కడపలో పడకేసిన టీడీపీ
సాక్షి ప్రతినిధి, కడప: టీడీపీకి కడప లోక్‌సభ స్థానంలో అభ్యర్థి కరువయ్యారా.. ఓడిపోయే స్థానంలో పోటీకి ఆ పార్టీ నాయకులు విముఖత వ్యక్తం చేస్తున్నారా.. అంటే అవుననే విశ్లేషకులు చెబుతున్నారు. టీడీపీ అభ్యర్థిగా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి పోటీలో ఉంటారని ఇంతకాలం జిల్లా నేతలు భావించారు. అయితే ఈమారు ఎన్నికల్లో తాను కడప పార్లమెంట్‌కు పోటీ చేయలేనని అధినేత చంద్రబాబుకు వాసు తేల్చి చెప్పినట్లు సమాచారం. కడప అసెంబ్లీ బరిలో తన సతీమణీ విజయం కోసం ప్రత్యేకంగా కృషి చేయాల్సిన అవసరమూ లేకపోలేదని చెప్పుకొచి్చనట్లు తెలుస్తోంది. దీంతో తెరపైకి మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డిని తీసుకొస్తే ఎలా ఉంటుందని టీడీపీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆ మేరకు సోమవారం టీడీపీ ఐవీఆర్ఎస్ ఫోన్ సర్వే కూడా చేపట్టింది.
కడప పార్లమెంట్ సీటు వైఎస్ కుటుంబానికి కంచుకోట. 1989లో తొలిసారి వైఎస్సార్ గెలుపుతో ప్రారంభమైన విజయప్రస్థానం అప్పటి నుంచి అప్రతిహతంగా కొనసాగుతూ వస్తోంది. వైఎస్ కుటుంబసభ్యులు క్రమం తప్పకుండా పదిసార్లు విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఒకే ఒక్కసారి 1984లో మాత్రమే డాక్టర్ డీఎన్ రెడ్డి విజయం సాధించారు. 1989 నుంచి వరుసగా నాలుగు సార్లు వైఎస్సార్ ఎంపీగా విజయం సాధించారు. తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి, వైఎస్ జగన్, ప్రస్తుత ఎంపీ వైఎస్ అవినా‹Ùరెడ్డిలను క్రమం తప్పకుండా జిల్లా ప్రజానీకం ఆదరించారు. 2024లో మరోమారు వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ–జనసేన–బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగేందుకు నాయకులు వెనుకాడుతున్నారు. ఇంతకాలం పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి పోటీ చేస్తారని భావించినా సోమవారం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి అభ్యర్థిత్వంపై టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టింది.
కమలాపురం కలిసివస్తుందనే దిశగా..
వీరశివారెడ్డి టీడీపీ ఎంపీ అభ్యరి్థగా బరిలో నిలిస్తే కమలాపురం నియోజకవర్గంలో ఉపయోగం ఉంటుందనే దిశగా ఆ పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. పదేళ్లుగా ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్న వీరశివా రెడ్డి పోటీ వల్ల ఆయన వర్గం ఎన్నికల్లో పటిష్టంగా పనిచేయగలదనే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. కమలాపురంలో ఇప్పటికే టీడీపీ ఇన్చార్జి పుత్తా నరసింహారెడ్డికి కాకుండా ఆయన తనయుడు పుత్తా చైతన్యరెడ్డి అభ్యర్థిత్వాన్ని పార్టీ ఖరారు చేసింది. ఈనేపథ్యంలో ఎంపీగా వీరశివారెడ్డిని బరిలో నిలిపితే ఏమేర ఉపయోగం ఉంటుందని తర్జనభర్జనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థిగా పీసీపీ అధ్యక్షురాలు షరి్మల పోటీలో నిలిస్తే టీడీపీ తరఫున ఎవరిని నిలిపితే ఆమెకు ప్రయోజనకారిగా ఉంటుందనే దిశగానూ ఆలోచిస్తున్నట్లు సమాచారం. టీడీపీ ఓట్లు చీలిస్తే ఉపయోగమా? లేక తక్కువ ఓట్లు తెచ్చుకునే అభ్యర్థిని బరిలో నిలిపితే కాంగ్రెస్ అ భ్యర్థి షరి్మలకు ప్రయోజనమా? అనే దిశగానూ బాబు యుక్తులు పన్నుతున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పుకొచ్చారు. అందులోభాగంగా అటు శ్రీనివాసులరెడ్డి, ఇటు వీరశివారెడ్డి పేర్లతో సోమవారం ఐవీఆర్ఎస్ ఫోన్ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది.
