గే వివాహాలకు ఐర్లాండ్ ఓకే
లండన్: స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేసేందుకు ఐర్లాండ్ ప్రజలు ఓకే చెప్పారు. ‘గే’ల హక్కుల గ్రూప్ ఆధ్వర్యంలో ఈ అంశంపై నిర్వహించిన రిఫరెండంలో ఏకంగా 70 శాతం మంది దీనికి అనుకూలంగా ఓటేశారు. స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లను వ్యతిరేకిస్తూ పలు సంస్థలు, సంఘాలు భారీ ఎత్తున ప్రచారం చేసినా.. ప్రజలు మాత్రం ‘గే, లెస్బియన్’ వివాహాలకు మద్దతు తెలిపారు. రిఫరెండంలో 32 లక్షల మందిని ప్రశ్నించి.. స్వలింగ సంపర్క వివాహాలకు అనుకూలమా, వ్యతిరేకమా అన్న వివరాలు సేకరించారు. శనివారం వాటిని లెక్కించగా.. 70 శాతానికిపైగా అనుకూలంగా ఓటేశారు.
అన్ని పార్టీలూ ‘గే’ల వివాహాలకు మద్దతిచ్చాయి. రిఫరెండం ఆధారంగా ‘గే, లెస్బియన్’ పెళ్లిళ్లకు చట్టబద్ధత కల్పిస్తే.. ఓటింగ్ ద్వారా ఈ తరహా చట్టం చేసిన తొలిదేశంగా ఐర్లాండ్ నిలుస్తుంది. మరోవైపు సాంప్రదాయ వాదులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రజల తీర్పు విచారకరమని కేథలిక్ సంస్థ అయోనా ఇన్స్టిట్యూట్ ప్రతినిధి జాన్ ముర్రే అన్నారు. పక్కా సంప్రదాయ కేథలిక్ రిపబ్లిక్ అయిన ఐర్లాండ్లో 1993 వరకు స్వలింగ సంపర్కం చట్ట విరుద్ధం, శిక్షార్హమైన నేరం కూడా. అంతేకాదు తల్లి ప్రాణాలకు ప్రమాదకరమైతే తప్ప అబార్షన్ చేయడంపై ఇప్పటికీ నిషేధం ఉంది. అలాంటి చోట ప్రజలంతా ‘గే, లెస్బియన్’ వివాహాలకు అనుకూలంగా ఓటేయడం విశేషం.గే వివాహాలను చట్టబద్ధం చేసిన దేశాల్లో ఐర్లాండ్ 22వది.