Kazipet railway junction
-
భార్య ఆపరేషన్ కోసం వెళ్తూ..
కాజీపేట రూరల్: మరికొన్ని గంటల్లో అనారోగ్యంతో ఉన్న భార్యకు ఆపరేషన్.. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుని హడావుడిగా ఆయన హైదరాబాద్ బయల్దేరాడు. అప్పటికే కష్టాల్లో ఉన్న ఆ కుటుంబంపై విధి మరింత విరుచుకుపడింది. గుండెపోటు రూపంలో ఆ ఇంటి పెద్దను కుప్పకూల్చింది. రైలు ఎక్కేందుకు రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఓ ఆర్ఎంపీ గుండెపోటుతో మృతిచెందిన సంఘటన కాజీపేట జంక్షన్లో మంగళవారం జరిగింది. కాజీపేట జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పెద్దాపురానికి చెందిన ఆర్ఎంపీ గూడూరు భిక్షపతి(54) గ్రామంలో వైద్య సేవలందిస్తూ జీవిస్తున్నాడు. ఆయన భార్య, మాజీ సర్పంచ్ అరుణ అనారోగ్యానికి గురికావడంతో ఇటీవల హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే భిక్షపతి హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చి సోమవారం హన్మకొండలోని తన తమ్ముడు వేణుప్రసాద్ ఇంటికి వెళ్లాడు. మంగళవారం భార్య అరుణ కుడి భుజానికి ఆపరేషన్ ఉన్నందున భిక్షపతి హన్మకొండ నుంచి ఉదయం 5 గంటల సమయంలో కాజీపేట జంక్షన్‌కు చేరుకున్నాడు. రైలు టిక్కెట్ తీసుకుని 2వ నంబర్ ప్లాట్‌ఫాంపైకి చేరుకున్నాడు. రైలు కోసం వేచి చూస్తుండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయి స్పృహ కోల్పోయాడు. పక్కన ఉన్న ప్రయాణికుడు చూసి జేబులో ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. రైల్వే అధికారులు, జీఆర్పీ పోలీసులు అక్కడికి చేరుకుని రైల్వే డాక్టర్‌ను పిలిపించి పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. కుమారుడు ఆకర్ష్ ఢిల్లీలో సీఐఎస్ఎఫ్లో పనిచేస్తుండగా, మరో కుమారుడు అరవింద్ హైదరాబాద్ అమీర్‌పేట్‌లో ప్రైవేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. కాగా మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు. -
కాజీపేటకు రైల్వే డివిజన్ హోదా!
* నాందేడ్ డివిజన్‌ను దక్షిణ మధ్య రైల్వే నుంచి తప్పించేందుకు రంగం సిద్ధం * ఆ స్థానంలో కొత్త డివిజన్‌గా కాజీపేటను ప్రకటించే అవకాశం సాక్షి, హైదరాబాద్: కాజీపేట రైల్వే జంక్షన్‌ను రైల్వే డివిజన్‌గా మార్చేందుకు మార్గం సుగమమైంది. ఈ విషయంలో తెలంగాణ డిమాండ్ కంటే మహారాష్ట్ర చేస్తున్న డిమాండే దీనికి కారణం అవుతుండటం విశేషం. ప్రస్తుతం దక్షిణమధ్య రైల్వే జోన్లో భాగంగా ఉన్న మహారాష్ట్రలోని ప్రాంతాలను ముంబై కేంద్రంగా ఉన్న సెంట్రల్ రైల్వేలో కలపాలని రైల్వే శాఖ ఓ నిర్ణయానికి వచ్చింది. ఇదే జరిగితే ఇప్పటి వరకు దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఉన్న నాందేడ్ డివిజన్ సెంట్రల్ రైల్వేలో కలుస్తుంది. ఫలితంగా దాని స్థానంలో కాజీపేట జంక్షన్‌ను ప్రత్యేక డివిజన్ కేంద్రంగా మార్చాల్సి వస్తుంది. కాజీపేటకు డివిజన్ హోదా కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. కానీ ఇప్పటి వరకు దానిపై నిర్ణయం తీసుకోలేదు. అయితే దక్షిణ మధ్య రైల్వే పరిధి నుంచి నాందేడ్ డివిజన్‌ను వేరుచేసి సెంట్రల్ రైల్వే జోన్లో కలపాలనే మహారాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌ను మాత్రం ఇప్పుడు రైల్వే శాఖ పరిగణనలోకి తీసుకుంది. రైల్వేశాఖ మంత్రిగా కొత్తగా బాధ్యతలు తీసుకున్న సురేశ్‌ప్రభు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కావటంతో