రైల్వేస్టేషన్‌లో ఆర్‌ఎంపీ భిక్షపతి మృతదేహం
కాజీపేట రూరల్: మరికొన్ని గంటల్లో అనారోగ్యంతో ఉన్న భార్యకు ఆపరేషన్.. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుని హడావుడిగా ఆయన హైదరాబాద్ బయల్దేరాడు. అప్పటికే కష్టాల్లో ఉన్న ఆ కుటుంబంపై విధి మరింత విరుచుకుపడింది. గుండెపోటు రూపంలో ఆ ఇంటి పెద్దను కుప్పకూల్చింది. రైలు ఎక్కేందుకు రైల్వేస్టేషన్‌కు చేరుకున్న ఓ ఆర్‌ఎంపీ గుండెపోటుతో మృతిచెందిన సంఘటన కాజీపేట జంక్షన్‌లో మంగళవారం జరిగింది. కాజీపేట జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ విజయ్‌కుమార్ కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పెద్దాపురానికి చెందిన ఆర్‌ఎంపీ గూడూరు భిక్షపతి(54) గ్రామంలో వైద్య సేవలందిస్తూ జీవిస్తున్నాడు. ఆయన భార్య, మాజీ సర్పంచ్ అరుణ అనారోగ్యానికి గురికావడంతో ఇటీవల హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే భిక్షపతి హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చి సోమవారం హన్మకొండలోని తన తమ్ముడు వేణుప్రసాద్ ఇంటికి వెళ్లాడు. మంగళవారం భార్య అరుణ కుడి భుజానికి ఆపరేషన్ ఉన్నందున భిక్షపతి హన్మకొండ నుంచి ఉదయం 5 గంటల సమయంలో కాజీపేట జంక్షన్‌కు చేరుకున్నాడు.
రైలు టిక్కెట్ తీసుకుని 2వ నంబర్ ప్లాట్‌ఫాంపైకి చేరుకున్నాడు. రైలు కోసం వేచి చూస్తుండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయి స్పృహ కోల్పోయాడు. పక్కన ఉన్న ప్రయాణికుడు చూసి జేబులో ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చాడు. రైల్వే అధికారులు, జీఆర్పీ పోలీసులు అక్కడికి చేరుకుని రైల్వే డాక్టర్‌ను పిలిపించి పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. కుమారుడు ఆకర్ష్ ఢిల్లీలో సీఐఎస్‌ఎఫ్‌లో పనిచేస్తుండగా, మరో కుమారుడు అరవింద్ హైదరాబాద్ అమీర్‌పేట్‌లో ప్రైవేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. కాగా మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment