బలరాంపురంలో నగర వనం
గార: బలరాంపురం పరిసరాల్లో నిర్మించే ‘నగరవనం’ను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలపాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. బలరాంపురంలో 66వ వనమహోత్స కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో నిర్మించనున్న నగరవనం జిల్లా ప్రజలకు ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. దీనికి కోసం పది కోట్ల రూపాయలను విడుదల చేసి పనులు చేపడతామన్నారు. అన్ని రకాల మొక్కలను పెంచడంతోపాటు, పార్కు, ధ్యాన కేంద్రాన్ని నిర్మిస్తామన్నారు. అన్ని శాఖల కార్యాలయాల్లో మొక్కలు పెంచేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలో ఎక్కడ ప్రమాదాలు జరిగినా శ్రీకాకుళం జిల్లా వాసులు ఉండటం బాధాకరమన్నారు.
కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం మాట్లాడుతూ 165 ఎకరాల్లో నిర్మించే నగరవనాన్ని పర్యాటకులను ఆకర్షించేలా సుందరంగా నిర్మిస్తామన్నారు. ఈ ఏడాది ఒక కోటీ ఐదు లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జిల్లా ఎస్పీ ఏఏస్ ఖాన్ మాట్లాడుతూ భూభాగంలో 33 శాతం చెట్లు ఉండాల్సి ఉండగా కేవలం 16 శాతం ఉండటం బాధాకరమన్నారు. మొక్కలు నరికేవాళ్లను ఎందుకు నరుకుతున్నారో ప్రతీ ఒక్కరూ ప్రశ్నించాలన్నారు. తొలుత నగరవనం పనులకు మంత్రి అచ్చెన్న శంకస్థాపన చేశారు. ఇందుకు సంబంధిన మ్యాపును పరిశీలించారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, నరసన ్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, జేసీ వివేక్‌యాదవ్, జేసీ-2 రజనీకాంతరావు, ఎంపీపీ గుండ అమ్మలు, డీఎఫ్‌వో విజయ్‌కుమార్, డీఆర్డీఏ పీడీ తనూజారాణి, ఆర్డీవో బలివాడ దయానిధి పాల్గొన్నారు.