ఆదర్శంగా జర్నలిస్టు అక్రిడిటేషన్ కమిటీలు
విజయనగరం గంటస్తంభం: దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా జర్నలిస్టు అక్రిడిటేషన్ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. వేతనాల స్థిరీకరణ, ఉద్యోగ భద్రత కల్పించేలా కలిసి ముందుకు సాగాలన్నారు. ఏపీ ప్రెస్ అకాడమీ విజయనగరం మీడియా జర్నలిస్టులకు ఆదివారం నిర్వహించిన ఆన్లైన్ శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. పాత్రికేయులు రాసే వార్తలు ప్రజలకు మేలు చేసేవిగా ఉండాలన్నారు.
ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ మాట్లాడుతూ ప్రెస్ అకాడమీ జర్నలిస్టుల సంక్షేమాన్ని కోరుకుంటుందని తెలిపారు. నకిలీ జర్నలిస్టులను గుర్తిస్తే అసలైన జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అందించే అవకాశం ఉంటుందన్నారు. కలెక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, ప్రభుత్వ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌లు మీడియా నిబద్ధతపై ప్రసంగించారు. ఏపీ ప్రెస్ అకాడమీ కార్యదర్శి బాలగంగాధర్ తిలక్ శిక్షణ తరగతులను పర్యవేక్షించగా, సీనియర్ పాత్రికేయులు కె.స్రవంతి చంద్ర, శశాంక్ మోహన్‌లు శిక్షణ ఇచ్చారు.