మృత్యుశకటం
దుగ్గిరాల : ఆ లారీ ఇద్దరు విద్యార్థుల పాలిట మృత్యుశకటమైంది. కూలి పనులు చేస్తూ చదువుకుంటున్న వారిద్దరి ఉసురు తీసింది. తల్లిదండ్రులకు అండగా నిలవాలనుకున్న వారి ఆశను ఆదిలోనే తుంచేసింది. తెనాలి -విజయవాడ ప్రధాన రహదారిపై దుగ్గిరాలలోని కొమ్మమూరు లాకు వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన దుర్ఘటనలో విద్యార్థులు షేక్ యాసిన్ (17), నాగ నవీన్ (14) అక్కడికక్కడే మృతి చెందారు. లారీ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పారిపోతున్న డ్రైవర్ మునిపల్లి ప్రశాంత్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
స్థానికులు, పోలీసులు అందించిన సమాచారం మేరకు దుర్ఘటన వివరాలు ఇలావున్నాయి... మండల కేంద్రం దుగ్గిరాలలోని రామానగర్ (బంగళా ఏరియా)కు చెందిన షేక్ సాంబయ్య, పీరమ్మ దంపతుల కుమారుడు షేక్ యాసిన్(17) స్థానిక ఐటీఐ కళాశాలలో చదువుతున్నాడు. అదే కాలనీకి చెందిన ఆరేపల్లి కౌసల్య కుమారుడు నాగ నవీన్(14) జెడ్పీ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్నాడు. వీరిద్దరు ఇరుగుపొరుగు వారితో కలసి చిలువూరులో వ్యవసాయ కూలి పనులకు వెళ్లారు.
ఓ రైతు పొలంలో మొక్కజొన్న విత్తనాలు నాటి తిరిగి సైకిల్‌పై ఇంటికి వస్తుండగా, సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కొమ్మమూరు లాకు వద్ద కొల్లూరుకు చెందిన ఇటుక రాయి లారీ వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టింది. రోడ్డుపై స్పీడు బ్రేకర్లు ఉన్నా లారీ అతివేగంతో వచ్చి ఢీకొట్టడం వల్లే విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. లారీ నాగనవీన్ తలపై నుంచి వెళ్లగా, వెనుక టైరు కిందపడి యాసిన్ మృతి చెందాడు. దుర్ఘటన స్థలంలో ర క్తం మడుగు కట్టింది. సైకిల్ ధ్వంసమైంది.
రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబాలు...
విద్యార్థులు యాసిన్, నవీన్ కుటుంబాలు కూలి పనిచేసుకుని పొట్టపొసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ కూలి పనులకు వెళ్లి వస్తుండగా మృత్యువాత పడడం ఆ కాలనీవాసులను కలచివేసింది.
యాసిన్ తండ్రి షేక్ సాంబయ్య తాపీ పని చేస్తుండగా, తల్లి పీరమ్మ కూలి పనులకు వెళుతుంటుంది. వీరికి మరో ముగ్గురు కుమార్తెలు ఉండగా, ఓ కుమార్తెకు పెళ్లి చేశారు. మిగిలిన ఇద్దరు కుమార్తెలు ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్నారు.
నవీన్ తల్లి కౌసల్య కూడా కూలి పనులకు వెళుతూ పిల్లలను చదివించుకుంటుంది. వాస్తవంగా వీరిది కృష్ణా జిల్లా ఆగిరిపల్లి. భర్త వెంకటేశ్వరరావు రెండేళ్ల కిందట మృతి చెందడంతో పిల్లలు నవీన్, భార్గవిని తీసుకుని కౌసల్య దుగ్గిరాల వచ్చి తన తల్లివద్ద ఉంటుంది. కుమార్తె భార్గవి పదవ తరగతి చదువుతుంది.
కాలనీలో విషాద చాయలు...
ఒకే కాలనీకి చెందిన విద్యార్థులు యాసిన్, నాగనవీన్ మృతి చెందడంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి ఇళ్లకు కేవలం 200 మీటర్ల దూరంలోనే ఈ ప్రమాదం జరగడం అందిరిని కలచివేసింది. రెండు నిమిషాల్లో ఇళ్లల్లో ఉండాల్సిన విద్యార్థులు కానరాని లోకాలకు వెళ్లారంటూ ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్న తీరు అక్కడి వారితో కంటతడి పెట్టించింది. సంఘటన గురించి తెలియడంతో అప్పటివరకు వీరితో కలసి పనిచేసిన కూలీలు కూడా కంటతడిపెడుతూ అక్కడకు చేరుకున్నారు.
తెనాలి రూరల్ సీఐ యు. రవిచంద్ర, అదనపు ఎస్‌ఐ చేబ్రోలు అప్పారావు, తాలూకా ఎస్‌ఐ అనిల్ కుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేశారు.