the main road
-
మృత్యుశకటం
దుగ్గిరాల : ఆ లారీ ఇద్దరు విద్యార్థుల పాలిట మృత్యుశకటమైంది. కూలి పనులు చేస్తూ చదువుకుంటున్న వారిద్దరి ఉసురు తీసింది. తల్లిదండ్రులకు అండగా నిలవాలనుకున్న వారి ఆశను ఆదిలోనే తుంచేసింది. తెనాలి -విజయవాడ ప్రధాన రహదారిపై దుగ్గిరాలలోని కొమ్మమూరు లాకు వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన దుర్ఘటనలో విద్యార్థులు షేక్ యాసిన్ (17), నాగ నవీన్ (14) అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పారిపోతున్న డ్రైవర్ మునిపల్లి ప్రశాంత్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్థానికులు, పోలీసులు అందించిన సమాచారం మేరకు దుర్ఘటన వివరాలు ఇలావున్నాయి... మండల కేంద్రం దుగ్గిరాలలోని రామానగర్ (బంగళా ఏరియా)కు చెందిన షేక్ సాంబయ్య, పీరమ్మ దంపతుల కుమారుడు షేక్ యాసిన్(17) స్థానిక ఐటీఐ కళాశాలలో చదువుతున్నాడు. అదే కాలనీకి చెందిన ఆరేపల్లి కౌసల్య కుమారుడు నాగ నవీన్(14) జెడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. వీరిద్దరు ఇరుగుపొరుగు వారితో కలసి చిలువూరులో వ్యవసాయ కూలి పనులకు వెళ్లారు. ఓ రైతు పొలంలో మొక్కజొన్న విత్తనాలు నాటి తిరిగి సైకిల్‌పై ఇంటికి వస్తుండగా, సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కొమ్మమూరు లాకు వద్ద కొల్లూరుకు చెందిన ఇటుక రాయి లారీ వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టింది. రోడ్డుపై స్పీడు బ్రేకర్లు ఉన్నా లారీ అతివేగంతో వచ్చి ఢీకొట్టడం వల్లే విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. లారీ నాగనవీన్ తలపై నుంచి వెళ్లగా, వెనుక టైరు కిందపడి యాసిన్ మృతి చెందాడు. దుర్ఘటన స్థలంలో ర క్తం మడుగు కట్టింది. సైకిల్ ధ్వంసమైంది. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబాలు... విద్యార్థులు యాసిన్, నవీన్ కుటుంబాలు కూలి పనిచేసుకుని పొట్టపొసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ కూలి పనులకు వెళ్లి వస్తుండగా మృత్యువాత పడడం ఆ కాలనీవాసులను కలచివేసింది. యాసిన్ తండ్రి షేక్ సాంబయ్య తాపీ పని చేస్తుండగా, తల్లి పీరమ్మ కూలి పనులకు వెళుతుంటుంది. వీరికి మరో ముగ్గురు కుమార్తెలు ఉండగా, ఓ కుమార్తెకు పెళ్లి చేశారు. మిగిలిన ఇద్దరు కుమార్తెలు ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్నారు. నవీన్ తల్లి కౌసల్య కూడా కూలి పనులకు వెళుతూ పిల్లలను చదివించుకుంటుంది. వాస్తవంగా వీరిది కృష్ణా జిల్లా ఆగిరిపల్లి. భర్త వెంకటేశ్వరరావు రెండేళ్ల కిందట మృతి చెందడంతో పిల్లలు నవీన్, భార్గవిని తీసుకుని కౌసల్య దుగ్గిరాల వచ్చి తన తల్లివద్ద ఉంటుంది. కుమార్తె భార్గవి పదవ తరగతి చదువుతుంది. కాలనీలో విషాద చాయలు... ఒకే కాలనీకి చెందిన విద్యార్థులు యాసిన్, నాగనవీన్ మృతి చెందడంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి ఇళ్లకు కేవలం 200 మీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరగడం అందిరిని కలచివేసింది. రెండు నిమిషాల్లో ఇళ్లల్లో ఉండాల్సిన విద్యార్థులు కానరాని లోకాలకు వెళ్లారంటూ ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్న తీరు అక్కడి వారితో కంటతడి పెట్టించింది. సంఘటన గురించి తెలియడంతో అప్పటివరకు వీరితో కలసి పనిచేసిన కూలీలు కూడా కంటతడిపెడుతూ అక్కడకు చేరుకున్నారు. తెనాలి రూరల్ సీఐ యు. రవిచంద్ర, అదనపు ఎస్ఐ చేబ్రోలు అప్పారావు, తాలూకా ఎస్ఐ అనిల్ కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేశారు. -
మోదమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు
పాడేరు,న్యూస్‌లైన్: మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలను ఈ నెల 11వ తేదీ నుంచి మూడు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఉత్సవ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కురుసా నాగభూషణం, బత్తిన కృష్ణ, సర్పంచ్ కిల్లు వెంకటరత్నం తెలిపారు. శుక్రవారం సాయంత్రం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉత్సవ ఏర్పాట్ల వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఆదివారం ఉదయం 6 గంటలకు అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలు, ఘటాలను అమ్మవారి ఆల యం నుంచి తోడ్కొని వెళ్లి మెయిన్ రోడ్డులో ఏర్పాటు చేసిన సతకంపట్టు వద్ద ప్రతిష్టించి ఉత్సవాలను ప్రారంభిస్తామన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఏ రాజకీయ పార్టీల నేతలు, మాజీ ప్రజాప్రతినిధులను ఆహ్వానిం చడం లేదని స్థానిక భక్తులే ఉత్సవాలకు ముఖ్య అతిథులన్నారు. పట్టణం అంతా విద్యుత్ దీపాలంకరణ ఈ ఉత్సవాలకు ప్రధాన ఆకర్షణ అని వారు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల అధికారులతోను సమన్వయం చేశామన్నారు. ఉత్సవాల విజయవంతానికి ఐటీడీఏ కూడా సహకరిస్తుందన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, గిరిజనుల సంప్రదాయ కళా ప్రదర్శనలు కూడా ఉంటాయన్నారు. ఉత్సవాల సందర్భంగా భారీ పోలీసు బందోబస్తు ఉంటుందన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ఉత్సవాల చివరి రోజైన మంగళవారం అమ్మవారి అనుపు ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాలను ప్రతి భక్తుడు నెత్తిన పెట్టి మోసే విధంగా అవకాశం కల్పిస్తామని ఈ మేరకు రోప్‌వే సౌకర్యాన్ని కూడా ఈ ఏడాది వినూత్నంగా ఏర్పాటు చేశామని తెలిపారు. ఉత్సవాలతో పాడేరు పట్టణ వాసులకు అదనంగా గ్యాస్ సిలిండర్ సౌకర్యంతో పాటు అన్ని వీధుల్లోను ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరాకు ఐటీడీఏ పీఓ చర్యలు తీసుకున్నారని, పారిశుద్ధ్య చర్యలు కూడా చేపడతామని చెప్పారు. ఉత్సవాల విజయవంతానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని వారు కోరారు. సమావేశంలో ఉత్సవ కమిటీ ప్రతి నిధులు పలాసి కృష్ణారావు, రొబ్బా నాగభూషణరాజు, బాణం శ్రీనివాసదొర, మాజీ సర్పంచ్ వర్తన పిన్నయ్యదొర, ఎల్.అప్పారావు, కొట్టగుల్లి రాజారావు, తాంగుల రంగారావు, మర్రిచెట్టు రామునాయుడు, సల్లా రామకృష్ణ, రామిరెడ్డి, ఆటో ఈశ్వరరావు, గోపి పాల్గొన్నారు. ఆలయానికి ఉత్సవ శోభ మోదకొండమ్మ అమ్మవారి ఆలయానికి ఉత్సవ శోభ నెలకొంది. ఇటీవల అమ్మవారి విగ్రహానికి కొత్తగా రంగులు వేయడంతో అమ్మవారు మరింత ఆకర్షణీయంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అలాగే ఉత్సవాలతో అమ్మవారి ఆలయానికి విద్యుద్దీపాలంకరణ చేపట్టడంతో మరింత శోభాయమానంగా భక్తులకు కనువిందు చేస్తుంది. ఉత్సవాలకు రెండు రోజుల ముందుగానే అమ్మవారి ఆలయం దీపాలంకరణతో కళకళలాడుతుంది.