్యూస్, విజువల్ ఎఫెక్ట్స్‌తో భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రం ఇది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన టీజర్‌తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. విక్రమ్ నటన, నయనతార, నిత్యామీనన్ అందచందాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఆగస్టు 2న చెన్నైలో తమిళ వెర్షన్ పాటలు విడుదలవుతున్నాయి. తెలుగులో త్వరలో పాటలు, సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: హారీస్ జైరాజ్, కెమేరా: ఆర్. రాజశేఖర్. -
విక్రమ్ ఆడియో రిలీజ్ గెస్ట్‌గా చెర్రీ
సీనియర్ హీరోల ఆడియో ఫంక్షన్లకు గెస్ట్లుగా దాదాపు అదే జనరేషన్‌కు చెందిన సీనియర్ స్టార్లు హజరవుతారు. కానీ విక్రమ్ హీరోగా ఇరు ముగన్ సినిమాను తెరకెక్కిస్తున్న యూనిట్ సభ్యులు మాత్రం కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆడియో వేడుకను దక్షిణాదిలో వివిధ భాషలకు చెందిన యంగ్ హీరోల సమక్షంలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. తమిళనాట మంచి హిట్స్‌తో దూసుకుపోతున్న యంగ్ హీరో శివకార్తీకేయన్, విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ఇరు ముగన్ సినిమా ఆడియో రిలీజ్‌కు హాజరవుతున్నాడు. మళయాల ఇండస్ట్రీ నుంచి నవీన్ పోలి ఈ వేడుకలో పాల్గొంటుండగా టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హజరవుతున్నాడు. ఆగస్టు 2న చెన్నైలో ఈ ఆడియో ఫంక్షన్ అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
అతిథులుగా ఆ ముగ్గురు..
మూడు భాషలకు చెందిన యువ స్టార్ హీరోలు అతిథులుగా ఇరుముగన్ చిత్రం గీతాలావిష్కరణకు సిద్ధం అవుతోందన్నది తాజా సమాచారం. సియాన్ విక్రమ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఇరుముగన్. ఆయనతో తొలిసారిగా సంచలన నటి నయనతార జోడి కడుతున్నారు. మరో నాయకిగా నిత్యామీనన్ నటిస్తున్న ఈ చిత్రాన్ని పులి చిత్ర నిర్మాతలో ఒకరైన శిబు తమీన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అరిమానంబి చిత్రంతో మెగాఫోన్ పట్టి మంచి పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు ఆనంద్‌శంకర్ తెరకెక్కిస్తున్న రెండో చి త్రం ఇది. ఇటీవలే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో రెండు కోణాల్లో సాగే విభిన్న పాత్ర లో విక్రమ్ నటిస్తున్నారు. దీనిపై ఆయన చా లా ఆశలు పెట్టుకున్నారు. కారణం విక్రమ్ మంచి విజయాన్ని చూసి చాలా కాలమైంది. శంకర్ దర్శకత్వంలో నటించిన ఐ చిత్రం నటుడిగా ఆయన శ్రమకు మంచి పేరు వచ్చింది కానీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక దాని తరువాత నటించిన 10 ఎండ్రదుక్కుళ్ చిత్రం విక్రమ్‌ను పూర్తిగా నిరాశపరచింది. తాజా చిత్రం ఇరుముగన్ విజయం తథ్యం అనే నమ్మకంతో చిత్ర యూనిట్ ఉంది. ఇక ఈ చిత్రం విజయం నటుడు విక్రమ్‌కు చాలా అవసరం కూడా. హారీశ్జయరాజ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నగరంలో ఆగస్టు రెండో తేదీన భారీ ఎత్తున నిర్వహించడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఆ కార్యక్రమానికి కోలీవుడ్‌కు చెందిన యువ నటుడు శివకార్తీకేయన్, టాలీవుడ్‌కు చెందిన టాప్ హీరో రామ్‌చరణ్, మాలీవుడ్‌కు చెందిన యువ నటుడు నవీన్ పాలీ అతిథులుగా పాల్గొన్ననున్నట్లు చిత్రవర్గాలు వెల్లడించారు. వీరితో పాటు ఒక ప్రముఖ బాలీవుడ్ నటుడు విచ్చేయనున్నట్లు తెలిపారు. -
హిజ్రాగా విక్రమ్
