Janrareddy
-
ప్రచారం మరిచి సీఎం సీటు కోసం కుమ్ముకున్నారు
హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్లపై తెలంగాణ పీసీసీ నేతలు మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించారే తప్ప, కార్యకర్తలను ఏనాడూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా ఆ క్రెడిట్ను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రచారం మరచి ముఖ్యమంత్రి సీటు కోసం పోటీపడ్డారని వ్యాఖ్యానించారు. ఎవరికి వారు అధికారం కోసం పాకులాడుతున్నారని వ్యాఖ్యలు చేశారు. సరైన నాయకత్వం లేకపోవటం వల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని, తెలంగాణలో సోనియా గాంధీ సభలు విఫలం అవడానికి మాజీమంత్రులు, సీనియర్లే కారణమని ధ్వజమెత్తారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి పదవి నుంచి పొన్నాలను దించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమిష్టి నాయకత్వంలతో ముందుకు వెళితేనే పార్టీ బలోపేతం అవుతుందని పలువురు తెలంగాణ పీసీసీ నేతలు పేర్కొన్నారు. -
ఆంధ్రావాళ్లు ఇంకా ఇక్కడేంటి...
హైదరాబాద్ : పార్టీలో విభేదాలు లేవని సీఎల్పీ నేత జానారెడ్డి చెప్పిన 24 గంటలు గడవక ముందే.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు గాంధీభవన్ సాక్షిగా నిరసనలు, నినాదాలతో హోరెత్తించారు . దాంతో తెలంగాణ పీసీసీ విస్తృత స్థాయి సమావేశం రసాభాసగా మారింది. ఆహ్వాన జాబితాలో తమ పేర్లు లేవంటూ కొందరు పార్టీ సీనియర్ నేతలు వాగ్వివాదానికి దిగారు. రాష్ట్రం విడిపోయినా సీమాంధ్ర నేతల్ని ఇంకా తెలంగాణలోనే ఎలా కొనసాగిస్తారంటూ టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను నిలదీశారు. తెలంగాణ పీసీసీ కార్యవర్గ జాబితాలో ఉన్న సీమాంధ్ర నేతల పేర్లు తొలగించాలని డిమాండ్ చేశారు. కనీసం తమను సమావేశానికి ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా సభ్యుల మధ్య జరిగిన తీవ్ర వాగ్వివాదం చివరకు తోపులాటకు దారి తీసింది. మరోవైపు మాజీమంత్రి, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా టీపీసీసీ సమాచారం తనకు అందలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సమాచారం ఇస్తే బాగుండేదని ఆయన అన్నారు. కాగా ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ పీసీసీ చీప్ డీ శ్రీనివాస్, జానారెడ్డి ఈ వ్యవహారంపై అంటీ ముట్టనట్లు ఉండటం విశేషం.