28న సమైక్యశంఖారావం
* సభకు అనుమతి కోరుతూ పోలీసులకు వైఎస్సార్సీపీ దరఖాస్తు
సాక్షి, హైదరాబాద్: సమైక్య శంఖారావం సభను అక్టోబర్ 28న నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సమైక్య రాష్ట్రం డిమాండ్‌తో మొదట ఈ నెల 19నే హైదరాబాద్‌లో సభ నిర్వహించాలనుకున్నా.. ప్రభుత్వం అనుమతించలేదు. దాంతో వైఎస్సార్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. సభ నిర్వహణకు బుధవారం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, 19వ తేదీ మరో రెండు రోజులే ఉండటంతో సమైక్య శంఖారావం సభను ఈ నెల 28వ తేదీకి పార్టీ వాయిదా వేసింది. ఆ మేరకు సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాల్సిందిగా పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు కె.శివకుమార్ బుధవారం నగర డీసీపీ కమలాసన్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
కోర్టు తీర్పు సంతోషకరం
సమైక్య శంఖారావం సభకు హైకోర్టు అనుమతినివ్వడాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి స్వాగతించారు. న్యాయం గెలిచినందుకు సంతోషంగా ఉందన్నారు. హింసించి ఆనందించే స్వభావం ఉన్న ప్రభుత్వ పర్యవేక్షణలో పోలీసులు వ్యవహరిస్తుండడం దురదృష్టకరమని మైసూరా వ్యాఖ్యానించారు.
తాము తలపెట్టిన సభ ఎవరి మనోభావాలను గాయపరచడానికో లేదా ప్రజల మధ్య విద్వేషాలను రగల్చడానికో కాదని ఆయన స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలోనే సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతాయనే బలమైన సందేశాన్ని ప్రజల్లోకి పంపడమే తమ సభ ముఖ్య ఉద్దేశమన్నారు. సమైక్యంగా ఉండటం మన రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా క్షేమమని చెప్పారు.