నటుడు విక్రమ్ హిజ్రాగా నటిస్తున్నారు. ఇంతకు ముందు నటుడు శరత్‌కుమార్,రాఘవ లారెన్స్ కాంజన చిత్రంలో హిజ్రాలుగా నటించి ప్రశంసలు అందుకున్నారు.ఇప్పుడు నటుడు విక్రమ్ అలాంటి పాత్రలో న టిస్తున్నారు.10 ఎండ్రదుక్కుళ్ చిత్రం తరువాత విక్రమ్ నటిస్తున్న చిత్రం ఇరుముగన్. పులి చిత్ర నిర్మాతల్లో ఒకరైన శిబూ తమీన్స్ నిర్మిస్తున్న భారీ చిత్రం ఇది. ఆనంద్ శంకర్ కథ, కథనం,దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్ర షూటింగ్ తొలి షెడ్యూల్ మలేషియాలో పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండవషెడ్యూల్ను ప్రస్తుతం చెన్నైలోజరుపుకుంటోంది. ఇందులో విక్రమ్ ద్వీపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒకటి రా ఏజెంట్ అధికారి పాత్ర కాగా మరొకటి హిజ్రా పాత్ర అని తెలిసింది. ఈ పాత్ర కోసం శిక్షణ తీసుకుంటున్న విక్రమ్ ఇంతకు ముందు కందసామి చిత్రం కొన్ని సన్నివేశాల్లో స్త్రీగా కనిపంచారన్నది గమనార్హం. ఇరుముగన్ చిత్రం కోసం పూర్తి స్థాయి హిజ్రాగా మారుతున్నారట. ప్రస్తుతం రా ఏజెంట్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఈ షెడ్యూల్లో విక్రమ్ పాల్గొనే భారీ పోరాట సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు యూనిట్ వ ర్గాలు తెలిపారు..ఈ చిత్రం పై ఇప్పటికే పరిశ్రమ వర్గాల్లో ఆసక్తి నెలకొనడం విశేషం. -
సీక్రెట్ ఏజెంటుగా నయనతార
గ్లామర్ రోల్స్‌ను పక్కన పెట్టి ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తున్న నయనతార మరో ఆసక్తికరమైన పాత్రకు రెడీ అవుతోంది. ఇప్పటికే అనామిక, మాయ, నానుమ్ రౌడీదాన్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న నయన్, నెక్ట్స్ సినిమాలో సీక్రెట్ ఏజెంటుగా కనిపించనుంది. తమిళ్లో అజిత్ హీరోగా తెరకెక్కిన బిల్లా సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా చేసిన నయన్ చాలాకాలం తరువాత అదే తరహా పాత్రలో కనిపించనుంది. విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న ఇరు మగన్ సినిమాలో నయనతార సీక్రెట్ ఏజెంట్గానటించడానికి రెడీ అవుతోంది. అంతేకాదు ఈ సినిమాలో కొన్ని హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్‌లో నటించనుంది ఈ బ్యూటి. తొలిసారిగా నయన్ విక్రమ్‌తో జోడీ కడుతున్న ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకుడు. నిత్యామీనన్ మరో హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం మలేషియాలో జరుగుతోంది. -
'ఇరు ముగన్' ఫస్ట్ లుక్‌తో విక్రం సెన్సేషన్
విక్రం తాజా సినిమా 'ఇరు ముగన్' ఫస్ట్ లుక్ ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ పోస్టర్ తో అమాంతం అంచనాలు పెరిగిపోయాయి. సగం యంత్రం, సగం మనిషిగా వినూత్న రూపురేఖలతో విక్రం ఈ పోస్టర్లో దర్శనమిస్తున్నారు. హాలీవుడ్ సినిమాను తలపించేరీతిలో ఉన్న ఈ పోస్టర్ ను చిత్ర యూనిట్ ఆదివారం అర్ధరాత్రి దాటాక విడుదల చేసింది. ఆనంద్ శంకర్ రచన-దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్రం సరసన నయనతార, నిత్య మేనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ డిసెంబర్లో ప్రారంభమైంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న విక్రం ఎన్నో ఆశలు పెట్టుకొని నటిస్తున్న సినిమా 'ఇరుముగన్'. మరోసారి తన విలక్షణ పంథాతోనే అభిమానులను ఆకట్టుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వాస్తవానికి ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉండగా.. తరచూ నిర్మాతలు మారడంతో ఆఖరికీ గత డిసెంబర్లో కొబ్బరికాయ కొట్టి షూటింగ్ మొదలుపెట్టారు. 'ఇరుముగన్' పోస్టర్ విక్రం అభిమానులను విశేషంగా ఆకట్టుకోంటుందని ఆన్లైన్లో దీనికి వెల్లువెత్తుతున్న స్పందన చాటుతోంది.