కాజీపేటకు రైల్వే డివిజన్ హోదా!
* నాందేడ్ డివిజన్‌ను దక్షిణ మధ్య రైల్వే నుంచి తప్పించేందుకు రంగం సిద్ధం
* ఆ స్థానంలో కొత్త డివిజన్‌గా కాజీపేటను ప్రకటించే అవకాశం
సాక్షి, హైదరాబాద్: కాజీపేట రైల్వే జంక్షన్‌ను రైల్వే డివిజన్‌గా మార్చేందుకు మార్గం సుగమమైంది. ఈ విషయంలో తెలంగాణ డిమాండ్ కంటే మహారాష్ట్ర చేస్తున్న డిమాండే దీనికి కారణం అవుతుండటం విశేషం. ప్రస్తుతం దక్షిణమధ్య రైల్వే జోన్‌లో భాగంగా ఉన్న మహారాష్ట్రలోని ప్రాంతాలను ముంబై కేంద్రంగా ఉన్న సెంట్రల్ రైల్వేలో కలపాలని రైల్వే శాఖ ఓ నిర్ణయానికి వచ్చింది. ఇదే జరిగితే ఇప్పటి వరకు దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఉన్న నాందేడ్ డివిజన్ సెంట్రల్ రైల్వేలో కలుస్తుంది.
ఫలితంగా దాని స్థానంలో కాజీపేట జంక్షన్‌ను ప్రత్యేక డివిజన్ కేంద్రంగా మార్చాల్సి వస్తుంది. కాజీపేటకు డివిజన్ హోదా కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. కానీ ఇప్పటి వరకు దానిపై నిర్ణయం తీసుకోలేదు. అయితే దక్షిణ మధ్య రైల్వే పరిధి నుంచి నాందేడ్ డివిజన్‌ను వేరుచేసి సెంట్రల్ రైల్వే జోన్‌లో కలపాలనే మహారాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌ను మాత్రం ఇప్పుడు రైల్వే శాఖ పరిగణనలోకి తీసుకుంది. రైల్వేశాఖ మంత్రిగా కొత్తగా బాధ్యతలు తీసుకున్న సురేశ్‌ప్రభు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కావటంతో ఆయన మహారాష్ట్ర ప్రభుత్వ డిమాండ్‌కు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. నాందేడ్ డివిజన్‌ను సెంట్రల్ రైల్వే జోన్‌లో కలిపే విషయాన్ని వచ్చే రైల్వే బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
డివిజన్ హోదా ఖాయమే:మహారాష్ట్రలోని నాందేడ్ డివిజన్‌ను సెంట్రల్ రైల్వే జోన్ పరిధిలోకి తీసుకువస్తే దక్షిణ మధ్య రైల్వేలో డివిజన్ల సంఖ్య తగ్గుతుంది. అలాగే గుంటూరు, విజయవాడ, గుంతకల్ డివిజన్లతో ప్రత్యేక జోన్‌ను ఏర్పాటు చేయాలన్న ఏపీ డిమాండ్‌కు కేంద్రం పచ్చజెండా ఊపితే దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్, హైదరాబాద్ డివిజన్లు మాత్రమే మిగులుతాయి. నిబంధనల ప్రకారం ప్రతి జోన్‌లో కనిష్టంగా మూడు డివిజన్లు ఉండాలి. లేకుంటే అది జోన్ హోదాను కోల్పోతుంది. ఈ లెక్కన దక్షిణమధ్య రైల్వేకు మరో డివిజన్ (ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక జోన్ ఇస్తే) అవసరమవుతుంది. అప్పుడు కాజీపేటకు డివిజన్ హోదా కల్పించక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. రైల్వే ప్రాజెక్టుల విషయంలో నాందేడ్ డివిజన్‌గా ఉన్న ఈ ప్రాంతాలపై దక్షిణమధ్య రైల్వేలో నిర్లక్ష్యం చూపుతున్నారంటూ ఆ ప్రాంత నేతలు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబై కేంద్రంగా ఉన్న సెంట్రల్ రైల్వేలో వాటిని కలిపితే అభివృద్ధి జరుగుతుందనే ఆ నేతల అభిప్రాయానికి రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారు. ఇటీవలి హైదరాబాద్ పర్యటన సందర్భంగా కూడా సురేశ్‌ప్రభు ఈ విషయాన్ని స్పష్టం చేయటం గమనార్హం.