ఆయన మహారాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌కు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. నాందేడ్ డివిజన్‌ను సెంట్రల్ రైల్వే జోన్లో కలిపే విషయాన్ని వచ్చే రైల్వే బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. డివిజన్ హోదా ఖాయమే:మహారాష్ట్రలోని నాందేడ్ డివిజన్‌ను సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోకి తీసుకువస్తే దక్షిణ మధ్య రైల్వేలో డివిజన్ల సంఖ్య తగ్గుతుంది. అలాగే గుంటూరు, విజయవాడ, గుంతకల్ డివిజన్లతో ప్రత్యేక జోన్‌ను ఏర్పాటు చేయాలన్న ఏపీ డిమాండ్‌కు కేంద్రం పచ్చజెండా ఊపితే దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లు మాత్రమే మిగులుతాయి. నిబంధనల ప్రకారం ప్రతి జోన్లో కనిష్టంగా మూడు డివిజన్లు ఉండాలి. లేకుంటే అది జోన్ హోదాను కోల్పోతుంది. ఈ లెక్కన దక్షిణమధ్య రైల్వేకు మరో డివిజన్ (ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక జోన్ ఇస్తే) అవసరమవుతుంది. అప్పుడు కాజీపేటకు డివిజన్ హోదా కల్పించక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. రైల్వే ప్రాజెక్టుల విషయంలో నాందేడ్ డివిజన్‌గా ఉన్న ఈ ప్రాంతాలపై దక్షిణమధ్య రైల్వేలో నిర్లక్ష్యం చూపుతున్నారంటూ ఆ ప్రాంత నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబై కేంద్రంగా ఉన్న సెంట్రల్ రైల్వేలో వాటిని కలిపితే అభివృద్ధి జరుగుతుందనే ఆ నేతల అభిప్రాయానికి రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారు. ఇటీవలి హైదరాబాద్ పర్యటన సందర్భంగా కూడా సురేశ్‌ప్రభు ఈ విషయాన్ని స్పష్టం చేయటం గమనార్హం. -
కాజీపేటను డివిజన్‌గా మార్చండి
రైల్వే జీఎంకు ఎంపీలు కడియం, సీతారాంల వినతి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కీలకమైన కాజీపేట రైల్వే జంక్షన్‌ను ప్రత్యేక డివిజన్‌గా మార్చాలని వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, మహబూబాబాద్ ఎంపీ సీతారామ్ నాయక్ కోరారు. తాము రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఈ అంశంపై దక్షిణ మధ్య రైల్వే వెంటనే ప్రతిపాదన పంపాలని వారు మంగళవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవను కోరారు. మంగళవారం సాయంత్రం జీఎంతో సమావేశమై, కాజీపేటపై పలు అంశాలను చర్చించారు. ఇప్పటికే మంజూరైన రైలు వ్యాగన్ల తయారీ యూనిట్ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలనగా, అనువైన స్థలాన్ని జిల్లా కలెక్టర్ అప్పగించలేదని, అప్పగింత ప్రక్రియ సత్వరం పూర్తి చేయించాలని ఎంపీలను జీఎం కోరారు. కాజీపేట జంక్షన్లో అదనంగా ప్లాట్‌ఫారాలు ఏర్పాటు చేయాలని. కొన్ని కొత్త రైళ్లు ప్రారంభించాలని, మరిన్ని రైళ్లను కాజీపేటలో నిలిపే సదుపాయం కావాలని ఎంపీలు కోరగా, అందుకు ప్రతిపాదనలు పంపాలని జీఎమ్ సూచించారు. భద్రతకు, సమయపాలనకు ప్రాధాన్యం: జీఎం భద్రత, సమయపాలనకు ప్రాధాన్యమివ్వాలని శ్రీవాత్సవ ఉన్నతాధికారులను ఆదేశించారు. రైల్వే డివీఎంలు, ఇతర ముఖ్య విభాగాల అధిపతులతో ఆయన మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. రైల్వేస్టేషన్ల పరిశుభ్రత వారోత్సవాల తీరుపై వాకబు చేశారు. ప్రయాణికులు చెత్త వేయకుండా నివారించాలన్నారు. ఉన్న నిధులను పరిగణనలోకి తీసుకుకుని ప్రాధాన్యతాక్రమంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.