సమర సంరంభం
గగనతలం నుంచి సముద్రంలోకి.. నీటి నుంచి నేలపైకి.. మూడు రూపాల్లో సాగిన సాహస విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచేలా సాగాయి. కరాచీ హార్బర్‌ను బాంబర్లతో పేల్చేసి.. సబ్‌మెరైన్ ఘజియాను నీట ముంచి, 1971 డిసెంబర్ 4న పాకిస్తాన్‌ను మట్టి కరిపించిన తూర్పునావికాదళం శౌర్య ప్రతాపాలకు గుర్తుగా ప్రతి ఏటా నిర్వహించే నౌకాదళ విన్యాసాలు బుధవారం కన్నులపండువగా జరిగాయి. ఇసుక వేస్తే రాలనంత జనంతో సాగరతీరం కిటకిటలాడింది. అరివీర భయంకరంగా సాగిన విన్యాసాలను విశాఖవాసులు ఆస్వాదించారు.
ఆరువేల అడుగుల ఎత్తులో దూసుకుపోయే ఎనిమిది డొర్నియర్లు ఒక్కసారిగా నింగి నుంచి నేల వైపునకు 400 కిమీ వేగంతో దూసుకువచ్చాయి. భారత పతాకంతో స్కై డైవర్లు కనువిందు చేశారు.
దేశంలోనే మూడో అతి పెద్దదైన ఐఎన్ఎస్ జలాశ్వ హుందాగా ముందు కదులుతుంటే రన్వీజయ్, సహ్యాద్రి, సత్పురాలు అలలపై అనుసరించి, విన్యాసాలు ప్రదర్శించాయి.
కదులుతున్న యుద్ధ నౌకలపై ఈస్ట్రన్ ఫ్లీట్‌కు చెందిన వీహెచ్ 3 హెచ్, కమోవ్, సీకింగ్, చేతక్ హెలికాప్టర్లు వచ్చి వాలాయి.
మెరైన్ కమెండోలు సాగరంలోని ఆయిల్ రిగ్‌ను పేల్చేశారు. సముద్రంలో గాలులు తీవ్రంగా ఉండటంతో పొగ రింగ్‌గా ఏర్పడి అబ్బురపరిచింది.
మిస్సైళ్ల నుంచి పేలిన బాంబులతో సాగరతీరం మార్మోగింది.
సముద్రంలో చిక్కుకున్న వ్యక్తిని చాకచక్యంగా కమోవ్లో నుంచి రక్షించడం ఆసక్తి గొలిపింది.
నింగి, నేల, సాగరంలోంచి శత్రువుల స్థావరాల్లో గుబులు పుట్టించడంలాంటి విన్యాసాలు అబ్బురపరిచాయి. ఎల్సీఏ, ఎల్సీఎంల నుంచి కమాండోలు దిగి బాంబుల హోరు మధ్య చేసిన బీకర యుద్ధంతో అతిథులు సైతం కలవరపడ్డారు.