వీరశివారెడ్డి
బీసీ నేతల అసంతృప్తి
అనంతపురం జిల్లాలో బీసీల్లోని సీనియర్ నేతలు చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేనేత వర్గానికి చెందిన నిమ్మ ల కిష్టప్ప బాబు తమను వాడుకుని వదిలేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పెనుకొండ నియోజకవర్గానికి చెందిన మరో సీనియర్ నేత బీకే పార్థసారథి వర్గమూ బాబుపై అసంతృప్తిగా ఉంది. ఇక పుట్టపర్తి సీటును పల్లె రఘునాథరెడ్డి కోడలికి టికెట్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. 2014లో వైఎస్సార్సీపీ తరఫున కదిరి ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత టీడీపీలోకి వెళ్లిన చాంద్‌బాషాకు ఈ దఫా మొండిచేయి చూపడంతో ముస్లింలూ ఆ పార్టీపై మండిపడుతున్నారు. చాంద్‌కు టికెట్ ఇవ్వకుండా నకిలీ డీడీల కేసుల్లో శిక్ష పడిన కందికుంట ప్రసాద్ కుటుంబానికి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు. కళ్యాణ దుర్గం టికెట్ కోసం పోటీపడిన ఉన్నం హనుమంతరాయ చౌదరి, ఉమామహేశ్వర నాయుడిని కాదని బాబు బడా కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబును తెరమీదకు తేవడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గుంతకల్లు టికెట్‌ను వైఎస్సార్ సీపీ బహిష్కృత నేత గుమ్మనూరు జయరామ్‌కు ఇస్తే అసమ్మతి రేగుతుందని టీడీపీ భయపడుతోంది. అనంతపురం అర్బన్ సీటునూ అసమ్మతి సెగతో పెండింగ్‌లో పెట్టింది.
శ్రీకాకుళంలో సిగపట్లు
ఉమ్మడి జిల్లాలోని పలాస, ఎచ్చెర్ల, పాతపట్నం, శ్రీకాకుళం నియోజకవర్గాలకు టీడీపీ అభ్యర్థుల్ని ఇప్పటివరకు ఖరారు చేయలేదు. ఈ నాలుగు నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీని వర్గపోరు వేధిస్తోంది. పలాసలో గౌతు శిరీషకు చెక్ పెట్టాలని ఆ పార్టీ నాయకులే చూస్తున్నారు. పాతపట్నంలో కలమట వెంకటరమణ, మామిడి గోవిందరావు సిగపట్లు పడుతున్నారు. శ్రీకాకుళంలో గుండ లక్ష్మీదేవి, గొండు శంకర్ మధ్య యుద్ధమే జరుగుతోంది. ఎచ్చెర్ల, శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాలపై బీజేపీ కన్నేసింది. ఈ మూడింటిలో ఏదో ఒకటి కేటాయించాలని పట్టుపడుతోంది. జనసేన కూడా పాతపట్నం, ఎచ్చెర్ల, పలాసల్లో ఒక సీటును ఆశిస్తోంది.
కొలికపూడి మాకొద్దు బాబూ..!
ఎనీ్టఆర్ జిల్లా తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ తమకొద్దని ఆ పార్టీ నేతలు టీడీపీ అధిష్టానానికి అలి్టమేటం జారీ చేస్తున్నారు. ఆయన చరిత్ర చూస్తే ఆది నుంచి వివాదాస్పదమే. ఆయన అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత తిరువూరు నియోజకవర్గంలో ఆయన వ్యవహార శైలి సొంత పార్టీ నేతలకూ మింగుడు పడడం లేదు. మూడునెలల తరువాత రాష్ట్రంలో వైఎస్సార్ విగ్రహాలన్నీ కూలి్చవేస్తామని శ్రీనివాస్ వ్యాఖ్యానించడంతో ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురైంది.
తాగునీటి సమస్యపై పాదయాత్ర పేరుతో రెండు కిలోమీటర్లు కూడా నడవకుండానే హడావుడి చేయడం, డ్రెయినేజీలో ఉన్న కప్పలను పట్టి కూర వండి పంపిప్తాను తినండి అంటూ మున్సిపల్ అధికారులను కించపరచడం, ఆర్యవైశ్యుల సమావేశంలో మిగతా కులాలను కించపరిచేలా మాట్లాడడం, పదో తరగతి పరీక్ష కేంద్రంలోకి వెళ్లి ప్రచారం చేసి, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతో ఆయన తీరుపై నేతలు విసిగిపోయారు. ఈయన మాకొద్దు బాబు..! అంటూ చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు చర్చసాగుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన జవహర్, ఇక్కడ మళ్లీ పోటీ చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.