పీఎన్బీ లాభం 28% డౌన్
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ మార్చి క్వార్టర్లో రూ. 806 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2012-13) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 1,131 కోట్లతో పోలిస్తే ఇది 28% తక్కువ. రూ. 4,189 కోట్లమేర తాజా బకాయిలు(స్లిప్పేజెస్) నమోదుకాగా, వీటికి అదనంగా రూ. 263 కోట్లు జతకలసినట్లు బ్యాంక్ చైర్మన్ కేఆర్ కామత్ పేర్కొన్నారు. నికర మొండి బకాయిలకు(ఎన్పీఏలు) కేటాయింపులు 45% ఎగసి రూ. 2,139 కోట్లకు చేరడంతో లాభాలు ప్రభావితమైనట్లు తెలిపారు. నికర ఎన్పీఏలు 2.85%గా నమోదయ్యాయి. ఈ కాలంలో మొత్తం ఆదాయం రూ. 11,553 కోట్ల నుంచి రూ. 12,498 కోట్లకు పుంజుకుంది.
పూర్తి ఏడాదికి: పూర్తి ఏడాదికి(2013-14) కూడా బ్యాంక్ నికర లాభం దాదాపు 30% క్షీణించి రూ. 3,343 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2012-13) రూ. 4,748 కోట్ల లాభం నమోదైంది. ఇక ఆదాయం మాత్రం రూ. 46,109 కోట్ల నుంచి రూ. 47,800 కోట్లకు పెరిగింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో బ్యాంక్ షేరు 4% పతనమై రూ. 800 వద్ద ముగిసింది.