బాధ్యత మరచిభారమా?
ముందు పక్కాగా ఏర్పాట్లు చేయండి
ప్రజలకు అవగాహన కల్పించండి
అప్పుడే కఠిన నిర్ణయాలు తీసుకోవచ్చు
‘లిట్టర్ ఫ్రీ’పై మేయర్ అభ్యంతరం
నగరంలోని ఎంపిక చేసిన మార్గాలను ‘చెత్త రహిత’గా తీర్చిదిద్దాలని... నిబంధనలు ఉల్లంఘించే వారిపై శుక్రవారం నుంచి పెనాల్టీలు విధించాలని జీహెచ్ఎంసీ తీసుకున్న నిర్ణయంపై సాక్షాత్తూ మేయరే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సరైన ఏర్పాట్లు చేయకుండా ప్రజలపై భారం మోపడం తగదని అంటున్నారు. దీన్ని స్టాండింగ్ కమిటీ ఆమోదించలేదని చెబుతున్నారు. మరోవైపు అధికారులు మాత్రం దీనికి స్టాండింగ్ కమిటీ ఆమోదం అవసరం లేదని అంటున్నారు.
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకుండా, అవసరమైనన్ని ప్రదేశాల్లో తగినన్ని డంపర్బిన్లు ఏర్పాటు చేయకుండా ప్రజలపై పెనాల్టీల భారం వేయడం తగదని మేయర్ మహ్మద్ మాజిద్ హుస్సేన్ అభిప్రాయపడ్డారు. అన్ని లైన్లు, బైలైన్లలో అవసరమైనన్ని చెత్త రిక్షాలను అందుబాటులోకి తీసుకురాకుండా జీహెచ్ఎంసీ కఠిన నిర్ణయాలు తీసుకోవడం తగదని అన్నారు.
చెత్తరహిత రహదారులు (లిట్టర్ ఫ్రీ రోడ్స్) పథకం అమలులో భాగంగా ఎంపిక చేసిన మార్గాల్లో చెత్త వేసే వారికి శుక్రవారం నుంచి పెనాల్టీలు విధించనున్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించిన నేపథ్యంలో మేయర్ పైవిధంగా స్పందించారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పన్నులు చెల్లిస్తున్న ప్రజలకు తగిన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత కార్పొరేషన్‌పై ఉందన్నారు. జీహెచ్ఎంసీ తన బాధ్యతలు సక్రమంగా నిర్వహించాక.. చెత్త రహిత వ్యవస్థపై ప్రజలకు అవగాహన కల్పించాక పెనాల్టీలు విధించవచ్చునన్నారు.
అవేమీ లేకుండా పెనాల్టీలు తగవన్నారు. గ్రేటర్లో 8 వేల కి.మీ.కు పైగా రహదారులు ఉండగా, కేవలం 23 కి.మీ.కే దీన్ని పరిమితం చేయడం తగదన్నారు. గ్రేటర్‌లోని అన్ని రహదారులు, ప్రాంతాలను లిట్టర్ ఫ్రీగా చేయాల్సి ఉందన్నారు. రోడ్లన్నిటిపైనా చెత్తాచెదారాలు లేకుండా చూడాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీదేనన్నారు. జీహెచ్ఎంసీ మౌలిక సదుపాయాలు కల్పించిన తరువాత నిబంధనల మేరకు కఠిన చర్యలు తీసుకోవచ్చని అభిప్రాయపడ్డారు. బాధ్యతలు విస్మరించి, ప్రజలపై భారం మోపాలనుకోవడం తగదన్నారు.
స్టాండింగ్ కమిటీలో నిర్ణయం తీసుకోలేదు
లిట్టర్ ఫ్రీ రోడ్స్‌పై స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోలేదని మేయర్ వెల్లడించారు. జీహెచ్ఎంసీలో ఏదైనా కార్యక్రమం అమలు చేయాలంటే విధాన నిర్ణయం తీసుకునే అధికారం స్టాండింగ్ కమిటీకే ఉందని గుర్తు చేశారు. స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఎన్నికైన ప్రజాప్రతినిధులే విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉందంటూ పరోక్షంగా అధికారుల నిర్ణయాన్ని ఆక్షేపించారు.
కేవలం సెంట్రల్ జోన్లోనే కాకుండా జీహెచ్ఎంసీలోని అన్ని జోన్లను, ప్రాంతాలను చెత్త రహితంగా చేయాల్సి ఉందని చెప్పారు. దీనిపై తొలుత ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. కేవలం పత్రికా ప్రకటనలతో అమలు చేయడం సాధ్యం కాదని చెప్పారు. అధికారులు స్టాండింగ్ కమిటీకి జవాబుదారీగా వ్యవహరించాలని హితవు పలికారు. వారు అమలు చేయబోయే ముందు కమిటీ ఆమోదం పొందాలని మేయర్ స్పష్టం చేశారు. ఒక వేళ అధికారులు ఈ విషయాలు పట్టించుకోకపోతే తగు చర్యల కోసం ప్రభుత్వానికి రాస్తామన్నారు.
