చోరీకి వెళ్లి.. చంపేశాడు..
సంచలనం సృష్టించిన మహిళపై అత్యాచారం, హత్య కేసు నిందితున్ని డబీర్‌పురా పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గత ఏడాది నవంబర్ 3వ తేదీన జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఏసీపీ ఎం. శ్రీనివాస్‌రావు వెల్లడించిన వివరాలివీ.. నూర్‌ఖాన్‌బజార్ బాల్‌శెట్టికేత్ ప్రాంతానికి చెందిన జీనత్ ఆలియాస్ జకియా ఫాతిమా (36) కోఠిలోని రూప్ సంఘం బట్టల దుకాణంలో పని చేసేది. భర్త చనిపోవడంతో ఒంటరిగా నివాసముంటోంది.
మోసీన్ అనే స్నేహితుడు తరచూ ఆమె ఇంటికి వస్తుండేవాడు. కాగా, పురానీహవేలీకి చెందిన మీర్జా జీషాన్ అలీ ఖాన్(19) గతేడాది నవంబర్ 3వ తేదీన ఉదయం 6 గంటలకు జీనత్ ఇంటి గ్రౌండ్ ఫ్లోర్లో నివాసముండే తాత మీర్జా ఆబేద్ అలీ ఖాన్ వద్దకు వచ్చాడు. పైన నివాసముండే జీనత్ ఇంటి కిటికీలు తెరిచి ఉండటంతో దొంగతనం చేయాలనే దుర్బుద్ధి పుట్టింది. కిచెన్ గది పక్కనున్న కిటికీలో నుంచి ఇంట్లోకి చొరబ డ్డాడు.
విలువైన వస్తువులు తీసేందుకు ప్రయత్నిస్తుండగా నిద్రలో ఉన్న జీనత్ లేచి పెద్దగా అరిచింది. దీంతో జీషాన్ జీనత్ నోరు మూసి గట్టిగా నెట్టేశాడు. ఆమెను తలను గోడకేసి బాదడంతో స్పృహతప్పింది. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు.. గొంతు నులిమి చంపేశాడు. ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను తీసుకుని ఏమీ తెలియనట్లు కింద నివాసముండే తాత, నాన్నమ్మ దగ్గరికి వెళ్లి పోయాడు.
ఉదయం 10 గంటలకు జీనత్ స్నేహితుడు మోసీన్ ప్రతి రోజు మాదిరిగానే బట్టల దుకాణానికి తీసుకెళ్లేందుకు వచ్చాడు. జీనత్ అప్పటికే చనిపోయి ఉండటంతో ఆందోళనతో కిందికి దిగి తన సోదరుడి సాయంతో డబీర్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. జీనత్ సెల్‌ఫోన్ ఆధారంగా నిందితుడు జీషాన్‌ను పట్టుకున్నారు. అతనిపై ఐపీసీ 302, 380, 376 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.