జన్నేపల్లిలో దారుణ హత్య
- హతుడి ఒంటిపైనుంచి ఆభరణాల అపహరణ
- వివాహేతరసంబంధమే హత్యకు కారణం!
నవీపేట : జన్నేపల్లి గ్రామంలో బుధవారం రాత్రి కట్టెల వ్యాపారి సల్లగరిగె చిన్న రాజన్న అలియాస్ వడ్ల చిన్న రాజేశ్వర్ (55) దారుణ హత్యకు గురయ్యాడు. నిజామాబాద్ రూరల్ సీఐ వెంకటేశ్వర్రావు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నందిపేట మండలంలోని కంఠం గ్రామానికి చెందిన చిన్న రాజేశ్వర్ వృత్తిరీత్యా ఎనిమిదేళ్ల క్రితం నవీపేట మండలంలోని జన్నేపల్లి గ్రామం లో నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. ఇద్దరు కుమారులు కంఠంలో ఉండగా మరో కుమారుడు దుబాయిలో ఉంటున్నాడు. ఆయనకు మరో ఇద్దరు కూతుళ్లున్నారు. ఐదుగురికీ వివాహం చేశాడు.
భార్య రాజబాయి ఆరేళ్ల క్రితం మరణించింది. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటున్నాడు. చిన్న రాజేశ్వర్ చెట్లను కొని కలపగా మార్చి విక్రయిస్తుంటాడు. గురువారం ఉదయం ఆయన ఫోన్‌కు నవీపేటకు చెందిన మరో వ్యాపారి ఫోన్ చేశాడు. స్విచ్ ఆఫ్ రావడంతో నేరుగా జన్నేపల్లిలోని చిన్న రాజేశ్వర్ ఇంటికి వచ్చాడు. వాహనం, చెప్పులు ఇంటి బయట ఉండగా ఇంటికి తాళం వేసి ఉండడంతో అనుమానించి తన అన్న కుమారుడు దాస్‌కు సమాచారమిచ్చాడు.
అనంతరం ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లగా.. మంచం పక్కన రక్తపు మడుగులో చిన్న రాజేశ్వర్ మృతదేహం కనిపించింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సంపత్ కుమార్ సంఘటన స్థలానికి వచ్చి, ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. గొంతుపై పదునైన ఆయుధంతో పొడవడంతో తీవ్ర రక్త స్రావమై మరణించాడని పోలీసులు పేర్కొన్నారు.
రంగంలోకి క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్
పోలీసులు క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి తనిఖీలు చేశారు. క్లూస్ టీం ఇంటిలోని వస్తువులపై వేలి ముద్రలను సేకరించింది. డాగ్ స్క్వాడ్ ఇంటి వెనకగల ఖాళీ స్థలంలోకి పరుగులు తీయడంతో సంఘటన స్థలంలో గుమిగూడిన జనం ఆత్రుతగా దాని వెంట పరుగులు తీశారు.
హత్యకు కారణమేంటి?
చిన్న రాజేశ్వర్ దారుణ హత్యకు గురవ్వడం జన్నేపల్లి, కంఠం గ్రామాలలో సంచలనం సృష్టించింది. రెండు రోజుల క్రితం గుర్తు తెలియని ఇద్దరు మహిళలు జన్నేపల్లిలో చిన్న రాజేశ్వర్ కోసం వాకబు చేసినట్లు తెలిసింది. మృతునికి వివాహేతర సంబంధాలు ఉండడంతో ఇంటికి వచ్చిన వారు డబ్బుల కోసం ఘర్షణ పడి హత్య చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి ఒంటిపై ఉండాల్సిన రెండు తులాల బంగారు గొలుసు, చేతి ఉంగరాలు కనిపించలేదు. దీంతో దొంగలు చోరీకి పాల్పడి హత్య చేశారా అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.