పర్రిశమల కోసం భూములిచ్చేది లేదు
10 కిలోమీటర్ల మేర రైతుల పాదయాత్ర
మద్దతుగా పాల్గొన్న కాంగ్రెస్, వామపక్ష పార్టీల నాయకులు
గీసుకొండ / సంగెం : పరిశ్రమల స్థాపన కోసం పంటలు పండే విలువైన తమ భూములను ఇవ్వబోమంటూ రైతులు ఆదివారం మహాపాదయాత్రను నిర్వహించారు. భూ సంరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు మండలంలోని శాయంపేట హవేలి నుంచి ప్రారంభమైన పాదయాత్ర స్టేషన్ చింతలపెల్లి, కృష్ణానగర్, ఊకల్, మరియపురం మీదుగా ఊకల్ క్రాస్‌రోడ్డు వరకు 10 కిలోమీటర్ల మేర సాగింది. పంట భూములను లాక్కోవద్దంటూ రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు నినాదాలు చేశారు. సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర ఊకల్ క్రాస్‌రోడ్డుకు చేరుకోగా 12 రోజులుగా కొనసాగుతున్న దీక్షల శిబిరాన్ని పలు పార్టీల నాయకులు సందర్శించారు.
2013 చట్టం ప్రకారం భూసేకరణ చేపట్టాలి
ప్రభుత్వం 2013 భూ సేకరణ చట్టం ప్రకారం భూ సేకరణ చేపట్టాలే గానీ రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవాలని చూస్తే ప్రతిఘటిస్తామని సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. రైతుల పాదయాత్రలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల కోసం గీసుకొండ, సంగెం మండలాల్లోని గ్రామాల్లో 3 వేల ఎకరాలను సేకరించాలని చూస్తున్నారన్నారు. పరిశ్రమలకు అవసరమైన భూములు జిల్లాలో చాలా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పరకాల నియోజకవర్గ ఇన్చార్జి ఇనుగాల వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ పరిశ్రమలకు భూములను ఇవ్వబోమంటూ 15 రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులకు తాము అండగా ఉంటామన్నారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరులు ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ భూ దందాలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఆత్మకూరు జెడ్పీటీసీ లేతాకుల సంజీవరెడ్డి, భూ నిర్వాసితుల సంఘం రాష్ట్ర, జిల్లా కన్వీనర్లు పి.వెంకట్, రంగయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి సారంపెల్లి వాసుదేవరెడ్డి, రైతు జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మోర్తాల చందర్రావు, జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్, పెద్దారపు రమేశ్, బేతినేని నర్సింగరావు, తీగల రవీందర్, కొండేటి కొమురారెడ్డి, కుందారపు యాదగిరి, డోలె చిన్ని, బండారి కట్టయ్య, నాయిని భరత్, ఆబయ్య బుచ్చిబాబు, మునుకుంట్ల కోటేశ్వర్, సురేందర్, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.