కమిషనరూ సభ్యుడే: కమిషనర్‌తో మీకు విబేధాలున్నాయా అన్న ప్రశ్నకు మేయర్ బదులిస్తూ.. కమిషనర్ తమ బృందంలోని సభ్యుడే (టీమ్ మెంబరే)నని వ్యాఖ్యానించారు. తమమధ్య ఎలాంటి విబేధాలూ లేవన్నారు. జీహెచ్ఎంసీలోని వారందరూ ఒకే కుటుంబ సభ్యులని అన్నారు. రెండేళ్లకుపైగా తాను మేయర్‌గా కొనసాగుతున్నానని, ఎవరు కమిషనర్‌గా ఉన్నా ఎలాంటి తేడాలు రాలేదని చెప్పారు. కమిషనర్ పనితీరుతో ఎలా ఉన్నారన్న ప్రశ్నకు బదులిస్తూ, ఎవరికీ తాను రేటింగ్ ఇవ్వబోనన్నారు.
అది జోనల్ అధికారుల పని: కమిషనర్
లిట్టర్ ఫ్రీ కార్యక్రమం జోనల్ స్థాయి అధికారులు చేపడుతున్నదని జీహెచ్ఎంసీ కమిసనర్ సోమేశ్‌కుమార్ చెప్పారు. మేయర్ సమావేశానంతరం తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ అది విధాన నిర్ణయం కాదని తెలిపారు. ఎన్నికలకు ముందే ఈ పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. మేయర్‌కు, తనకు మధ్య ఎలాంటి విబేధాలు లేవని తెలిపారు. తన విధులు తాను నిర్వర్తిస్తున్నానని స్పష్టం చేశారు.
కొన్ని మార్గాలను తొలుత పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని, అక్కడి ఫలితాలను బట్టి నగరమంతా అమలు చేయాలనేదే లక్ష్యమని తెలిపారు. ఎంపిక చేసిన రోడ్లపై చెత్త లేకుండా కాంట్రాక్టు పొందిన సంస్థే పర్యవేక్షిస్తున్నందున ఆ మార్గాల్లో డంపర్బిన్లతో పని లేదన్నారు. రూ.50 లక్షలకు పైబడి రూ.2 కోట్ల వరకు నిధుల మంజూరు బాధ్యత స్టాండింగ్ కమిటీపై ఉంటుందని, చట్టపరమైన, సాధారణంగా జరిగే పనులకు ప్రత్యేకంగా ఆమోదం అవసరం లేదని అభిప్రాయపడ్డారు. స్టాండింగ్ కమిటీ ఏవైనా ప్రతిపాదిస్తే వాటిని ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు.
ఏవైనా సమస్యలుంటే కూర్చొని పరిష్కరించుకుంటామని, ఇంతవరకు తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని చెప్పారు. అంశాల వారీగా భిన్నాభిప్రాయాలు ఉండటం సహజమేనన్నారు. ఆగస్టు 1నుంచి పెనాల్టీలు విధిస్తున్నట్లు తాను ఎక్కడా పేర్కొనలేదని, లిఖితపూర్వకంగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేశారు. మీ పేరిట పత్రికా ప్రకటన వెలువడిందన్న ప్రశ్నకు బదులిస్తూ.. ఆ అంశం గురించి తెలుసుకుంటానన్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమం సెంట్రల్‌జోన్‌లో ఈపాటికే అమలవుతోందని చెప్పారు. తాను కొత్తగా చేపడుతున్న పథకాలంటూ ప్రత్యేకంగా లేవని, ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న వాటిని పూర్తి చేస్తున్నానని చెప్పారు.
ఇది స్పెషల్ డ్రైవ్: డాక్టర్ సత్యనారాయణ, సెంట్రల్ జోన్ కమిషనర్
లిట్టర్ ఫ్రీ పనులు గత ఫిబ్రవరి నుంచే జరుగుతున్నాయని, ప్రజలకు మరింత అవగాహన కలిగించేందుకు త గిన చర్యలు తీసుకుంటున్నామని సెంట్రల్ జోన్ కమిషనర్ డాక్టర్ సత్యనారాయణ చెప్పారు. చెత్త వేసే వారికి జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనల మేరకు పెనాల్టీలు కొత్తగా విధిస్తున్నవి కావని, హైదరాబాద్‌ను పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దేందుకు స్పెషల్డ్రైవ్గా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మరికొద్ది రోజుల పాటు ప్రజలకు అవగాహన కల్పించాక చర్యలు చేపడతామన్నారు.